కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
చారిత్రాత్మకమైన 3 కార్మిక బిల్లులకు లోక్ సభ ఆమోదం.
కార్మిక సంక్షేమంలో ‘గొప్ప మలుపు’గా చెప్పదగిన
నిబంధనలపై కేంద్ర మంత్రి గాంగ్వర్ వివరణ
Posted On:
22 SEP 2020 8:16PM by PIB Hyderabad
సంఘటిత, అసంఘటిత రంగాలు, స్వయం ఉపాధికి చెందిన 50కోట్ల మంది కార్మికులకు వర్తింపు, కనీస వేతనాలు, సామాజిక భద్రతతో కూడిన ప్రయోజనాలు
స్వయం ఉపాధి పొందేవారితో సహా కార్మికులందరికీ వర్తించేలా ఇ.ఎస్.ఐ.సి., ఇ.పి.ఎఫ్.ఒ. సామాజిక భద్రతా పరిధి విస్తరణ
40కోట్ల మంది అసంఘటిత రంగం కార్మికులకు “సామాజిక భద్రతా నిధి” ఏర్పాటు.
పురుషులతో సమానంగా మహిళా కార్మికులకు వేతనం
రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా నిర్ణీత కాలవ్యవధి ఉద్యోగికి సర్వీసు నిబంధనలు, గ్రాట్యుటీ, సెలవులు, సామాజిక భద్రతా సదుపాయాలు
అంతర్జాతీయ స్థాయి రక్షణ వాతావరణ కల్పించేందుకు వీలుగా “జాతీయ వృత్తిగత రక్షణ, ఆరోగ్య మండలి” ఏర్పాటు
వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచనంలో డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా చేరిక
ఆన్ లైన్ లో జి.ఐ.జి., ప్లాట్ ఫాంలపై పనిచేసే వారితో సహా తోటల్లో పనివారికీ ఇ.ఎస్.ఐ.సి. ప్రయోజనాలు
కాంట్రాక్టర్ తీసుకువచ్చివారికే కాకుండా వలస కార్మికులందరికీ ప్రయోజనాల వర్తింపు
మరింత మెరుగ్గా సయాయం అందించేందుకు వలస కూలీల సమాచారంపై డాటాబేస్ చట్టం ద్వారా ఏర్పాటు,..
వలస కూలీలకు ఏడాదిలో ఒకసారి సొంత ఊరికి వెళ్లేందుకు యాజమానినుంచి ప్రయాణ అలవెన్స్
వలస కూలీల సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్
మెరుగైన ఉత్పత్తి, మరిన్ని ఎక్కువ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సామరస్య పూరిత పారిశ్రామిక సంబంధాలను పెంపొందించే చట్టాలు
ఒకే రిజిస్ట్రేషన్, ఒకే లైసెన్స్, ఒకే రిటర్న్ కు అవకాశం కలిగిస్తూ పారదర్శకమైన, జవాబ్దారీతనంతో కూడిన, సరళమైన యంత్రాగం ఏర్పాటు
తనిఖీ అధికారి ఇకపై సదుపాయాల కల్పనాధికారిగా కూడా వ్యవహరించే అవకాశం. తనిఖీ రాజ్యం స్థానంలో వెబ్ ఆధారిత తనిఖీ వ్యవస్థ ఏర్పాటు
చారిత్రాత్మకమైన కార్మిక సంస్కరణలకోసం ప్రవేశపెట్టిన 3 బిల్లులు కార్మిక సంక్షేమ సంస్కరణల్లో గొప్ప మలుపును తీసుకువస్తాయని, సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన 50కోట్ల మందికి కార్మికులకు ఈ సంస్కరణలు వర్తిస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి సంతోష్ గాంగ్వర్ ప్రకటించారు. కాంట్రాక్ట్ కార్మికులకు, ఆన్ లైన్ లో జి.