సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఆన్‌లైన్‌ అమ్మకాల్లో కాగితపు సంచులను ఉపయోగిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న కేవీఐసీ


Posted On: 13 SEP 2020 3:22PM by PIB Hyderabad

"ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌" (కేవీఐసీ), రెండు నెలల క్రితం ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టింది. ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్లను పంపిణీ చేయడానికి, చేతితో తయారు చేసిన కాగితపు సామగ్రిని ఉపయోగిస్తోంది. తన “గ్రీన్ కెమిస్ట్రీ” నినాదంతోపాటు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి కాగితపు సంచులు ఉపయోగిస్తోంది.

ద్రవరూపంలో ఉన్న సామగ్రి తప్ప మిగిలిన వస్తువులను వినియోగదారులకు అందించడానికి, చేతితో తయారు చేసిన కాగితపు సంచులు, అట్టపెట్టెలను కేవీఐసీ ఉపయోగిస్తోంది. ఫేస్ మాస్కులను ప్యాక్‌ చేయడానికి, ఉత్తమ పరిశుభ్రత కోసం ప్లాస్టిక్‌ను కేవీఐసీ ఉపయోగిస్తోంది. ఈ ప్లాస్టిక్‌ బదులు, అరటి నారతో చేతితో తయారు చేసిన కాగితపు సంచులను ప్రత్యేకంగా రూపొందించింది. త్వరలోనే వీటిని ఉపయోగించనుంది.

వస్తువులను ప్యాక్‌ చేయడానికి వివిధ ఈ-కామర్స్‌ సంస్థలు ప్లాస్టిక్‌ను విపరీతంగా వినియోగించడాన్ని నిలువరిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, కేవీఐసీ కాగితపు సంచుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ-కామర్స్ సంస్థల ప్లాస్టిక్ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును కూడా ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

కాగితపు సంచులు, అట్టెపెట్టెల వినియోగం ద్వారా, అటు పర్యావరణ రక్షణ, ఇటు ఉపాధిని కేవీఐసీ కల్పిస్తోంది. ఈ కాగితపు సామగ్రిని, జైపూర్‌లోని తనకు చెందిన 'కుమారప్ప నేషనల్‌ హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ఇన్‌స్టిట్యూట్‌'లో తయారు చేయిస్తోంది. దీనివల్ల అదనపు ఉపాధి సాధ్యమవుతోంది.

"ఖద్దరు దుస్తులు ప్రపంచంలోనే అత్యంత పర్యావరణహిత వస్త్రాలు. కేవీఐసీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి రక్షణను ముఖ్యాంశంగా పరిగణిస్తుంది" అని ఆ సంస్థ ఛైర్మన్‌ శ్రీ వినయ్‌ కుమార్‌ సక్సేనా తెలిపారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, "ఖద్దరు ఉత్పత్తులు సహజమైనవి. వినియోగదారులకు ఖద్దరు ఉత్పత్తులను చేర్చడానికి కాగితపు సంచులు ఉపయోగించడం, అత్యుత్తమ పర్యావరణ స్పృహతో కూడిన మార్గం. కాగితపు సంచులు, అట్టపెట్టెలు ప్లాస్టిక్‌ కన్నా బరువుగా ఉంటాయి. కాగితపు సంచులు తయారు చేయించడానికి అయ్యే ఖర్చుతోపాటు, వీటి రవాణా ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా కేవీఐసీనే భరిస్తోంది" అని సక్సేనా చెప్పారు.

కాగితపు సంచుల ద్వారా ఆర్డర్లు పంపిణీ చేయడంపై, వినియోగదారుల నుంచి కేవీఐసీ ప్రశంసలు అందుకుంటోంది. "కేవీఐసీ ద్వారా అట్టపెట్టెలో వస్తువులను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెండు నెలల్లో కేవీఐసీకి నేను చాలా ఆర్డర్లు పెట్టాను. ఒక్కసారి కూడా ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ అందుకోలేదు" అని జోధ్‌పూర్‌ వాసి సుమిత్‌ మాధుర్‌ చెప్పారు.

"కాగితపు సంచుల వాడకం పర్యావరణ స్పృహతో కూడిన ప్రయత్నం. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించడానికి కేవీఐసీ అత్యంత తక్కువగా ప్లాస్టిక్‌ వినియోగిస్తోంది. ఇది అభినందనీయం" అని కర్ణాటకకు చెందిన అల్కా భార్గవ్‌ చెప్పారు. కేవీఐసీకి, దిల్లీ తర్వాత కర్ణాటక నుంచే ఎక్కువగా అన్‌లైన్‌ ఆర్డర్లు వస్తున్నాయి.

******

 



(Release ID: 1653850) Visitor Counter : 174