ప్రధాన మంత్రి కార్యాలయం

‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ప్రారంభోత్సవం సందర్భం గా గౌరవ ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 10 SEP 2020 4:01PM by PIB Hyderabad

అందరికీ నమస్కారములు,

దేశం కోసం, బిహార్  కోసం, గ్రామీణ జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు, వ్యవస్థ ను మరింత బలోపేతం చేసేందుకు మత్స్య సంపద, పాడి, పశుపోషణలతో పాటు వ్యవసాయ రంగం లో విస్తృత అధ్యయనాన్ని, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభిస్తున్నందుకు, దేశ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు సంతోషం గా ఉంది. ఈ సందర్భం గా బిహార్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

బిహార్ గవర్నర్ శ్రీ ఫాగూ చౌహాన్ గారు, ముఖ్యమంత్రి శ్రీమాన్ నీతీశ్ కుమార్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గిరిరాజ్ సింగ్ గారు, శ్రీ కైలాశ్ చౌధరీ గారు, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగీ గారు, శ్రీ సంజీవ్ బాలియాన్ గారు, బిహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుశీల్ మోదీ గారు, బిహార్ శాసనసభ అధ్యక్షుడు శ్రీ విజయ్ చౌధరీ గారు, రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ మిత్రులారా..

మిత్రులారా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న ప్రతి పథకం వెనక ఉన్న ఏకైక లక్ష్యం.. 21వ శతాబ్దపు భారతదేశంలో మన గ్రామాలు స్వావలంబన ను సాధించి బలమైన శక్తిగా మారడమే. ఈ శతాబ్దం లో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ), తీపి విప్లవం - స్వీట్ రివల్యూషన్ (తెనె ఉత్పాదన)తో మన గ్రామాల అనుసంధానమై స్వయంసమృద్ధిని సాధించాలి. ఇదే లక్ష్యం తో ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ను రూపొందించడం జరిగింది. ఇవాళ 21 రాష్ట్రాల్లో ఈ పథకం ప్రారంభించబడింది. వచ్చే 4-5 ఏళ్లలో దీనికోసం 20 వేల కోట్ల రూపాయలకు పైగా ఇందుకోసం వెచ్చించడం జరుగుతుంది. ఇవాళ 17 వందల కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పథకంలో భాగంగా బిహార్‌లోని పాట్నా, పూర్ణియా, మాధేపురా, కిషన్ గంజ్, సమస్తీపుర్‌ ప్రాంతాల్లో వివిధ పథాలు ప్రారంభమయ్యాయి. దీనితో మత్స్యకారులకు నూతన మౌలిక సదుపాయాలు, ఆధునిక పరికరాలతో పాటు వారి ఉత్పత్తులను అమ్ముకునేందుకు కొత్త మార్కెట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది వ్యవసాయం తో పాటు ఇతర మార్గాల ద్వారా ఆర్థిక పరిపుష్టి కోసం అవకాశాలను పెంచుతుంది.

మిత్రులారా, 

దేశంలోని ప్రతి ప్రాంతం లో, ముఖ్యం గా సముద్ర ప్రాంతాల్లో, నదీ తీర ప్రాంతాల్లో చేపల వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశం లో మొట్ట మొదటిసారి ఇటువంటి సమగ్ర ప్రణాళిక ను రూపొందించడమైంది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ రంగం లో పెట్టిన పెట్టుబడులకు ఎన్నోరెట్లు ఎక్కువ పెట్టుబడి ని, ప్రోత్సాహాన్ని ఈ ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా అందిస్తున్నాం. ఇంతకుముందు శ్రీ గిరిరాజ్ గారు చెప్పినట్లు.. ఈ గణాంకాలను విన్నతర్వాత.. ఇలా కూడా చేయవచ్చా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ మీకు వాస్తవాలు తెలిసినపుడు.. ఈ ప్రభుత్వం ఏయే క్షేత్రాల్లో, ఎంతమంది శ్రేయస్సు కోసం ఎంతటి దీర్ఘకాల ప్రణాళికల తో ముందుకు వెళ్తుందో మీకు అర్థమవుతుంది.