ఐ.జి., ప్లాట్ ఫాంలపై పనిచేసే వారికి కూడా ఈ సంస్కరణలు వర్తిస్తాయని, స్వయం ఉపాధి రంగంలో ఉన్న కార్మికుల సామాజిక భద్రతకు కూడా దోహదపడతాయని అన్నారు. కార్మిక బిల్లులపై లోక్ సభలో జరిగిన చర్చకు కేంద్ర మంత్రి ప్రతిస్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2020 సెప్టెంబర్ 22న 3 కార్మిక బిల్లులకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. పారిశ్రామిక సంబంధాల బిల్లు, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు, సామాజిక భద్రతా నియమావళి బిల్లులను లోక్ సభ ఆమోదించింది. దేశంలో ఎంతో ఆవశ్యకమైన కార్మిక సంస్కరణలను తీసుకురావాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధిలో భాగంగా ఈ బిల్లులను రూపొందించారు. 73 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం తీసుకురానన్ని కార్మిక సంస్కరణలతో ఈ బిల్లులు తయారయ్యాయి. ఇందుకు సంబంధించి అన్ని భాగస్వామ్య వర్గాలతో గత ఆరేళ్లుగా చర్చలు, సంప్రదింపులను కూడా ప్రభుత్వం నిర్వహించింది. ట్రేడ్ యూనియన్లు, యాజమాన్యాలతో భేటీలు, నాలుగు సబ్ కమిటీ సమావేశాలు, 10 ప్రాంతీయ సమావేశాలు, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య 10సార్లు సంప్రదింపులు జరిపారు. దీనికి తోడు,.. పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రియాశీలక నాయకత్వంలో,.. బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం 2014నుంచి అనేక చర్యలు తీసుకుందని ‘శ్రమయేవ జయతే’, ‘సత్యమేవ జయతే’ నినాదాలకు సమ ప్రాముఖ్యం ఇస్తోందని కేంద్ర మంత్రి గాంగ్వర్ చెప్పారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తెలుసుకుందని, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడానికి, ఇతర సంక్షేమ చర్యలు చేపట్టడానికి తమ మంత్రిత్వ శాఖ నిర్విరామంగా కృషి చేస్తూ వస్తోందని చెప్పారు కోవిడ్19 మహమ్మారి వ్యాప్తి సమయంలో కూడా తమ మంత్రిత్వ శాఖ కృషిని కొనసాగించిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో అనేక చర్యలు తీసుకుందన్నారు. కార్మిక సోదరీమణులకు ప్రసూతి సెలవులను 12వారాలనుంచి 26 వారాలకు పెంచడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టిందన్నారు. ప్రధానమంత్రి ప్రోత్సాహన్ రోజ్ గార్ యోజన కింద మహిళలు గనుల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను, కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) సదుపాయాలను విస్తృతం చేసినట్టు చెప్పారు.
