వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల కన్సల్టేషన్ కార్యక్రమం నిర్వహించిన నీతి ఆయోగ్

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, చత్తీస్ గఢ్ ప్రతిపాదనలను అమలుపరిచేందుకు అనుమతులు కూడా మంజూరు చేసింది - కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 29 SEP 2020 9:06PM by PIB Hyderabad

ప్రకృతిసిద్ధమైన వ్యవసాయం అందించే సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను సంపూర్ణంగా వినియోగించుకుని రైతుల సంక్షేమం, వినియోగదారుల ఆరోగ్యం, ఆహార భద్రత, పౌష్టికాహార సాధనకు చేయవలసిన కృషిపై చర్చించేందుకు నీతి ఆయోగ్ ఈ విభాగంలోని భాగస్వాములందరితోనూ రెండు రోజుల (సెప్టెంబర్ 29,30) జాతీయ స్థాయి సంప్రదింపుల కార్యక్రమం చేపట్టింది.

కేంద్ర ఆరోగ్య, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శతాబ్దాలుగా భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నీతి ఆయోగ్ కృషిని ఆయన ప్రశంసించారు. దీన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపులు కూడా చేసిన విషయం గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయం కోసం ఆంధ్రప్రదేశ్, కేరళ, చత్తీస్ గఢ్ వంటి రాష్ర్టాలు పంపిన ప్రతిపాదనలు అమలు చేయడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేసినట్టు చెప్పారు.

గుజరాత్ లో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 12 లక్షల హెక్టార్లను ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో గుజరాత్ లో 1.20 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించారని, మరో 5.50 లక్షల మంది దాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలను వివరిస్తూ ఈ విధానంలో ఉపకరణాల వ్యయాలు జీరో స్థాయిలో ఉంటాయి. నీటి పారుదల వసతుల అవసరం సైతం 60 నుంచి 70% తగ్గుతుంది. ఆర్గానిక్ కార్బన్ స్థాయి 0.5 నుంచి 0.9కి పెరుగుతుంది. ఈ తరహా ఉత్పత్తుల మార్కెటింగ్ కు ఎలాంటి అవరోధాలు లేవు. ప్రీమియం నాణ్యత గల గోధుమ క్వింటాలు రూ.4000కి మార్కెటింగ్ చేయవచ్చు. సాంప్రదాయిక విధానంలో పండించే గోధుమకు లభించే ధర రూ.1900 మాత్రమే అని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలను ప్రచారం చేయడంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ కృషిని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసిస్తూ ప్రస్తుతం దాని ఆమోదనీయత, ఆచరణ పరివర్తిత దశలో ఉన్నాయన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచే చర్యల్లో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని భారత్ యోచిస్తున్నదన్నారు. భవిష్యత్ కార్యాచరణలో కొత్త విధానానికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు, ఉత్పత్తుల గుర్తింపు, విలువ ఆధారిత వ్యవస్థ, మార్కెటింగ్ వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేశ్ చంద్ చెప్పారు. ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం కీలక పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఆహార సరఫరా వ్యవస్థ కొనసాగింపును నిర్వహించేందుకు ఆచరణీయమైన వ్యూహాల రూపకల్పన, ఉమ్మడి అవగాహనకల్పన ప్రాధాన్యం గురించి నీతి ఆయోగ్ సిఇఓ శ్రీ అమితాబ్ కాంత్ నొక్కి చెప్పారు.

ఈ రెండు రోజుల సంప్రదింపుల కార్యక్రమంలో నాలుగు టెక్నికల్ సెషన్లున్నాయి. అవి ప్రకృతి వ్యవసాయం (జాతీయ, అంతర్జాతీయ ధోరణులు);  దేశంలో ప్రకృతి వ్యవసాయం విజయగాథలు;  ప్రకృతి వ్యవసాయం (ఆచరణ, ప్రభావం మదింపు);  ప్రకృతి వ్యవసాయం (రైతుల సంఘాలు, అనుభవాలు, సవాళ్లు). నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేశ్ చంద్, ఆచార్య దేవవ్రత్, కొల్హాపూర్ కనేరి మఠానికి చెందిన  కాద్ సిద్ధేశ్వర స్వామీజీ ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు.

వ్యవసాయ క్షేత్రాల స్థాయిలో ప్రకృతి వ్యవసాయం అమలు, ఆచరణలో క్రమబద్ధమైన విధానం ఆచరించడం;  కృషి విజ్ఞాన్ కేంద్రాలు, రాష్ర్టాల వ్యవసాయ శాఖలు, ప్రైవేటు రంగం, సహకార వ్యవస్థ, ఎన్ జిఓల  ద్వారా భారత వ్యవసాయ పరిశోధన మండలి చేపట్టవలసిన విస్తరణ, శిక్షణ  కార్యక్రమాలు;  పంటల ఆరోగ్యం, ఉత్పాదకతల్లో శాస్ర్తీయ దృక్పథం కారణంగా సాధించి విజయగాథలు, అత్యుత్తమ విధానాలపై ఒక పత్రం రూపకల్పన వంటి విభాగాల్లో ఈ కన్సల్టేషన్ కార్యక్రమం మంచి ఫలితాలు అందించగలదని అందరూ ఆశాభావం ప్రకటిస్తున్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, శాస్త్రవేత్తలు;  వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థలు, ట్రస్టులు, ఎన్ జిఓల నిపుణులు;  అంతర్జాతీయ సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు ఈ కన్సల్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

***
 



(Release ID: 1660246) Visitor Counter : 139