దేశం లో మత్స్య సంబంధిత వాణిజ్యానికి సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా మా మత్స్యకారుల మిత్రులు, చేపల పెంపకం మరియు వాణిజ్యానికి సంబంధించిన వారికి మరిన్ని సౌలభ్యాలను కల్పించిన నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోంది. రాబోయే 3-4 ఏళ్ల లో చేపల ఎగుమతి ని రెట్టింపు చేయడమే లక్ష్యం గా పనులు జరుగుతున్నాయి. దీని ద్వారా కేవలం మత్స్యరంగంలోనే లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి. నేను ఇంతకుముందు చెప్పిన మిత్రులతో మాట్లాడిన తర్వాత అనుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో నా విశ్వాసం మరింత పెరిగింది. నేను రాష్ట్రాలకు ఉన్న నమ్మకాన్ని చూసినప్పుడు, సోదరుడు బ్రజేశ్ గారితో, సోదరుడు జ్యోతి మండల్ తో పాటు పుత్రిక మోనికా తో కూడా మాట్లాడాను. వారిలో విశ్వాసం తొణికిసలాడుతోంది.

మిత్రులారా, చాలావరకు మత్స్య సంపద స్వచ్ఛమైన నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా గంగానది ని స్వచ్ఛత తో పాటు నిర్మలంగా మార్చేందుకు ఉద్దేశించిన మిషన్ నుంచి కూడా సత్ఫలితాలు అందుతున్నాయి. గంగానది చుట్టుపక్కల ప్రాంతాల్లో నదీ రవాణా కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీని వల్ల మత్స్యరంగానికి లబ్ది చేకూరడం ఖాయం. ఈ ఆగస్టు 15 న ప్రకటించిన ‘మిషన్ డాల్ఫిన్’ కూడా మత్స్యరంగంపై ప్రభావం చూపిస్తుంది. బయో-ప్రొడక్ట్ మద్దతు అదనపు లాభాన్ని ఇవ్వనుంది. మా నీతీశ్ బాబు గారు ఈ మిషన్‌ పై చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. గంగానది లో డాల్ఫిన్ల సంఖ్య పెరిగితే, గంగానది తీరప్రాంత ప్రజలకు దీనిద్వారా చాలా ప్రయోజనాలను లభిస్తాయి. ఈ లబ్ది లో  ప్రతి ఒక్కరికీ భాగం ఉంటుంది.

మిత్రులారా, నీతీశ్ గారి నేతృత్వంలో.. ప్రతి గ్రామానికి నీటిని అందించేందుకు చాలా ప్రశంసనీయమైన పని జరుగుతోంది. 4-5 ఏళ్ల క్రితం బిహార్‌ లో 2 శాతం కుటుంబాలకు మాత్రమే స్వచ్ఛమైన తాగునీటి సరఫరా జరిగేది. కానీ నేడు ఈ సంఖ్య 70 శాతానికి పైగా పెరిగింది. ఈ కాలం లో సుమారు 1.5 కోట్ల ఇళ్ళు నీటి సరఫరా కు నోచుకున్నాయి.

నీతీశ్ గారి ఈ పథకం వల్ల జల్ జీవన్ మిషన్‌ కు సరికొత్త శక్తి వచ్చింది. కరోనా సమయంలోనూ.. బిహార్ లోని దాదాపు 60 లక్షల ఇళ్ళకు పంపు నీరు అందేలా చర్యలు తీసుకున్నట్లు నాకు చెప్పారు. ఇది వాస్తవం గా పెద్ద విజయం. కరోనా తో దేశమంతా దాదాపుగా స్తంభించిపోయినా.. మన గ్రామాల్లో మాత్రం ఆత్మవిశ్వాసం తో పనులు జరుగుతూనే ఉన్నాయనడానికి ఇదో ఉదాహరణ. కరోనా ఉన్నప్పటికీ, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరవస్తువులు.. మార్కెట్లకు, పాల కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయడమే మన గ్రామాల శక్తి కి నిదర్శనం.

