ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

అక్టోబర్‌ 5-9 తేదీల్లో, కృత్రిమ మేధపై భారీ వర్చువల్‌ సమ్మిట్‌- 'రైజ్‌ 2020'

"రెస్పాన్సిబుల్‌ ఏఐ ఫర్‌ సోషల్‌ ఎంపవర్‌మెంట్‌-2020' సమ్మిట్‌ను అక్టోబర్‌ 5వ తేదీన ప్రారంభించనున్న ప్రధాని శ్రీ మోదీ

ప్రపంచ కృత్రిమ మేధ పరిశ్రమ ప్రతినిధుల మధ్య సమ్మిట్‌లో చర్చలు

Posted On: 24 SEP 2020 6:38PM by PIB Hyderabad


    కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌ కలిసి "రెస్పాన్సిబుల్‌ ఏఐ ఫర్‌ సోషల్‌ ఎంపవర్‌మెంట్‌ (రైజ్‌)-2020' సమ్మిట్‌ను అక్టోబర్‌ 5-9 తేదీల్లో నిర్వహించనున్నాయి. ఇది ప్రపంచ మేధావుల సదస్సు. సామాజిక మార్పు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, స్మార్ట్‌ మొబిలిటీతోపాటు అనేక రంగాల్లో కొత్త ఆవిష్కరణల చేర్పు, సాధికారత కోసం కృత్రిమ మేధను ఉపయోగించే ఆలోచనలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేధ పరిశోధన, విధానాలు, ఆవిష్కరణల నిపుణులు, ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. 'మహమ్మారి సంసిద్ధత కోసం ఏఐ అభివృద్ధి', 'డిజిటలీకరణలో ఆవిష్కరణలకు ప్రేరణ', ‘సమగ్ర ఏఐ’, ‘విజయవంతమైన ఆవిష్కరణ కోసం భాగస్వామ్యాలు’ వంటి అంశాలపై ముఖ్య ఉపన్యాసాలు, పానెల్‌ చర్చలు ఉంటాయి.

    కృత్రిమ మేధ సంబంధిత రంగాల్లో పనిచేసే కొన్ని అంకుర సంస్థలు కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొంటాయి. ఈ అంకుర సంస్థలను 'ఏఐ సొల్యూషన్‌ ఛాలెంజ్‌' ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్‌ 6వ తేదీన జరగనున్న 'ఏఐ స్టార్టప్‌ పిచ్ ఫెస్ట్‌'లో వాటి ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. ప్రపంచానికి చాటడం, గుర్తింపు, మార్గదర్శనం ద్వారా సాంకేతిక రంగ పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్దతులో ఇది భాగం.

    కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతికత శాఖ కార్యదర్శి శ్రీ అజయ్‌ ప్రకాశ్‌ మాట్లాడుతూ, "పారిశ్రామిక రంగానికి ఉత్ప్రేరకంగా ఏఐ మారింది. అభివృద్ధి వేగవంతంలో మార్పు తెచ్చే పాత్రను పోషిస్తోంది. సామాజిక సాధికారత వేగవంతంలో ఏఐ పాత్రను మరింత లోతుగా సమ్మిట్‌ చర్చిస్తుంది. ఆరోగ్యం కోసం ఏఐ, వ్యవసాయం, విద్య, నైపుణ్యత, మొబిలిటీ, ఫిన్‌టెక్‌, పరిశోధన, సమగ్ర ఏఐ, భవిష్యత్‌ ఉపాధి, బాధ్యతాయుత ఏఐ వంటి విభాగాలు రైజ్‌-2020 సమ్మిట్‌లో ఉన్నాయి. ఏఐలో ప్రపంచస్థాయి ఉత్తమ మేధావుల సమావేశ వేదికగా ఈ సమ్మిట్‌ సేవలు అందిస్తుంది" అని చెప్పారు.

    ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థకు నిలయంగా, ఐఐటీల వంటి ఉన్నతస్థాయి శాస్త్ర, సాంకేతిక సంస్థలతో, బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలతో, ఏటా మిలియన్ల కొద్దీ తయారయ్యే స్టెమ్‌ గ్రాడ్యుయేట్లతో... ఏఐ అభివృద్ధిలో ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగేందుకు భారత్‌ మంచి స్థాయిలో ఉంది. 2035 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు 957 బిలియన్‌ డాలర్లను ఏఐ జోడిస్తుందని పారిశ్రామికవేత్తల అంచనా. 'సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌' స్ఫూర్తితో, అందరికీ ఏఐ వ్యూహంతో సమగ్ర అభివృద్ధి కోసం కృత్రిమ మేధను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ప్రధాని ఆలోచన ప్రకారం ఏఐలో ప్రపంచ నాయకుడిగానే కాక, సామాజిక సాధికారత కోసం ఏఐని ఎలా బాధ్యతాయుతంగా నిర్దేశించవచ్చో ప్రపంచానికి చూపే నమూనాగా కూడా భారత్‌ నిలుస్తుంది.

    నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ, "వ్యవసాయం నుంచి ఫిన్‌టెక్‌ వరకు, ఆరోగ్య సంరక్షణ నుంచి మౌలిక సదుపాయల వరకు, నిజమైన మార్పు తేగల శక్తిగా కృత్రిమ మేధ ఉంటుంది. ప్రపంచ కృత్రిమ మేధ పరిశోధనశాలగా భారత్‌ మారింది. సాధికారత ద్వారా సమగ్ర అభివృద్ధి, వికాసానికి తోడ్పడుతోంది. ప్రపంచ ప్రజల జీవితాలను మార్చే మెట్టుగా ఉన్నత సమాచార వాతావరణాన్ని సృష్టించడం ఈ సమ్మిట్ లక్ష్యం" అని చెప్పారు.

    కృత్రిమ మేధను నైతికంగా వృద్ధి చేసి, పాటించాల్సిన అవసరంపై సామూహిక అవగాహన కల్పించే ఆలోచనల మార్పిడిని రైజ్‌ 2020 (http://raise2020.indiaai.gov.in/) సులభతరం చేస్తుంది.

రైజ్‌ 2020 గురించి:
    బాధ్యతాయుత కృత్రిమ మేధ ద్వారా సామాజిక పరివర్తన, సాధికారత కోసం భారతదేశ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ తరహాలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచస్థాయి మేధావుల సమావేశం ఇది. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు, కీలక అభిప్రాయ నిర్ణేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తల బలమైన భాగస్వామ్యం ఈ సమ్మిట్‌లో కనిపిస్తుంది.

***


(Release ID: 1658821) Visitor Counter : 197


Read this release in: English , Hindi , Marathi , Tamil