మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్కూలుకెళ్ళే పిల్లల చదువులకోసం కోవిడ్ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నాం: విద్యామంత్రి

Posted On: 17 SEP 2020 5:51PM by PIB Hyderabad

కోవిడ్ సంక్షోభ సమయంలో విద్యా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతోనూ,  కేంద్ర పాలిత ప్రాంతాలతోనూ వివిధ స్థాయిల్లో అనేక మార్లు సమాలోచనలు జరిపి స్కూల్ కి వెళ్ళే పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా, చదువుల్లో వారు వెనకబడకుండా తగిన చర్యలు సూచించింది. ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:

 ప్రధానమంత్రి ఈ-విద్య

ఇది ఒక  సమగ్రమైన కార్యక్రమం ప్రధానమంత్రి ఈ-విద్య ద్వారా  డిజిటల్,  ఆన్ లైన్, ఆన్ ఎయిర్ చదువులను ఏకీకృతం చేయడం సాధ్యమైంది. దీనివలన చదువులు అన్ని విధానాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా తీసుకున్న చర్యలు ఇవి:

దీక్ష  (జ్ఞానం పంచటానికి డిజిటల్ మౌలిక సదుపాయాలు)

 దీక్ష అనేది పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఒక జాతీయ వేదిక. ఇది అన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. దీన్ని వెబ్ పోర్టల్ ద్వారా,  ద్వారా మొబైల్ యాప్ ద్వారా కూడా అందుకోవచ్చు. పాఠ్యాంశాల ఈ-కంటెంట్ ను క్యూఆర్ కోడ్ తో దొరికే పాఠ్యగ్రంధాలు మొదలుకొని  ఉపాధ్యాయుల కోసం కోర్సులు, క్విజ్ పోటీల లాంటి అంశాలన్నీ అందుబాటులో ఉంటాయి దీని ద్వారా పాఠశాల విద్యకు  "ఒక దేశం ఒక డిజిటల్ వేదిక" నినాదం వర్తిస్తుంది.

 2020 ఏప్రిల్ లో విద్యాదాన్  ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో  దీక్షా వేదికను ఉపయోగించుకుని పాఠ్యాంశాలను అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా పాఠశాలకు విద్యార్థులకు విద్యా సంస్థలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు, వ్యక్తిగత నిపుణులకు పాఠ్యాంశాలు అందించడంతోపాటు వారందరి నుంచి కూడా వారి బోధనాంశాలు విరాళంగా అందుకోవటానికి  ఈ వేదిక ఉపయోగపడుతుంది.

టీవీ ఛానల్స్ ద్వారా అందుబాటు - స్వయంప్రభ టీవీ చానల్స్

స్వయంప్రభ పేరుతో ఏర్పాటుచేసిన డిటిహెచ్ ఛానల్స్ ఇంటర్నెట్ లేని వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి పనికొస్తాయి. అత్యంత నాణ్యమైన విద్యా కార్యక్రమాల కోసం 32 చానల్స్ ను ప్రత్యేకంగా కేటాయించారు

ఓపెన్ స్కూల్స్ కోసం మూక్స్

ఓపెన్ స్కూల్ విద్యార్థుల కోసం ఆన్ లైన్ లో  కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 9 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం స్వయం పోర్టల్ లో పాఠాలు అప్ లోడ్ చేశారు. మొత్తం 92 కోర్సులు ఈ పద్ధతిలో ప్రారంభమయ్యాయి వీటి కోసం కోటిన్నర మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా అన్ని కోర్సులు చూడవచ్చు వీడియోలు, మూల్యాంకనం ప్రశ్నలు స్వయం ద్వారా పొందవచ్చు.

 రేడియో, కమ్యూనిటీ రేడియో, పాడ్ కాస్ట్  వినియోగం

మారుమూల ప్రాంతాల్లో ఆన్ లైన్ సౌకర్యం అందుబాటులో లేని విద్యార్థుల కోసం రేడియో ప్రసారాలను ఉపయోగిస్తున్నారు. 289 కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ద్వారా  ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఈ ప్రసారాలతో పాఠాలు బోధిస్తున్నారు.  9 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. శిక్షావాణి పేరుతో పాడ్ కాస్ట్ కూడా సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని కూడా 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు బాగా వాడుకుంటున్నారు. ఇందులో 430 ఆడియో పాఠాలు ఉన్నాయి ఒకటి నుంచి 12వ తరగతి వరకు అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.

వికలాంగుల కోసం

వినికిడి సమస్యతో బాధపడే బధిరులకోసం సంకేత భాషతో ప్రత్యేకంగా ఒక డిటిహెచ్ చానల్ నడుస్తోంది. దృష్టి లోపమున్న విద్యార్థులకోసం ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్ సిద్ధం చేశారు. డిజిటల్ విధానంలో అందుకోగల సమాచార వ్యవస్థను అభివృద్ధి పరచారు. ఈ రెండూ ఓపెన్ స్కూల్ వెబ్ సైట్ లోను, యూట్యూబ్ లోను అందుబాటులో ఉన్నాయి.