మిత్రులారా, 

ఈసారి ధాన్యం, పండ్ల తో పాటు పాల ఉత్పత్తి అద్భుతంగా ఉంది. ఇది మాత్రమే కాదు, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వాలు, పాడి పరిశ్రమ రికార్డు స్థాయి లో కొనుగోళ్లు చేశాయి. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ నుంచి నేరుగా దేశంలోని 10 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు ను బదిలీ చేశాం. మన బిహార్‌ లో సుమారు 75 లక్షల మంది ఈ పథకం లబ్ధిదారులు ఉన్నారు.  మిత్రులారా, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 6 వేల కోట్ల రూపాయలు బిహార్ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలాంటి అనేక ప్రయత్నాల వల్ల కరోనా మహమ్మారి ప్రభావం గ్రామాలపై పెద్దగా పడకుండా చేయగలిగాం. కరోనాతో పాటు వరదలను కూడా బిహార్ ఎదుర్కుంటున్న తీరు ప్రశంసనీయం.

మిత్రులారా, 

భారీ వర్షాలు మరియు వరదలు కారణం గా కరోనా తో పాటు బిహార్ , బిహార్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పరిస్థితి గురించి మనకు తెలుసు. సహాయక చర్యలను వేగం గా పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషిచేస్తున్నాయి. బిహార్‌ లోని ప్రతి పేద వ్యక్తి కి, లబ్దిదారుకు, బయటి నుంచి తమ తమ గ్రామాలకు చేరుకుంటున్న శ్రామిక కుటుంబాలకు.. ఉచిత రేషన్ పథకం, ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ ప్రయోజనాలు అందించేందుకు కృషి జరుగుతోంది. ఈ పరిస్థితుల కారణంగానే ఉచిత రేషన్ పథకాన్ని జూన్ నుంచి దీపావళి, ఛఠ్ పూజ వరకు పొడగించడమైంది.

మిత్రులారా, 

కరోనా సంక్షోభం కారణం గా నగరాల నుండి తిరిగి వచ్చిన చాలా మంది కార్మికులు పశుపోషణ దిశ గా ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తో పాటు బిహార్ ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా ఇలాంటి వారికి ప్రోత్సాహం లభిస్తోంది. ఈ రోజు మీరు కంటున్న కలలు, వాటిని సాకారం చేసుకునేందుకు తీసుకుంటున్న చర్యల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను. ఇది రాసిపెట్టుకోండి. దేశ పాడి పరిశ్రమ ను విస్తరించడానికి ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోంది. రైతు కు, పశువుల పెంపకందారులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా కొత్త ఉత్పత్తులు, సరి కొత్త ఆవిష్కరణలు సృష్టించేలా ప్రోత్సహిస్తోంది. దీనితో పాటు, దేశంలో ఉత్తమమైన జంతుజాతులను సృష్టించడం, వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతోపాటు.. వాటి ఉత్పత్తులు శుభ్రంగా, పుష్టికరంగా కూడా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాము.

ఈ లక్ష్యం తో, ఈ రోజు దేశం లోని 50 కోట్ల కు పైగా పశువులను.. వివిధ వ్యాధులనుంచి కాపాడుకునేందుకు ఉచిత టీకాల కార్యక్రమం జరుగుతోంది. పశువుల కు మంచి పశుగ్రాసాన్ని అందిచేందుకు కూడా వివిధ పథకాల కింద కూడా సదుపాయాలు కల్పిస్తున్నాము. మెరుగైన దేశీయ పశుజాతులను అభివృద్ధి చేయడానికి ‘మిషన్ గోకుల్’ అమలవుతోంది. ఏడాది క్రితం దేశవ్యాప్తంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం మొదలైంది. దీంట్లో ఒక దశ ఈ రోజే పూర్తయింది.

