నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

సౌర ప‌రిశ్ర‌మ‌ల‌ త‌యారీకి సంబంధించిన‌ ఇండియా పివి ఎడ్జ్ 2020 కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించ‌నున్న ఉన్న‌త‌స్థాయి విధాన నిర్ణేత‌లు

Posted On: 04 OCT 2020 12:46PM by PIB Hyderabad

భార‌త‌దేశంలో ఫోటో వోల్టాయిక్ (పివి) త‌యారీని వేగ‌వంతం చేయ‌డానికిగాను నీతి ఆయోగ్‌, పున‌:  వినియోగ ఇంధ‌న మంత్రిత్వ‌శాఖ‌, ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు క‌లిసి ఒక అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని విర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్నాయి. ఇండియా పివి ఎడ్జ్ 2020 పేరు మీద అక్టోబ‌ర్ 6న సాయంత్రం 5నుంచి8.40 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. 
వేఫ‌ర్స్ అండ్ సెల్స్‌, మాడ్యూల్స్ అండ్ ప్రొడ‌క్ష‌న్ ఎక్విప్ మెంట్‌, స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ అంశాల మీద ప్లీన‌రీ స‌మావేశంతోపాటు, త‌ర్వాత మ‌రికొన్ని స‌మావేశాలుంటాయి. ఇందులో పీవీ త‌యారీపైన పెట్టుబ‌డిదారుల స‌మావేశం కూడా వుంటుంది. ఈ స‌మావేశంలో త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ఇందులో ఇన్వెస్ట‌ర్ రౌండ్ టేబుల్ విభాగంలో సౌర త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చిస్తారు. విద్యుత్ శాఖ‌మంత్రి శ్రీ ఆర్ .కె.సింగ్‌తోపాటు పలువురు ఉన్న‌తాధికారులు ఈ విర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. దేశ విదేశాల‌కు చెందిన 60 మంది సిఇవోలు విర్చువ‌ల్ గా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. 
ప్ర‌పంచ ఆర్ధిక రంగంపై కోవిడ్ -19 మ‌హ‌మ్మారి పెను ప్ర‌భావం చూపింది. 2008-09 ఆర్ధిక సంక్షోభం త‌ర్వాత చేప‌ట్టిన ఉద్దీప‌న చ‌ర్య‌ల్లో ప‌ర్యావ‌ర‌ణ హితంకోసం చేప‌ట్టిన చ‌ర్య‌లు 16శాతమున్నాయి. కోవిడ్ 19 ప్ర‌భావంనుంచి బైట‌ప‌డ‌డానికి, భూతాపంతో రాబోయే ప్ర‌మాదాల‌ను ఎదుర్కోవ‌డానికిగాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వాలు ఆచితూచి పెట్టుబ‌డులు పెట్టాల్సి వ‌స్తోంది. ఈ క్లిష్ట స‌మ‌యంలో అంత‌ర్జాతీయ స‌హ‌కారం, బ‌లాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వాడుకోవ‌డం చాలా ముఖ్యం. 
సౌర విద్యుత్ ఉత్ప‌త్తి అనేది గ‌త ద‌శాబ్దంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా విస్త‌రించిన ప‌ర్యావ‌ర‌ణ హిత కార్య‌క్ర‌మం. దీని ద్వారా ఆర్ధిక వృద్ధి జ‌ర‌గ‌డ‌మే కాకుండా, ప‌ర్యావ‌ర‌ణానికి మేలు జ‌రుగుతుంది. ప్ర‌పంచంలోనే భార‌త‌దేశం... మూడో అతి పెద్ద సౌర సామ‌ర్థ్యంగ‌ల దేశం. 2030 నాటికి 450 గిగావాట్ల పున:  వినియోగ ఇంధ‌న ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా పెట్టుంది. ఇందులో సౌర విద్యుత్ వాటా 300 గిగావాట్లు. 
కోవిడ్ -19 మ‌హ‌మ్మారి ప్ర‌భావంనుంచి కోలుకోవ‌డానికిగాను కేంద్ర ప్ర‌భుత్వం ఆత్మ‌నిర్భ‌ర్ భారత్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా సౌర పీవీ త‌యారీని ఒక వ్యూహాత్మ‌క రంగంగా భార‌త్ భావిస్తోంది. త‌ద్వారా రానున్న రోజుల్లో సౌర పీవీ త‌యారీ రంగంలో అంత‌ర్జాతీయ కేంద్రంగా భార‌త్ రూపొందేలా చ‌ర్య‌లు చేపట్టారు. దేశంలో దేశీయ‌, అంతార్జాతీయ సంస్థ‌లు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గిగా ఫ్యాక్ట‌రీలను ప్రారంభిస్తున్నాయి. సౌర త‌యారీ రంగంలో అంత‌ర్జాతీయ‌స్థాయిని తీసుకురావ‌డానికిగాను ప‌లు వినూత్న చ‌ర్య‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న అంత‌ర్జాతీయ స్థాయి సాంకేతిక‌త‌ను తీసుకురాగ‌లిగే సంస్థ‌ల‌ను ఒక చోట‌కు తెచ్చి పీవీ తయారీ రంగంలో వారి సేవ‌ల‌ను వినియోగించుకోవ‌డానికి ఇది స‌రైన స‌మ‌య‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. భార‌త‌దేశ విధాన నిర్ణేత‌లు ఈ రంగంలో అందించే ప‌థ‌కాల గురించి తెలుసుకోవ‌డానికి ఈ రంగానికి చెందిన కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. 
అత్యాధునిక గిగాస్థాయి సౌర త‌యారీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడ‌డంకోసం ఈ రంగానికి సంబంధించిన అన్ని కంపెనీల‌ను ప్ర‌స్తుత స‌మావేశానికి ఆహ్వానించారు. ఈ స‌మావేశం త‌ర్వాత మ‌రిన్ని చ‌ర్చ‌లు జ‌రిగి భాగ‌స్వామ్యాలు, పొత్తులు ఏర్ప‌డ‌తాయి. 
పారిస్ ఒప్పందం 2015లో జ‌రిగింది. దీనికి సంబంధించి అసాధార‌ణ దార్శ‌నిక‌త‌, నాయ‌క‌త్వ ప‌టిమ‌, ద‌యార్ద్ర హృద‌యం, విజ్ఞానంతో వాతావ‌ర‌ణ మార్పుల‌పై యుద్ధం చేయాల్సి వుంటుంద‌ని భార‌త‌దేశ ఎన్ డిసి డాక్యుమెంట్ పేర్కొంది. ఈ దిశ‌గా వేసిన చిన్న అడుగే ఇండియా పీవీ ఎడ్జ్ 2020 స‌మావేశం. ఈ స‌మావేశంలో పాల్గొనాల‌నుకునేవారు సంప్ర‌దించాల్సిన ఈమెయిల్ అడ్ర‌స్ pvedge2020[at]gmail[dot]com. హాజ‌రు కావాల‌నుకునేవారు రిజిస్ట‌ర్ చేయించుకోవాల్సిన లింకు https://www.investindia.gov.in/pv-edge-2020-registration

 

***
 



(Release ID: 1661547) Visitor Counter : 181