లోక్ సభలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి సమాధానమిస్తూ, దేశ సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, కార్మికుల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ బిల్లులు చేపట్టామన్నారు. ఎక్కువ సంఖ్యలో చట్టాలవల్ల కార్మికులు ఎక్కువ బాధలు పడుతున్నారని, అమలు ప్రక్రియలో సంక్లిష్టతల కారణంగా వారి సంక్షేమ, రక్షణ చర్యలకు తరచూ విఘాతం కలుగుతోందన్నారు. 29 కార్మిక చట్టాలను సంక్షిప్తంగా సరళీకరించి, అవగాహనకు వీలుగా పారదర్శకమైన రీతిలో 4 చట్టాలుగా రూపొందించామని, వాటిలో వేతనాలపై బిల్లు,.. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా మారిందన్నారు. కార్మికులకు సంబంధించిన 29 చట్టాలు 4 చట్టాలుగా మారాయని చెప్పారు. 29 చట్టాలు 4 చట్టాలుగా మారిన తీరు ఈ కింది విధంగా ఉంది.:
కార్మిక చట్టం పేరు
|
విలీనమైన చట్టాలు, వాటి సంఖ్య
|
వేతన చట్టం
|
4 చట్టాలు :-
వేతనాల చెల్లింపు చట్టం 1936, కనీస వేతనాల చట్టం 1948, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన పారితోషక చట్టం 1976
|
పారిశ్రామిక సంబంధాల చట్టం
|
3 చట్టాలు:-
ట్రేడ్ యూనియన్ల చట్టం 1926, పారిశ్రామిక ఉపాధి (స్థాయీ ఉత్తర్వులు) చట్టం 1946, పారిశ్రామిక వివాదాల చట్టం 1947
|
వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల (ఒ.ఎస్.హెచ్) చట్టం
|
13 చట్టాలు:-
ఫ్యాక్టరీల చట్టం 1948, తోటల కార్మికుల చట్టం 1951, గనుల చట్టం 1952, వర్కింగ్ జర్నలిస్టులు, ఇతర వార్తా పత్రికల చట్టం (సర్వీసు పరిస్థితులు) మిస్సలేనియర్ నిబంధనల చట్టం 1955, వర్కింగ్ జర్నలిస్టుల (వేతన రేట్ల ఖరారు) చట్టం 1958, మోటారు రవాణా కార్మికుల చట్టం 1961, బీడీ, సిగార్ తయారీ కార్మికుల (ఉపాధి పరిస్థితుల) చట్టం1966, కాంట్రాక్ కార్మికుల (నియంత్రణ, రద్దు) చట్టం 1970, అమ్మకాల ప్రోత్సాహక ఉద్యోగుల (సర్వీసు పరిస్థితుల) చట్టం 1976, అంతర్రాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి నియంత్రణ, సర్వీసు పరిస్థితుల) చట్టం1979, సినీ కార్మికుల, సినిమా థియేటర్ కార్మికుల (ఉపాధి నియంత్రణ) చట్టం 1981, రేవు కార్మికుల (భద్రత, ఆరోగ్యం, సంక్షేమం) చట్టం 1986, భవన, ఇతర నిర్మాణా కార్మికుల (ఉపాధి నియంత్రణ, సర్వీసు పరిస్థితుల) చట్టం 1996.
|
సామాజిక భద్రతా చట్టం
|
9 చట్టాలు:-
ఉద్యోగుల నష్ట పరిహార చట్టం 1923, ఉద్యోగ రాజ్య బీమా చట్టం1948, ఉద్యోగుల భవిష్య నిధి, మిస్సలేనియస్ నిబంధనల చట్టం 1952, ఉపాధి కల్పనా శాఖల (ఖాళీల నోటిఫికేషన్ నిర్బంధ) చట్టం 1959, ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972, సినీ కార్మికుల సంక్షేమ నిధి చట్టం 1981, భవనాల, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సుంక చట్టం 1996, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008.
|
మొత్తం చట్టాలు
|
29
|
12 కార్మిక చట్టాలను 2014నుంచి రద్దయ్యాయి.
కొత్త కార్మిక చట్టాలతో ఒనగూడే ప్రయోజనాలను మంత్రి గాంగ్వర్ వివరిస్తూ, వివిధ చట్టాల కింద ప్రయోజనాలను పొందేందుకు దేశంలోని కార్మికులందరికీ అర్హత ఉందన్నారు. లోక్ సభ ఆమోదించిన 3 బిల్లుల ప్రధాన అంశాలను ఆయన ఈ కింది విధంగా ప్రస్తావించారు. :-
(ఎ) సామాజిక భద్రతా చట్టం 2020
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) పరిధిని విస్తృతం చేయడం: ఇ.ఎస్.ఐ.సి. కింద సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో కార్మికులకు ఆరోగ్య భద్రతా హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.:-
(1) ఇ.ఎస్.ఐ.సి. ద్వారా సదుపాయం ఇకపై దేశంలోని 740 జిల్లాలకూ అందజేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం 566 జిల్లాలకే అందుతోంది.