మిత్రులారా, 

నాణ్యమైన దేశీయ పశుజాతుల అభివృద్ధికి బిహార్ ఇప్పుడు ప్రధాన కేంద్రం గా మారుతోంది. నేడు ‘జాతీయ గోకుల్ మిషన్’ ఆధ్వర్యం లో పూర్ణియా, పాట్నా మరియు బరౌనిల లో నిర్మించిన ఆధునిక సౌకర్యాల కారణంగా పాడి రంగం లో బీహార్ మరింత పటిష్టమైన వ్యవస్థను ఏర్పర్చుకోనుంది. పూర్ణియా లో నిర్మించిన కేంద్రం భారతదేశం లోని అతి పెద్ద కేంద్రాల లో ఒకటి. ఇది బిహార్‌ తో పాటు తూర్పు భారతదేశం లోని ప్రధాన భాగానికి లబ్ది చేకూరుతుంది. ఈ కేంద్రం బిహార్ దేశీయ జాతులైన ‘బఛౌర్’, 'రెడ్ పూర్ణియా' వంటి జాతుల అభివృద్ధి ని మరియు పరిరక్షణ ను ప్రోత్సహిస్తుంది.

మిత్రులారా,

ఒక ఆవు సాధారణం గా సంవత్సరంలో ఒక దూడ ను కంటుంది. కానీ ఐవీఎఫ్ టెక్నాలజీ తో ఒక ఆవు సాయం తో ఒక ఏడాది లో ఎక్కువ దూడలను సృష్టించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం తో ప్రతి గ్రామానికి చేరుకోవడమే మా లక్ష్యం.

మిత్రులారా,

ఉత్తమ పశువుల జాతుల ను సృష్టించడంతో పాటు, వాటి సంరక్షణ గురించిన సరైన శాస్త్రీయ సమాచారం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్నేళ్లుగా సాంకేతికత ను వినియోగిస్తున్నాం. ఇందులో భాగంగా 'ఇ-గోపాల్' యాప్ ఈ రోజు ప్రారంభమైంది. ఆన్‌లైన్ డిజిటల్ మాధ్యమం అయిన ‘ఇ-గోపాల్’ యాప్ ద్వారా పశువుల యజమానులకు ఆధునిక పశువులను ఎంచుకోవడం సులభమవుతుంది. వారికి దళారీ వ్యవస్థ నుంచి విముక్తి లభిస్తుంది. ఈ యాప్ పశువుల కు సంబంధించిన ఉత్పాదకత నుంచి దాని ఆరోగ్యం, ఆహారం వరకు మొత్తం సమాచారాన్ని ఉచితం గా అందిస్తుంది. దీని ద్వారా రైతు కు తన వద్ద ఉన్న పశువు కు ఎప్పుడెప్పుడు ఏమేం ఇవ్వాలో తెలుస్తుంది. ఒకవేళ పశువు అనారోగ్యం బారిన పడితే.. ఎక్కడ తక్కువ ధర కు చికిత్స లభిస్తుందో కూడా తెలిసిపోతుంది. దీంతోపాటు ఈ యాప్ ప్రతి పశువు తో అనుసంధానమవుతుంది. తద్వారా పశువుల కు ‘ఆధార్’ ను ఇచ్చేందుకు వీలవుతుంది. ఒకసారి ఈ ‘ఆధార్‌’ లో పశువు కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటు లోకి వస్తే.. అది వాటిని కొనుగోలు చేసే వారి శ్రమ ను తగ్గిస్తుంది.

మిత్రులారా,

వ్యవసాయమైనా, పశుసంవర్ధకమైనా, మత్స్య శాఖ అయినా.. శాస్త్రీయ పద్ధతులను అవలంబించడం ఇందుకోసం గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం అత్యంత అవసరం. వ్యవసాయ అధ్యయనాలు మరియు పరిశోధనలకు బిహార్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. దిల్లీ లో మేము పూసా-పూసా అని వింటుంటాం. నిజమైన పూసా దిల్లీ లో కాదు, బిహార్‌ లోని సమస్తీపుర్‌ లో ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే దిల్లీ లో ఉన్నది బిహార్ పూసా కు కవల సోదరుడు.

