గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పీఎం స్వనిధి పథకం కింద వీధి ఆహారశాలలను ఆన్‌లైన్‌లోకి తెచ్చేందుకు స్విగ్గీతో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఎంవోయూ

అహ్మదాబాద్‌, చెన్నై, దిల్లీ, ఇండోర్‌, వారణాసి నగరాల్లో నమూనా ప్రాజెక్టులు

నమూనా పథకంలోకి వచ్చిన ఈ ఐదు నగరాల్లోని 250 మంది విక్రేతలు

మార్పులు చేసి ఆధునీకరించిన పీఎం స్వనిధి డాష్‌బోర్డ్‌ ప్రారంభం

దాదాపు 50 లక్షల వీధి వ్యాపారులకు ఉపయోగం

Posted On: 05 OCT 2020 5:28PM by PIB Hyderabad

'ప్రధానమంత్రి స్ట్రీట్‌ వెండార్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి' (పీఎం స్వనిధి) పథకంలో భాగంగా, కేంద్ర గృహ నిర్మాణ&పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, స్విగ్గీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. వీధి ఆహార విక్రేతలను స్విగ్గీలోకి తీసుకుని, వేలమంది వినియోగదారులకు వారిని అందుబాటులో ఉంచి, వ్యాపారాలను పెంచుకునేలా చేయడం అవగాహన ఒప్పందం ఉద్దేశం.  మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్‌ సమక్షంలో, వెబినార్‌ ద్వారా, సంయుక్త కార్యదర్శి శ్రీ సంజయ్‌ కుమార్‌, స్విగ్గీ ముఖ్య ఆర్థికాధికారి రాహుల్‌ బాత్రా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అహ్మదాబాద్‌, చెన్నై, దిల్లీ, ఇండోర్‌, వారణాసి మునిసిపల్‌ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

    సామాజిక దూరం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో, ఆన్‌లైన్‌ ఆర్డర్ల ద్వారా వినియోగదారులకు సేవలు అందించడం ద్వారా వీధి ఆహార విక్రేతల వ్యాపార స్వరూపాన్ని మార్చడం ఈ కొత్త అడుగు ఉద్దేశం. ఈ ఒప్పందానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తయ్యేలా, మునిసిపల్ కార్పొరేషన్లు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, స్విగ్గీ, జీఎస్‌టీ అధికారులు సహా సంబంధిత వర్గాలతో మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంది.

    అహ్మదాబాద్‌, చెన్నై, దిల్లీ, ఇండోర్‌, వారణాసి నగరాల్లోని 250 మంది విక్రేతలతో మంత్రిత్వ శాఖ, స్విగ్గీ కలిసి నమూనా ప్రాజెక్టులు నిర్వహిస్తాయి. పాన్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నమోదు, సాంకేతికత/యాప్‌ వినియోగంలో శిక్షణ, మెను, ధర డిజిటలీకరణ, పరిశుభ్రత, ప్యాకింగ్‌ విధానాల్లో వీధి విక్రేతలకు సాయం అందుతుంది. నమూనా ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే, దశలవారీగా దేశమంతా విస్తరించాలని మంత్రిత్వ శాఖ, స్విగ్గీ భావిస్తున్నాయి. వీధి ఆహార వ్యాపారులను సాంకేతికతతో శక్తిమంతం చేయడానికి, స్విగ్గీ వంటి ఈ-కామర్స్ వేదికతో కలవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందే మార్గాలను కల్పించడానికి మంత్రిత్వ శాఖ తీసుకున్న మరో చర్యగా ఈ భాగస్వామ్యాన్ని చూడవచ్చు.

    మార్పులు చేసి ఆధునీకరించిన పీఎం స్వనిధి డాష్‌బోర్డును కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ప్రారంభించారు. ఇది, ఈ పథకం పనితీరు మెరుగైన దృక్కోణాన్ని మాత్రమేగాక, పోలికల కోసం అదనపు సాధనాలను అందుబాటులోకి తెచ్చింది.

    కేంద్ర గృహ నిర్మాణ&పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి పీఎం స్వనిధి పథకాన్ని అమలు చేస్తోంది. కొవిడ్‌ కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన వీధి విక్రేతలకు కొంత మూలధనాన్ని అందించి, వారి వ్యాపారాలు పునఃప్రారంభించుకునేలా చేయడం ఈ పథకం ఉద్దేశం. పట్టణాలు, పట్టణ/గ్రామీణ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి 24వ తేదీ నాటికి ఉన్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు చేయూత అందించడం లక్ష్యం.
విడతల వారీగా ఏడాదిలో తిరిగి చెల్లించేలా రూ.10 వేల మూలధన రుణాన్ని వీధి వ్యాపారులకు ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తుంది. సకాలంలో లేదా ముందుగానే అప్పు చెల్లిస్తే, ఏడాదికి 7 శాతం వడ్డీ రాయితీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ముందస్తు చెల్లింపులపై ఎలాంటి రుసుము ఉండదు. డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహంలో భాగంగా, క్యాష్‌ బ్యాక్‌ ప్రోత్సాహకాల రూపంలో ఏడాదికి రూ.1200 వరకు అందిస్తుంది. రుణాలను సకాలంలో లేదా ముందస్తుగా చెల్లిస్తే, మరింత మెరుగైన రుణ పరిమితిని వీధి వ్యాపారులు పొందవచ్చు.

    పీఎం స్వనిధి పథకం కింద, అక్టోబర్‌ 4వ తేదీ నాటికి, దాదాపు 20 లక్షల రుణ దరఖాస్తులు  వచ్చాయి. వీటిలో 7.5 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందగా, 2.4 లక్షల రుణాలు మంజూరయ్యాయి.



(Release ID: 1661842) Visitor Counter : 270