నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
నైపుణ్యాలను నేర్పడం, వున్న వాటికితోడుగా కొత్త నైపుణ్యాలను నేర్పడం, నైపుణ్యాలను మెరుగుపరచడంలో శిక్షణ ఇచ్చేవారి పాత్ర అత్యంత ప్రధానమైంది: ప‌్రధాని శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
10 SEP 2020 8:15PM by PIB Hyderabad
కౌశలాచార్య అవార్డుల ప్రదాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన రాతపూర్వక ప్రసంగాన్ని ఆయా శిక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయా రంగాల శిక్షకులు పోషించిన పాత్రను ప్రశంసించారు. దేశంలో నైపుణ్యాలకు సంబంధించిన వ్యవస్థను నిర్మించడంలో వారి పాత్ర ఎంతో గొప్పదని అన్నారు.
కౌశలాచార్యుల అవార్డుల రెండో ఎడిషన్లో 92 మంది నైపుణ్య శిక్షకులకు అవార్డులను ప్రదానం చేశారు. వీరికి ఐదు విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. దీర్ఘకాలిక శిక్షణ, స్వల్పకాలిక శిక్షణ, జనశిక్ష సంస్థాన్, అప్రెంటిషిప్, ఔత్సాహిక వ్యాపారవేత్త శిక్షణ అనేవి ఈ ఐదు విభాగాలు.
కౌశలాచార్య సమాదర్ 2020 ( అవార్డులు) రెండో ఎడిషన్ కార్యక్రమంకోసం నైపుణ్యాల అభివృద్ధి మరియు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ( ఎండిఇ) మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిజటల్ సదస్సు జరిగింది. భవిష్యత్తులో దేశానికి అవసరమైన నైపుణ్య మానవవనరులను అందించడానికిగాను పలు రంగాలకు చెందిన శిక్షకులు తమ శిక్షణ కార్యక్రమాల ద్వారా దేశంలో నైపుణ్య వ్యవస్థను నిర్మించడం జరుగుతోంది. ఇలాంటి శిక్షకుల్లో ప్రతిభ చూపినవారిని ఈ కార్యక్రమంలో అవార్డులనిచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరంద్ర మోదీ తన రాతపూర్వక ప్రసంగ సందేశాన్ని అందించారు. శిక్షకులు తమ విశిష్టమైన కృషి ద్వారా దేశ యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నారని, వాటిని సజీవంగా వుంచుతున్నారని, వారికి బంగారు భవిష్యత్తు కల్పిస్తున్నారని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా అవార్డులందుకున్న శిక్షకులకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా దేశంలో నైపుణ్య మానవ వనరులను అభివృద్ది చేసుకోవాలనేది ప్రభుత్వ ఎజెండా అని ఈ దార్శనికతతో దేశంలో బలమైన నైపుణ్య అభివృద్ధి వ్యవస్థను తయారు చేసుకుంటున్నామని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికిగాను మొత్తం దేశమంతా కృషి చేస్తోందని ప్రతి భారతీయుడు స్వయం సమృద్ధి కలిగి వుండాలని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇది ముఖ్యమని ఆయన అన్నారు. నైపుణ్యతలు కలిగిన ఉద్యోగులు కావాలనే డిమాండ్ పలు రంగాలనుంచి వస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ఆత్మనిర్భర్ భారత్ సాధనలో ప్రధాన పాత్ర పోషించాలని దేశ యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. నైపుణ్యాలను నేర్పడం, వున్నవాటికి తోడు ఇతర రంగాల నైపుణ్యాలను నేర్పడం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఈ మూడింటిపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కృషిలో శిక్షకులు, నిపుణులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున అవార్డులు పొందిన శిక్షకులు మరెంతో మందికి స్ఫూర్తినిస్తారనే నమ్మకం తనలో ప్రగాఢంగా వుందని గౌరవనీయులైన ప్రధాని అన్నారు. దేశ యువత అభివృద్ధికోసం, దేశాభివృద్ధికోసం వారు నిరంతరం కృషి చేస్తారని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ రోజున జరిగిన డిజటల్ సమావేశంలో మొత్తం 92 మంది శిక్షకులకు అవార్డులను అందించారు. వీరు దేశవ్యాప్తంగా పలు విభాగాల్లో తమ ప్రతిభను కనబరిచారు.
