శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టాటా గ్రూప్ వారి భారత తొలి కోవిడ్ టెస్ట్ భారత్ లో వినియోగానికి ఆమోదం
Posted On:
19 SEP 2020 8:33PM by PIB Hyderabad
టాటా గ్రూప్ వారు సిఎస్ఐఆర్- ఐజిఐబ్ సహకారంతో రూపొందించిన సిఆర్ఐఎస్ పిఆర్ (క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్ స్పెర్స్డ్ షార్ట్ పాలిండ్రోమ్ రెపీట్స్) అనే టెస్ట్ కు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదం తెలియజేసింది. ఆ విధంగా నియంత్రణా సంస్థ నుంచి అనుమతి రావటంతో భారత వైద్య పరిశోధనామండలి మార్గదర్శకాల ప్రకారం వాణిజ్యపరంగా ప్రారంభానికి సిద్ధమైంది. ఇది అత్యంత నాణ్యమైన స్థాయితో 96% సున్నితత్వంతో 98% నిర్దిష్ట లక్ష్యంతో కరోనా వైరస్ ను గుర్తించగలుగుతుంది. ఇది స్వదేశీ పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అత్యాధునిక టెక్నాలజీతో వైరస్ ని గుర్తించటానికి పనికొస్తుంది. ఇది జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ తో వ్యాధిని నిర్థారిస్తుంది.
కోవిడ్-19 కు కారణమయ్యే వైరస్ ను విజయవంతంగా పసిగట్టటానికి వీలుగా ఉండే ప్రపంచపు తొలి కరోనా వ్యాధి నిర్థారణ పరీక్ష ఇది. భారత శాస్త్రవేత్తలకు ఇది మహత్తరమైన సాధనగా భావించవచ్చు. పరిశోధన, అభివృద్ధిని 100 రోజులలోపే అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లటం, ఎక్కువ ఉత్పత్తికి వీలుండటం, నమ్మదగిన పరీక్షలు చేయటం దీని ప్రత్యేకత. తక్కువ సమయంలోనే ఆర్ టి -పిసిఆర్ పరీక్షల కచ్చితత్వాన్ని సాధించటం, పరికరాల ఖరీదు తక్కువగా ఉండటం, సులభంగా వాడగలగటం కారణంగా దీనికి ప్రత్యేకత లభించింది. పైగా, ఇది భవిష్యత్ లో ఇతర వ్యాధులను కూడా గుర్తించగలిగే సామర్థ్యం ఉన్న టెక్నాలజీ.
శాస్త్రవేత్తలకు, పరిశ్రమకు మధ్య ఫలవంతమైన సహకారం ఫలితమే ఇది. టాటా గ్రూప్ సి ఎస్ ఐ ఆర్ - ఐజిఐబి, ఐ సి ఎం ఆర్ తో కలిసి పనిచేయటం వల్లనే అత్యంత నాణ్యమైన పరీక్ష రూపకల్పనకు దారితీసింది. దీనివలన దేశం కోవిడ్ పరీక్షల వేగాన్ని, సంఖ్యను పెంచటానికి వీలవుతుంది. పైగా త్వరగా, తక్కువ ఖర్చులో, సురక్షితంగా నమ్మదగిన విధంగా, అందుబాటు ధరలో చేయగలిగే వీలుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఇది మేడిన్ ఇండియా.
టాటా గ్రూప్ వారి పరీక్షకు ఆమోదం లభించటం మీద టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్ లిమిటెడ్ సీఈవో కృష్ణమూర్త్ వ్యాఖ్యానిస్తూ, " ఈ ఆమోదం పొందటం ఈ ప్రపంచ సంక్షోభం మీద భారతదేశ పోరాటానికి మరింత ఊపునిచ్చినట్టయింది. దీన్ని వాణిజ్యపరంగా వాడబోవటం మన దేశపు పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచపు ఆరోగ్యరంగానికి, శాస్త్రీయ పరిశోధనాప్రపంచానికి భారత్ తన వంతుగా ఇస్తున్న కానుక అనవచ్చు" అన్నారు.
సి ఎస్ ఐ ఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే సి ఎస్ ఐ ఆర్-ఐజిఐబి బృందంలోని విద్యార్థులను, శాస్త్ర వేత్తలను, టాటా సన్స్ ను ఈ అద్భుతమైన పనికి అభినందించారు. పరీక్షల కిట్ ను ఆమోదం పొందగలిగే స్థాయికి తీసుకువెళ్ళటం, మరిన్ని నవకల్పనల ద్వారా భారత్ ను స్వయం సమృద్ధం అయ్యేటట్టు చేయటం గొప్పవిషయమన్నారు.
***
(Release ID: 1656834)
Visitor Counter : 341