యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

జాతీయ స్థాయిలోని మాజీ, ప్రస్తుత క్రీడాకారులకు క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థికసాయం

‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ. క్రీడాకారుల సంక్షేమ నిధి’ కింద సహాయం: కిరెన్ రిజిజు

Posted On: 19 SEP 2020 5:24PM by PIB Hyderabad

   క్రీడాకారులకోసం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ క్రీడాకారుల సంక్షేమ నిధి కింద ఒక పథకాన్ని క్రీడా మత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. జాతీయ స్థాయిలోని మాజీ, ప్రస్తుత క్రీడాకారులకు తగిన ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు పథకం వీలు కల్పిస్తుంది. పూటగడవని దుర్భర స్థితిలో ఉన్న క్రీడాకారులకు సహాయం అందించేందుకు, శిక్షణ సందర్భంగా తగిలే గాయాలకు చికిత్స అందించేందుకు, క్రీడాకారుల సంక్షేమానికి, క్రీడా సామగ్రి సేకరణకు, పోటీల్లో క్రీడాకారులు పాల్గొనేలా చూసేందుకు పథకం దోహదం చేస్తుంది. పథకానికి సంబంధించిన వివరాలు క్రీడా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్   http://yas.nic.in/sports/national-welfare-fund-sportspersons-0లో పొందుపరిచారు.

  దీనికి తోడు,  ‘ప్రతిభావంతులైన క్రీడాకారులకు పెన్షన్ కోసం క్రీడా నిధిని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. క్రియాశీలక క్రీడా జీవితంనుంచి విరమణ ప్రకటించిన క్రీడాకారులకు అదనపు ఆర్థిక భద్రత కల్పించేందుకు పథకం రూపొందించారు. ఒలింపిక్ క్రీడలు, ఒలింపిక్స్  ప్రపంచ కప్, ఆసియా క్రీడల క్రీడాంశాలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, పారా ఒలింపిక్ క్రీడలు వంటి టోర్నమెంట్లలో పతకాలు గెలిచిన వారికి  పథకం కింద జీవిత కాల పెన్షన్ గా  నెలకు 12 వేల నుంచి 20 వేల రూపాయల వరకూ చెల్లిస్తారు.

  కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో సమాచారం తెలిపారు.  

***


(Release ID: 1656849)