(2) వృత్తిపరంగా ప్రమాదకరమైన రంగాలకు సంబంధించిన సంస్థలన్నీ తప్పనిసరిగా ఇ.ఎస్.ఐ.సి.తో అనుసంధానం కావాలి. సదరు సంస్థలో ఒకే కార్మికుడు పనిచేస్తున్నా సరే.. ఈ నిబంధన పాటించడం తప్పనిసరి.
(3) అసంఘటిత రంగ, కాంట్రాక్ట్ కార్మికులకు ఆరోగ్య భద్రతా పథకం ప్రయోజనాలు కల్పించేందుకు ఇ.ఎస్.ఐ.సి. సంస్థతో అనుసంధానం చేస్తూ నిబంధనలు
(4) తోటల కార్మికులను అనుసంధానం చేసే బాధ్యతను తోటల యజమానులకు అప్పగించడం
(5) 10 మంది కార్మికులకంటే తక్కువ మంది పనిచేసే సంస్థలకు కూడా ఇ.ఎస్.ఐ.సి.లో సభ్యత్వం తీసుకునేందుకు అవకాశం.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇ.పి.ఎఫ్.ఒ.) పరిధిని విస్తృతం చేయడం:
(1) 20మంది కార్మికులు పనిచేసే సంస్థలన్నింటికీ ఇ.పి.ఎఫ్.ఒ. నిబంధనలను వర్తింపజేయడం. ఇపుడు కేవలం షెడ్యూల్ లో చేర్చిన సంస్థలకు మాత్రమే ఇ.పి.ఎఫ్. నిబంధలను వర్తింపజేస్తున్నారు.
(2) 20కంటే తక్కువ మంది పనిచేసే సంస్థలకు కూడా ఇ.పి.ఎఫ్.ఒ.లో ఐచ్ఛికంగా చేరే అవకాశం కల్పించడం.
(3) ‘స్వయం ఉపాధి’ కేటగిరీలోని కార్మికులకు లేదా ఇ.పి.ఎఫ్.ఒ. ఛత్రం కిందకి వచ్చే ఎలాంటి కేటగిరీలోని ఉన్న కార్మికులకైనా పథకాలను వర్తింపజేయడం.
- అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు వివిధ రకాల పథకాలను వర్తింపజేయడానికి నిబంధనలను రూపొందించారు. ఆర్థికపరంగా ఈ పథకాలను అమలు చేయడానికి వీలుగా “సామాజిక భద్రతా నిధి” పేరిట ఒక నిధిని ఏర్పాటు చేశారు.
- సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులతో ఆన్ లైన్లో “ప్లాట్ ఫాంపై, జి.ఐ.జి.పై పనిచేసే వారి” పేరిట వచ్చిన కొత్త తరహా కార్మికులను సామాజిక భద్రతా చట్టం నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి జరిగింది. ఈ కార్మికులను సామాజిక భద్రతా చట్టం పరిధిలోకి తీసుకు వచ్చిన అతి తక్కువ దేశాల సరసన భారత్ చేసింది.
- నిర్ణీత కాలవ్యవధి పాటు పనిచేసే ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ చెల్లింపు నిబంధనను వర్తింపజేశారు. గ్రాట్యుటీకి అర్హత పొందడానికి కనీస సర్వీసు వ్యవధి ఉండాలన్న షరతు ఇక ఉండబోదు. కాంట్రాక్ట్ పై నిర్ణీత కాలవ్యవధిపాటు పనిచేసిన ఉద్యోగికి కూడా రెగ్యులర్ (సర్వీసు) ఉద్యోగిలాగే సామాజిక భద్రతా హక్కును పొందేందుకు అవకాశం కల్పించారు. ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి.
- అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల సమాచారంతో జాతీయ స్థాయి డాటా బేస్ తయారు చేసే లక్ష్యంతో, ఈ కార్మికులను అందరినీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేస్తారు. ఈ నమోదు ప్రక్రియను కూడా సరళమైన రీతిలో కార్మికులు స్వయంగా ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా చేపడతారు. అసంఘటిత రంగంలోని వారందరికీ వివిధ సామాజిక భద్రతా పథకాల కింద అందవలసిన ప్రయోజనాలన్నీ వర్తింపజేసేందుకు ఈ నమోదు ప్రక్రియ వీలు కల్పిస్తుంది. సామాజిక భద్రతను ‘లక్ష్యానికి తగినట్టుగా” అసంఘటిత రంగం కార్మికులకు కూడా అందించేందుకు సాధ్యమైందని చెప్పుకోవడానికి ఈ డాటాబేస్ దోహదపడుతుంది.
- ఉద్యోగ సాధనలో అతి ముఖ్యమైన అంశం,.. ఉద్యోగ ఖాళీలపై సమాచారం తెలియడం. ఉద్యోగ ఖాళీలపై సమాచారం బహిర్గతం చేయాలన్న లక్ష్యంతో చట్టంలో తగిన చర్య తీసుకున్నారు. 20మంది, అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థల్లో ఏర్పడే ఉద్యోగ ఖాళీలపై సమాచారాన్ని సదరు సంస్థలు ఇకపై తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. ఇదే సమాచారాన్ని ఆన్ లైన్ పోర్టల్స్ లో పొందుపరుస్తారు.
(బి) వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల (ఒ.ఎస్.హెచ్.) చట్టం 2020
- కార్మికులకు ప్రతియేటా ఒకసారి వైద్యపరీక్షను యజమాన్యం నిర్వహించాలి.
- ఉద్యోగ నియామకపత్రం పొందే చట్టబద్ధమైన హక్కును కార్మికులకు తొలిసారిగా కల్పించారు.
- సినీ కార్మికులను దశ్య శ్రవణ కార్మికులుగా పేర్కొన్నారు. దీనితో మరింత మంది కార్మికులకు,.. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టంద్వారా భద్రత లభిస్తుంది. అంతకు ముందు ఈ భద్రతను చలన చిత్రాల్లో పనిచేసే కళాకారులకు (ఆర్టిస్టులకు) మాత్రమే కల్పించేవారు.
(సి) పారిశ్రామిక సంబంధాల చట్టం 2020
కార్మికుల వివాదాల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
(1) పారిశ్రామిక వివాదాల ట్రిబ్యునల్ లో ఒకే సభ్యుడికి కాకుండా ఇద్దరికి అవకాశం కల్పించడం. ఒక వేళ దీనితో,.. ఒక సభ్యుడు గైర్హాజరైనప్పటికీ పని సజావుగా సాగేందుకు అవకాశం ఉంటుంది.
(2) రాజీ ప్రతిపాదనల స్థాయిలో వివాదం పరిష్కారం కానిపక్షంలో సదరు వివాదాన్ని నేరుగా ట్రిబ్యునల్ సమక్షానికి తీసుకెళ్లేందుకు తగిన ఏర్పాటు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి మాత్రమే వివాదాన్ని ట్రిబ్యునల్ కు బదలాయించే అవకాశం ఉంది.
(3) ట్రిబ్యుల్ తీర్పు ప్రకటించిన నెల రోజుల్లోగా సదరు తీర్పును అమలు చేయడం.
(4) నిర్ణీత కాలవ్యవధి ఉద్యోగంగా గుర్తించిన తర్వాత, సదరు కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులుగా కాకుండా నిర్ణీత కాల వ్యవధి ఉద్యోగిగానే అవకాశం లభిస్తుంది. ఈ నిబంధన ప్రకారం రెగ్యులర్ సర్వీసు ఉద్యోగుల్లాగే వారికి,. నిర్ణీత పని గంటలు, వేతనం, సామాజిక భద్రత, తదితర సంక్షేమ ప్రయోజనాలు లభిస్తాయి.