మిత్రులారా, 

స్వాతంత్య్రాని కి పూర్వమే సమస్తీపుర్ లోని పూసా లో ఉన్న జాతీయ స్థాయి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రారంభించబడింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జన నాయక్ కర్పూరీ ఠాకూర్ వంటి దీర్ఘదృష్టి గల నేతలు స్వాతంత్య్రానంతరం ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది, 2016 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్ర విశ్వవిద్యాలయం గా గుర్తింపు ను ఇవ్వడమైంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయం లో, అనుబంధ కళాశాలల్లో కూడా కోర్సులు, వివిధ సౌకర్యాలు విస్తరించాయి. మోతీహారీ లోని కొత్త వ్యవసాయ, అటవీ కళాశాలైనా, పూసా లోని స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్ అండ్ రూరల్ మేనేజ్‌మెంట్ అయినా.. బిహార్ లో వ్యవసాయ విద్య, వ్యవసాయ నిర్వహణ విద్య ను అందించేందుకు ఇలాంటి విద్యావ్యవస్థలు బలోపేతం అవుతున్నాయి. ఈ మహత్కార్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యం తో ‘స్కూల్ ఆఫ్ అగ్రి బిజినెస్, రూరల్ మేనేజ్‌మెంట్’ నూతన భవనాన్ని ప్రారంభించడమైంది. దీంతోపాటు కొత్త వసతిగృహాలకు , స్టేడియం లకు, అతిథి గృహాలకు కూడా శంకుస్థాపన జరిగింది.

మిత్రులారా,

వ్యవసాయ రంగంలోని ఆధునిక అవసరాలకు అనుగుణంగా గత 5-6 ఏళ్లుగా దేశంలో ఒక పెద్ద ఉద్యమం జరుగుతోంది. 6 ఏళ్ల క్రితం దేశంలో ఒకే ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది, నేడు దేశంలో మూడు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం బిహార్ లో వచ్చే వరదల నుంచి వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యల కోసం మహాత్మా గాంధీ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. అదేవిధంగా, మోతీపుర్‌ లోని చేపల కోసం ప్రాంతీయ పరిశోధన, శిక్షణా కేంద్రం, మోతిహారీ లోని పశు సంవర్ధక విభాగం తో పాల అభివృద్ధి కేంద్రం అనుసంధానమైంది. ఇలా అనేక సంస్థల ను వ్యవసాయ విజ్ఞానం, సాంకేతికత తో జోడించేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

మిత్రులారా, 

గ్రామాలకు సమీపంలో క్లస్టర్లు ఏర్పాటు చేయడం, ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన, దీంతో పాటుగా ఆహార ఉత్పత్తుల పరిశోధన కేంద్రాల స్థాపన దిశ గా భారత్ దూసుకుపోతోంది. ఒక రకంగా ‘జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధాన్’ దిశ లో మనం పయనిస్తున్నామని చెప్పుకోవచ్చు. ఈ మూడుశక్తులు కలిసి కృషి చేస్తే.. గ్రామీణ భారతం లో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయం. బిహార్‌ లో ఇటువంటి మార్పుల కు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి లిచీ, జర్దాలూ రకం మామిడి, ఉసిరిక, మఖానా వంటి ఉత్పత్తులు.. మధుబనీ వర్ణచిత్రాలు వంటి ఎన్నో ప్రత్యేకతలు బిహార్‌ లోని జిల్లాల సొంతం. ఇలాంటి వాటికి మరింత ప్రచారం జరగాలి. స్థానిక ఉత్పత్తులకు ఎంత మంచి ప్రచారం జరిగితే.. బిహార్ అంత ఎక్కువగా స్వావలంబనను సాధించేందుకు వీలుంటుంది. తద్వారా దేశం కూడా స్వయంసమృద్ధి దిశగా దూసుకుపోతుంది.

