ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాజస్థాన్ ద్వితీయ శ్రేణి పట్టణాల ప్రగతికి 30కోట్ల డాలర్ల రుణం ఎ.డి.బి., భారత్ సంతకాలు

Posted On: 12 OCT 2020 7:00PM by PIB Hyderabad

రాజస్థాన్ రాష్ట్రంలోని 14 ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధికి 30కోట్ల డాలర్ల రుణం కోసం భారత ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి.) ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాజస్థాన్ లోని 14 పట్టణాల్లో సుస్థిర నీటి సరఫరా, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, సేవల ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోసం ఈ రుణం తీసుకుంటున్నారు. రాజస్థాన్ ద్వితీయ శ్రేణి పట్టణాల అభివృద్ధి ప్రాజెక్టు అమలు లక్ష్యంగా రూపొందిన ఈ రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగంలోని ఎ.డి.బి., ఫండ్ బ్యాంక్ వ్యవహారాల అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే, ఎ.డి.బి.తరఫున ఆ బ్యాంకు ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ టకియో కోనిషీ సంతకాలు చేశారు.  

   ఈ సందర్భంగా సమీర్ కుమార్ ఖరే మాట్లాడుతూ,.. అభివృద్ధి ప్రాజెక్టు పరిధిలో ఉన్న పట్టణాల్లో పేదల జీవన ప్రమాణాలను పెంపొందించే మెరుగైన, సుస్థిర నీటి సరఫరాను ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.  నీటి సరఫరా, పారశుద్ధ్య సదుపాయాల ఏర్పాట్లు, పదేళ్లపాటు వాటి నిర్వహణ కాంట్రాక్టుతో కలపి చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా, మెరుగైన ప్రమాణాలతో కూడిన  సేవలందుతాయన్నారు. రాష్ట్రప్రభుత్వపు పట్టణ రంగ అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా ఈ సేవలు ఉంటాయని చెప్పారు.

  రాజస్థాన్ లో 2000సంవత్సరంనుంచి, ఎ.డి.బి. సహాయంతో చేపట్టిన 3 పట్టణ రంగ ప్రాజెక్టుల అమలు, కార్యాచరణలో లభించిన అనుభవాల సారాన్ని కూడా ఈ ఒప్పందంలో పొందుపరిచినట్టు కోనిషీ చెప్పారు. స్మార్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని, ఖర్చుకు తగిన ఫలితాలు రాబట్టుకునే ప్రక్రియలను ఇందులో చేర్చారు.  ఈ ప్రాజెక్టు అమలు చేయడంతో పట్టణ స్థానిక పరిపాలనా సంస్థలకు సాధికారత లభిస్తుందని, సంస్థాగత సామర్థ్యం పెరుగుతుందని, సంస్కరణలు మరింత సుస్థిరపడతాయని, మహమ్మారి లాంటి అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రించే సామర్థ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 8 పట్టణాల్లో 2027 నాటికి నీటి సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయని, 5,70,000 మంది ప్రజలకు ప్రయోజనం సిద్ధిస్తుందని, అలాగే 14 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చేపట్టే పారిశుద్ధ్య కార్యక్రమాలతో 7,20,000 మందికి ప్రయోజనం లఫభిస్తుందని భావిస్తున్నారు.  స్థానిక పట్టణ పరిపాలనా సంస్థలకు తగిన సాధికారత కల్పించే లక్ష్యంతో, ఎ.డి.బి. సాంకేతిక పరమైన మద్దతుతో రాజస్థాన్ పట్టణ నీరు, మురుగునీటి పారుదల, మౌలిక సదుపాయాల సంస్థను ఏర్పాటు చేశారు. ఒక కార్పొరేట్ తరహా సంస్థగా రూపొందింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మహిళలకు, ఎలాంటి అవకాశాలకు నోచుకోని నిమ్న వర్గాలకు నైపుణ్య శిక్షణ అందించి, ఇంటర్న్ షిప్ చెల్లిస్తారు. అలాగే వారికి  సామాజిక అవగాహన వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు.

  ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి అందించడంతోపాటు, పేదరిక నిర్మూలన లక్ష్యంతో ఎ.డి.బి. ఏర్పాటైంది. 1966వ సంవత్సరంలో స్థాపించిన ఎ.డి.బి.లో 49 ప్రాంతాలకు చెందిన 68 మంది సభ్యులు యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. 

****



(Release ID: 1663874) Visitor Counter : 111


Read this release in: English , Urdu , Hindi , Tamil