(5) ట్రేడ్ యూనియన్లకు మరింత మెరుగైన, పటిష్టమైన భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఒక నిబంధనను చట్టంలో చేర్చారు. ఏ వివాదంపై అయినా చర్చలు చేపట్టడానికి వీలుగా “చర్చల సంఘం” , “చర్చల మండలి” ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ ఏర్పాటుతో చర్చల ద్వారా వివాద పరిష్కారానికి వీలు కలుగుతుంది. కార్మికులు కూడా మరింత మెరుగైన రీతిలో తమ హక్కులను పొందగలుగుతారు.
(6) ట్రేడ్ యూనియన్ల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ కు వెళ్లే ఏర్పాటును చట్టంలో కల్పించారు.
(7) కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో ట్రేడ్ యూనియన్లకు గుర్తింపు ఇచ్చేందుకు కూడా ఏర్పాటు కల్పించారు. కార్మిక చట్టాల్లో ఈ తరహా గుర్తింపును ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ గుర్తింపు కారణంగా కేంద్రం స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ట్రేడ్ యూనియన్లు మరింత స్థిరంగా, పటిష్టంగా తమ సేవలందించే అవకాశం ఉంటుంది.
(8) ఉద్యోగులకు నైపుణ్యాలను తిరిగి నేర్పించేందుకు రీ స్కిల్లింగ్ నిధిని చట్టంతో తొలిసారిగా ఏర్పాటు కల్పించారు. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు తిరిగి నైపుణ్యాలను నేర్పించే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేశారు. దీనితో వారు సునాయాసంగా తిరిగి ఉద్యోగం పొందే వీలుంటుంది. రీస్కిల్లింగ్ కోసం కార్మికులకు నెలకు 15రోజుల చొప్పున వేతాన్ని 45రోజుల వ్యవధిలో చెల్లిస్తారు.
వలస కూలీలపై నిర్వచనాన్ని తాము మరింత విస్తృతం చేసినట్టు మంత్రి గాంగ్వర్ చెప్పారు. జీవనోపాధి కోసం ఒక చోటునుంచి మరో చోటుకు ప్రయాణించే వలస కూలీలు, సొంత రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రంలో యజమాని నియమించుకునే వలస కూలీలు కూడా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం పరిధిలో ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ తీసుకువచ్చిన వలస కూలీలకు మాత్రమే ఈ నిబంధనల వల్ల ప్రయోజనం చేకూరుతోంది. కార్మిక చట్టాలతో లభించే ఈ కింది ప్రయోజనాలను కూడా మంత్రి వివరించారు. :
- వలస కూలీల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా అందుబాటులో ఉండే హెల్ప్ లైన్
- వలస కూలీల సమాచారంపై జాతీయ స్థాయిలో డాటా బేస్ ఏర్పాటు
- ప్రతి 10 రోజుల పనికి ఒక రోజు సెలవు కల్పించడం. మొత్తం పని వ్యవధి 240 రోజులకు బదులు 180 రోజులు ఉన్నపుడు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది.
- ప్రతి రంగంలోనూ మహిళలకు సమాన ప్రతిపత్తి: ప్రతి రంగంలోనూ రాత్రి వేళ కూడా పనిచేసేందుకు మహిళలకు అనుమతి ఇవ్వాల్సిందే. అయితే, మహిళల భద్రతకు భరోసా ఇస్తూ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. రాత్రి వేళల్లో పని చేయడానికి మహిళలనుంచి ముందస్తు అంగీకారం తీసుకోవలసి ఉంటుంది.
- పని ప్రదేశంలో తలెత్తే ప్రమాదం కారణంగా కార్మికుడు మరణించినా లేదా, గాయపడినా జరిమానాలో కనీసం 50శాతం వాటా ఇవ్వడం. ఉద్యోగికి చెల్లించే నష్టపరిహారానికి అదనంగా దీన్ని చెల్లించాలి.
