విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బిహార్ లో ఎన్ టిపిసి చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్ కె సింగ్
చౌరై, సార్తువా, బదూరా, బహదూర్ పూర్ లలో కమ్యూనిటీ సెంటర్లు; కోరి, బసౌరి, మదన్ పూర్, నరౌనిలలో చాత్ ఘాట్లు; భటౌలి, నవాడా బెన్ లలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్మాణం; సారిపూర్, ట్రికౌల్, పాండేపూర్, మోహన్ పుర్ తోలా, మసద్, కల్యాణ్ పురి, ఇచ్రిలలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు ఇందులో ఉన్నాయి.
ఎన్ టిపిసి ఒక ఐటిఐని ఏర్పాటు చేయడంతో పాటు బిహార్ లోని ఎయిమ్స్ లో నిర్మిస్తున్న ఒక వార్డు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనంకరంగా ఉంటాయి : శ్రీ ఆర్ కె సింగ్
Posted On:
18 SEP 2020 6:35PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, సరికొత్త & పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర శాఖ), నైపుణ్యాభివృద్ధి & ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ బిహార్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశంలో అతి పెద్ద విద్యుదుత్పాదన సంస్థ అయిన ఎన్ టిపిసి కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా బిహార్ ప్రజల ప్రయోజనం కోసం మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది.
బిహార్ అభివృద్ధి పథంలో పయనించేందుకు ఎన్ టిపిసి, ఆర్ఇసి, పవర్ గ్రిడ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా శ్రీ సింగ్ కొనియాడారు. “విద్యుత్ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోని ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల శ్రేణిలోని ఈ మూడు విద్యుత్ సంస్థలు అత్యంత వృత్తి నైపుణ్యం, సమర్థత కలిగినవి. విద్యుత్ రంగానికి చెందిన ఈ పిఎస్ యులు అసాధారణ పనితీరు ప్రదర్శించడంతో పాటు సామాజికాభివృద్ధికి కూడా పాటు పడుతున్నాయి. వీటి కృషి గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించింది. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఈ కంపెనీలు తమ కార్మికుల సంపూర్ణ సంక్షేమానికి కట్టుబడడంతో పాటు సామాజిక సంక్షేమానికి కూడా ఎంతగానో కృషి చేస్తున్నాయి. బిహార్ లో ఎన్ టిపిసి ఒక ఐటిఐ ఏర్పాటు చేయడంతో పాటు ఎయిమ్స్ లో ఒక వార్డు కూడా నిర్మిస్తోంది. ఇది బిహార్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాష్ట్రంలో 6150 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను కలిగి ఉన్న ఎన్ టిపిసి బిహార్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. మరో 3800 మెగావాట్ల సామర్థ్యం జోడించే ప్రాజెక్టులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి” అని మంత్రి వివరించారు.
“ఈ విద్యుత్ పిఎస్ యులన్నీ దేశం నలుమూలలకు విస్తరించి దేశాన్ని అనుసంధానం చేస్తున్నాయి, ఈ సంస్థలు చేస్తున్న కృషి వల్ల భారతదేశం మిగులు విద్యుత్ కలిగి ఉంది. గత ఐదేళ్ల కాలంలో ఈ సంస్థలు 1.25 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం జోడించాయి. ప్రధానమంత్రి నాయకత్వంలో మేం విద్యుత్ విప్లవానికి శ్రీ కారం చుట్టాం, భారతదేశంలో ప్రతీ ఒక్క ఇంటికీ విద్యుత్ సదుపాయం కల్పించే లక్ష్యానికి చేరువవుతున్నాం” అన్నారు.
ఎన్ టిపిసి ఆర్ఇడి (ఇఆర్ఐ) శ్రీ అసిత్ కుమార్ ముఖర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ “సామాజిక బాధ్యతకు మేం కట్టుబడి ఉన్నాం. బిహార్ ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు శ్రమిస్తున్నాం. రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులను నిర్వహిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చగలుగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. బిహార్ లోని ప్రతీ ఒక్క పౌరుని జీవితం కాంతిమయం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం” అని చెప్పారు.
కుటుంబాలు, సామాజిక వేడుకల నిర్వహణకు, పండుగలు, సామాజిక ప్రాధాన్యం గల ప్రత్యేక సందర్భాలకు అవసరం అయిన ఈ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడం ద్వారా ఈ ప్రాజెక్టులు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. సందేశ్, ఆజియాం ప్రాంతాల్లోని వివిధ ప్రదేశాల్లో స్వచ్ఛమైన తాగు నీరు అందుబాటులో ఉండడంతో పాటు విస్తృతమైన వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
చౌరై, సార్తువా, బదూరా, బహదూర్ పూర్ లలో కమ్యూనిటీ సెంటర్లు; కోరి, బసౌరి, మదన్ పూర్, నరౌనిలలో చాత్ ఘాట్లు; భటౌలి, నవాడా బెన్ లలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్మాణం; సారిపూర్, ట్రికౌల్, పాండేపూర్, మోహన్ పుర్ తోలా, మసద్, కల్యాణ్ పురి, ఇచ్రిలలో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు ఇందులో ఉన్నాయి.
సందేశ్, అజియాం నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రతినిధులు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆ శాఖ నిర్వహణలోని వివిధ పిఎస్ యుల సీనియర్ అధికారులు, ఎన్ టిపిసి అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్ టిపిసి మొత్తం 62,910 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంలో 6150 మెగావాట్ల సామర్థ్యం బిహార్ లోనే కలిగి ఉంది. మరో 3800 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
ఎన్ టిపిసి గ్రూప్ 62.9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం గల 70 విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తోంది. వాటిలో 24 థర్మల్ ప్రాజెక్టులు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్/ లిక్విడ్ ఇంధన ప్రాజెక్టులు, ఒక హైడ్రో ప్రాజెక్టు, 13 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో పాటు 25 అనుబంధ, జాయింట్ వెంచర్ విద్యుత్ స్టేషన్లు వాటిలో ఉన్నాయి. 20 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా అందులో 5 గిగావాట్లు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులే.
***
(Release ID: 1656579)
Visitor Counter : 138