ఈ సందర్భంగా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రెప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాధ్ పాండే మాట్లాడుతూ దేశంలోని నైపుణ్య శిక్షకులను ప్రశంసిస్తూ ప్రధాని అందించిన సందేశం గొప్పగా వుందని అన్నారు. ప్రధాని ప్రసంగం దేశంలోని శిక్షకులకు నైతిక స్థయిర్యాన్నిఇస్తోందని అన్నారు. మన సంస్కృతిలో గురువులకు ఇస్తున్న ప్రాధాన్యత వారు పోషించే పాత్ర గొప్పదనాన్ని చాటుతోందని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో వారు చేసే కృషిని గుర్తిస్తోందని అన్నారు.
ఆ గురువుల్లాగానే ప్రస్తుతం దేశంలోని నైపుణ్య శిక్షకులు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ దేశంలో నైపుణ్య వ్యవస్థను నిర్మిస్తున్నారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. శిక్షకుల కారణంగా దేశంలోని యువత భవిష్యత్తు సరైన మార్గంలో పడుతోందని అన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్య సిబ్బందిని అందించడానికి కావలసిన రోడ్డుమ్యాపును అందిస్తున్నారు కాబట్టి శిక్షకుల పాత్ర ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్య సిబ్బందిని అందించడానికిగాను శిక్షకులు ఎంతో అంకిత భావంతో పని చేస్తున్నారని వారిని చూస్తుంటే ఎంతో గర్వంగా వుందని చెబుతూ ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను కేంద్ర మంత్రి ప్రశంసించారు.
నైపుణ్యాల అభివృద్ధి వ్యవస్థకు సంబంధించి 2022 నాటికి 2.5 లక్షల శిక్షకుల అవసరం ఏర్పడుతుంది. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం. ఈ పథకాన్ని అమలు చేయడానికిగాను కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిరంతరాయంగా పని చేస్తోంది. ఉత్తమ ప్రమాణాలుగల శిక్షకులద్వారా యువతలో సామర్థ్యాలను పెంచుతోంది. తద్వారా వారు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పని చేయగలుగుతారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ దేశంలో శిక్షకుల అవసరం చాలా వుందని అన్నారు.ఈ రోజు జరిగిన కార్యక్రమంద్వారా దేశంలో వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు స్ఫూర్తి పొంది స్కిల్ ఇండియా మిషన్ లో భాగస్వాములు అవుతారని ఆయన ఆకాంక్షించారు. నైపుణ్యాల విషయంలో భారతదేశం ప్రపంచానికే రాజధానిగా నిలవాలని ఆయన అన్నారు.
కోవిడ్ 19 మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో తలెత్తిన సవాళ్లను ఎదుర్కోవడానికిగాను దేశంలోని పలు సంస్థలు తమ నైపుణ్య శిక్షకుల సాయంతో అనేక పరికరాలను తయారు చేశాయి. వాటి ద్వారా కోవిడ్ కట్టడికోసం విశేష కృషి జరుగుతోంది.
దేశంలోని కార్పొరేట్ సంస్థలు..ప్రపంచ దిగ్గజ సంస్థలతో కలిసి మన శిక్షకుల సామర్థ్యాలను పెంపొందించడానికిగాను పలు కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ మధ్యనే ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం దేశంలో కొనసాగుతున్న ప్రాధమిక సంస్కరణల్లో ఉపాధ్యాయుడే కేంద్ర బిందువుగా వున్నారు. దేశంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండాలో శిక్షణ అందిస్తున్నవారిని విజయవంతంగా భాగం చేయడానికిగాను కేంద్ర ప్రభుత్వం పలు కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకొని శిక్షకులను బలోపేతం చేస్తోంది. తద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతోంది.
****
(Release ID: 1653211)