- ఆన్ లైన్ ప్లాట్ ఫాంపై, జి.ఐ.జి.పై పనిచేసే వారితో సహా 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకోసం “సామాజిక భద్రతా నిధి” ఏర్పాటు. సార్వత్రిక సామాజిక భద్రతకు ఇది దోహదపడుతుంది.
- పురుష కార్మికులతో సమాన ప్రతిపత్తి కలిగిస్తూ మహిళా కార్మికులకు సమాన వేతనం
- ఐ.టి. రంగం, సేవల రంగంలో పనిచే వారికి కూడా వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల చట్టం వర్తింపు..
- సమ్మెకు 14 రోజుల నోటీసు. ఈ లోగా సామరస్య పరిష్కారం కుదిరే అవకాశం
- “ఆలస్యంగా లభించిన న్యాయం,. అన్యాయంతో సమానం” కాబట్టి కార్మిక కోర్టుల్లో న్యాయ విచారణ మరింత త్వరితంగా పరిష్కారమయ్యేలా క్రియాశీలక యంత్రాగం.
- మరింత మెరుగైన ఉత్పాదన, మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం సామరస్య పూరిత సంబంధాలను ప్రోత్సహించే చట్టాలు.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కావలసిన అవసరాలను 8నుంచి ఒకటికి తగ్గించేందుకు పారదర్శకమైన, జవాబ్దారీతనంతో కూడిన సరళమైన యంత్రాగం ఏర్పాటు. అవసరమైన లైసెన్సుల సంఖ్య కూడా ఒకటికి తగ్గింపు. గతంలో వివిధ చట్టాల కింద 3, లేక 4 లైసెన్సులు అవసరమయ్యేవి.
- తనిఖీ అధికారి ఇకపై కేవలం తనిఖీ అధికారిగానే కాక, సదుపాయాల కల్పనా అధికారిగా కూడా వ్యవహరిస్తారు. స్థూలమైన తనిఖీ ప్రక్రియకు అవకాశం కల్పిస్తారు.. తనిఖీ రాజ్యం (ఇన్ స్పెక్టర్ రాజ్) స్థానంలో ఇకపై వెబ్ ఆధారిత తనిఖీ వ్యవస్థ ఏర్పాటు.
- బాగా పెరగనున్న పెనాల్టీలు.
గత కొంత కాలంగా మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు అవసరాలను కూడా తీర్చేలా చట్టాల్లో మార్పులకు, సంస్కరణలకు రూపకల్పన చేసినట్టు కేంద్ర మంత్రి గాంగ్వర్ చెప్పారు. దేశం మరింత వేగంగా అభివృద్ధి పథంలో పురోగమించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ చట్టాలతో దేశంలో శాంతియుతమైన, సామరస్యమైన పారిశ్రామిక సంబంధాలను ప్రోత్సహించేందుకు వీలవుతుందని, పారిశ్రామికంగా, ఉపాధి కల్పనా రంగంలో అభివృద్ధికి అవకాశం ఉంటుందని, ఆదాయ సముపార్జనకు, సమతూకంతో కూడిన ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని అన్నారు. దీనితో మరింత ఆదాయం కార్మికుల చేతికి అందుతుందన్నారు. వ్యవస్థలో సమూల మార్పులకు దారితీసే ఈ సంస్కరణలతో దేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే వీలు కలుగుతుందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనుంచి దేశీయంగా పెట్టుబడులకు అవకాశం కూడా ఉంటుందని గాంగ్వర్ అన్నారు. దీనితో దేశంలో ‘మితి మీరిన తనిఖీ రాజ్యం’ అంతమై, వ్యవస్థలో పూర్తి పారదర్శకత్వం చోటు చేసుకుంటుందన్నారు. “ప్రపంచంలోనే పెట్టుబడులను ఆకర్షించే ప్రముఖమైన గమ్యస్థానంగా భారతదేశం రూపుదిద్దుకోగలద”ని కేంద్ర మంత్రి గాంగ్వర్ పేర్కొన్నారు.
*****
(Release ID: 1658043)
Visitor Counter : 5526