ఈ-పాఠ్యగ్రంధాలు

ఈ-పాఠశాల వెబ్ పోర్టల్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఈ-పాఠ్యగ్రంధాలను పొందటానికి వీలుంది. 1 నుంచి 12 తరగతులవరకూ 377 ఈ-పాఠ్యగ్రంధాలు సహా 600కు పైగా డిజితల్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణామండలి ( ఎన్ సి ఇ ఆర్ టి) వారి 3,500 ఆడియో, వీడియో పాఠ్యాంశాలు కూడా అందరూ అందుకోగలిగే విధంగా వెబ్ సైట్ లో పెట్టారు. ఇవి హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ లాంటి వేరువేరు భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

జాతీయ సార్వత్రిక విద్యావనరులు

ఈ-పాఠ్యాంశాలు నిల్వ చేసిన జాతీయ సార్వత్రిక విద్యావనరుల కేంద్రం ఇది. అన్ని తరగతుల విద్యార్థులకూ అవసరమైన దాదాపు 17,500  అంశాలు ఇందులో ఉన్నాయి.

వేసవి పరీక్షలకోసం సిలబస్ హేతుబద్ధీకరణ

కేవలం పరీక్షల కోసమే సిబిఎస్ఇ  సిలబస్ లో దాదాపు ముప్పై శాతం తగ్గించారు. దీనికి కారణం ఇంతకుముందు అలవాటులేని బోధనావిధానం, అభ్యసన విధానం. ఇది అటు తల్లిదండ్రులకు, ఇటు ఉపాధ్యాయులకు కూడా కొత్త అనుభవమే.

ప్రత్యామ్నాయ విద్యా కాలెండర్

జాతీయ విద్యా, పరిశోధనా శిక్షణామండలి మూడు భాషల్లో 1 నుంచి 12 తరగతుల విద్యార్థులకు వారాల వారీగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేసింది. అందులో సిలబస్ కి సంబంధించిన ఆసక్తికరమైన కార్యకలాపాలు, అంశాలకు సంబంధించిన సవాళ్ళు ఉంటాయి. అభ్యసనం వలన రాబట్టాల్సిన ఫలితాలగురించి కూడా అందులో ఉండటం వలన ఉపాధ్యాయులతోబాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థి అభ్యసనాన్ని ఒక వైవిధ్యమైన కోణంలో అంచనా వేయటం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు ఈ-వనరులను పొందటానికి కూడా ఇందులో వీలుంది.

డిజిటల్ విద్యపై ప్రగ్యాత మార్గదర్శకాలు

కోవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో  ఇళ్ళకే పరిమితమైన విద్యార్థులకు ఆన్ లైన్/ ఉమ్మడి/డిజిటల్ బోధన లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్దాయి. వివిధ విభాగాల విద్యార్థులు ఎంత సేపు దిజిటల్ స్క్రీన్ ముందు ఉండాలో  ఈ మార్గదర్శకాలు సిఫార్సు చేస్తాయి. సైబర్ భద్రత దృష్ట్యా చేయదగిన, చేయదగని పనుల జాబితాను కూడా ఇది అందిస్తుంది. పరికరాల వాడకం మీద ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా వివరిస్తూ, ఆన్ లైన్ తరగతుల సమయంలో  ఏ భంగిమలో కూర్చోవటం శ్రేయస్కరమో కూడా తెలియజేస్తారు. ఈ మార్గదర్శకాలను దిగువ ఇచ్చిన లింక్ లో చూడవచ్చు:

https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/pragyata-guidelines_0.pdf

మానసిక సామాజిక మద్దతు కోసం మనోదర్పణ్

విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కుటుంబ సభ్యులకు మానసిక, సామాజిక తోడ్పాటు అందించటానికి మనోదర్పణ్ అనేక కార్యకలాపాలను అందిస్తుంది. కోవిడ్ సమయంలోను, ఆ తరువాత కూడా మానసిక ఆరోగ్యం, ఉద్వేగపరంగా సమతుల్యంగా ఉండటం మీద ఇది దృష్టి సారిస్తుంది. అవిచ్ఛిన్నంగా నేర్చుకోవటానికి మార్గదర్సకాలు:

అన్ లైన్ విద్య వలన విద్యార్థులకు లబ్ధి చేకూరటానికి ఈ దిగ్వ పేర్కొన్న అభ్యసన మార్గదర్శకాలను 2020 ఆగస్టు 19 న జారీచేశారు:

కోవిడ్ సమయంలో డిజిటల్ పరికరాలు లేని విద్యార్థులను అభ్యసనం మెరుగుదలకు

కోవిడ్ సమయంలో డిజిటల్ పరికరాలు పరిమితంగా అందుబాటులో ఉన్న విద్యార్థుల అభ్యసనం మెరుగుదలకు

కోవిడ్ సమయంలో డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్న విద్యార్థుల అభ్యసనం మెరుగుదలకు

ఈ మార్గదర్శకాలను ఈ క్రింది లింక్ లో చూడవచ్చు:

https://www.mhrd.gov.in/sites/upload_filehs/mhrd/files/Learning_Enhancement_0.pdf

కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించేందుకు పాఠశాల విద్య, సాక్షరతా విభాగం రూ. 818.17 కోట్లు కేటాయించింది. డిజిటల్ విధానాలలో ఆన్ లైన్ అభ్యసనాన్ని ప్రోత్సహించటం కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. అదే విధంగా ఆన్ లైన్ ఉపాధ్యాయ శిక్షణకోసం రూ.267.86  కోట్లు కేటాయించింది. దీనివలన ఉపాధ్యాయులు అవిచ్ఛిన్నంగా వృత్తి నైపుణ్యం పెంచుకునే వీలుకలుగుతుంది.

ఈ సమాచారం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ ’నిశాంక్’ ఈరోజు రాజ్యసభకు అందజేసిన లికితపూర్వక సమాధానం లోనిది.

 

***



(Release ID: 1656011) Visitor Counter : 267