మిత్రులారా, 

బిహార్ యువత మరీ ముఖ్యంగా మా అక్కాచెల్లెళ్లు ఈ దిశగా గణనీయమైన కృషి చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. వరి సాగు, భూమిని లీజుకు తీసుకుని కూరగాయలు పండించడం, అజోలా తో సహా ఇతర సేంద్రియ ఎరువుల వాడకం, వ్యవసాయ యంత్రాలతో అనుసంధానించబడిన కేంద్రాల విషయంలో బిహార్ మహిళలు చూపిస్తున్న చొరవ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రయత్నానికి మరింత శక్తిని అందిస్తున్నాయి. పూర్ణియా జిల్లా లో మొక్కజొన్న వ్యాపారం తో సంబంధం ఉన్న ‘అరణ్యక్ ఎఫ్‌పీవో’, కోసీ ప్రాంతం లోని మహిళా పాడి రైతుల ‘కౌశికీ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’ వంటి ఎన్నో సంఘాలు, బృందాలు చేస్తున్న పని ప్రశంసనీయం. ఇప్పుడు అలాంటి ఉత్సాహభరితమైన యువత కోసం, సోదరీమణుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి ని కూడా ఏర్పాటు చేసింది. లక్ష కోట్ల రూపాయల ఈ మౌలిక సదుపాయాల నిధి తో, ఎఫ్‌పీవో-వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, గ్రామాల్లో నిల్వ కేంద్రాలు, శీతల గిడ్డంగులతో పాటు ఇతర సౌకర్యాలను నిర్మించడానికి సులభంగా ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతో పాటుగా.. మా సోదరీమణుల స్వయం సహాయక బృందాలకు కూడా చాలా సహాయం అందుతోంది. బిహార్‌ లో 2013-14తో పోలిస్తే స్వయం సహాయక బృందాలకు రుణాలు 32 రెట్లు పెరిగాయి. ఇది మన మహిళల శక్తిసామర్థ్యాలు వారి పారిశ్రామిక నైపుణ్యంపై దేశంలోని బ్యాంకులకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

మిత్రులారా,

బిహార్ లోని గ్రామాలను, దేశం లోని గ్రామాలను ఆత్మనిర్భర్ భారత్ కేంద్రంగా మార్చేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగం గా బిహార్ లో కార్మికుల పాత్ర మరింత పెరిగింది. అందుకే మీపై యావద్భారతదేశం అంచనాలు కూడా పెరిగాయి. బిహార్ ప్రజలు దేశం లో ఉన్నా విదేశాల్లో ఉన్నా.. వారి కృషితో, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. అదే స్ఫూర్తి తో ఆత్మనిర్భర్ బిహార్ నిర్మాణంలోనూ ఇలాగే నిరంతర కృషి తో భాగస్వాములు అవుతారని విశ్వసిస్తున్నాను. 

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భం గా మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ నా ఆకాంక్షలను, భావాలను వ్యక్తపరుస్తాను. మీ నుంచి నేను కొంత ఆశిస్తున్నాను. ముందుగా మీరు ముఖానికి మాస్క్ వేసుకోండి, రెండు అడుగుల దూరాన్ని పాటిస్తూ.. సురక్షితం గా, ఆరోగ్యం గా ఉండండి.

మీ ఇంట్లోని పెద్దలను (వయోవృద్ధులను) జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైన పని. కరోనా ను ఎవరూ తేలికగా తీసుకోవద్దు.  శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. టీకా వచ్చేంతవరకు సామాజిక దూరం, మాస్కు వంటి నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండటమే ఉత్తమమైన ఉపాయం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు; పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాను.

ఈ రోజు మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం గా ఉంది. మరోసారి మీ మధ్యకు వచ్చేందుకు అవకాశం దక్కినందుకు సంతోషిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి వర్గ సహచరుడు మా గిరిరాజ్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.


***


(Release ID: 1653208) Visitor Counter : 208