ప్రధాన మంత్రి కార్యాలయం

‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 SEP 2020 1:14PM by PIB Hyderabad

జాతీయ విద్యావిధానం- 2020 (ఎన్ఇపి- 2020) లో భాగం గా ‘‘21వ శతాబ్దం లో పాఠశాల విద్య’’ పై ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు అనగా సెప్టెంబర్ 11 న శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

ఇవాళ, రేపు అనగా సెప్టెంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాన్ని విద్యా మంత్రిత్వ శాఖ శిక్షా పర్వ్ లో భాగం గా నిర్వహిస్తోంది.


ఇంతకు ముందు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఎన్ఇపి- 2020 లో భాగం గా గత నెల అనగా ఆగస్టు 7న ‘‘ఉన్నత విద్య లో పరివర్తనాత్మక సంస్కరణలపై సమావేశం’’ ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసాన్ని ఇచ్చారు.


ఎన్ఇపి- 2020 పై సెప్టెంబర్ 7 న ఏర్పాటు చేసిన గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి కూడా శ్రీ మోదీ ప్రసంగించారు.

ఇదివరకటి జాతీయ విద్యావిధానాన్ని 1986 లో ప్రకటించారు. 34 సంవత్సరాల తరువాత, ఇరవై ఒకటో శతాబ్దం లో ప్రకటించిన తొలి విద్యావిధానమే ఈ ‘జాతీయ విద్యావిధానం-2020’ (ఎన్ఇపి-2020). పాఠశాల విద్య, ఉన్నత విద్య.. ఈ రెండు స్థాయిలలో ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టడం కోసం ఎన్ఇపి-2020 ని ఉద్దేశించారు.

భారతదేశాన్ని న్యాయబద్ధమైన, జ్ఞానభరిత సమాజం గా తీర్చిదిద్దడం కొత్త జాతీయ విద్యావిధానం ధ్యేయం.  భారతదేశ మూలాలు కీలకంగా ఉండే ఒక విద్యావ్యవస్థ ను ఆవిష్కరించడం తో పాటు అటువంటి విద్యావ్యవస్థ అండ తో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అత్యంత శక్తిశాలి దేశం గా కూడా తయారు చేయడం ఈ విధానం ముఖ్యోద్దేశాలు.  


ఎన్ఇపి-2020 దేశం లో పాఠశాల విద్య లో విస్తృత సంస్కరణలను తీసుకువచ్చింది.  పాఠశాల స్థాయిలో 8 ఏళ్ల వరకు బాలల కోసం యూనివర్సలైజేషన్ ఆఫ్ అర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎండ్ ఎడ్యుకేషన్ (ఇసిసిఇ) పై శ్రద్ధ వహించడం జరుగుతుంది; 10+2 స్థాయి పాఠశాల పాఠ్య ప్రణాళికల స్థానం లో  5+3+3+4  పాఠ్య ప్రణాళికల ను ప్రవేశపెడతారు; దీంతో పాటు, పాఠ్య ప్రణాళిక ను 21వ శతాబ్దం నైపుణ్యాలు, గణిత శాస్త్ర సంబంధిత ఆలోచనల సరళి, విజ్ఞానశాస్త్రం పట్ల అభిరుచి, కొత్త గా నేషనల్ కరిక్యులర్ ఫ్రేం వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో ఒక సమగ్ర వ్యవస్థ ను ఏర్పాటు చేరయడం, ఉపాధ్యాయులకు జాతీయ వృత్తినైపుణ్య సంబంధిత ప్రమాణాల ను రూపొందించడం, మూల్యాంకన సంబంధిత సంస్కరణలు, బాలల కోసం ఉద్దేశించిన సంపూర్ణ పురోగతి నివేదిక ను తేవడం, 6వ తరగతి నుంచే వృత్తివిద్య అంశాల ను జతపరచడం వంటివి ఎన్ఇపి తలపెట్టిన సంస్కరణలలో కలిసి ఉన్నాయి.

ఎన్ ఇపి లో సంకల్పించిన సమగ్ర పరివర్తన దేశ విద్యావ్యవస్థ లో ఒక మౌలిక మార్పు ను తీసుకురావడమే కాక, భారతదేశ మాన్య ప్రధాన మంత్రి ఆలోచనల ప్రకారం ఒక నూతన ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి బాట వేసే ఒక పునరుత్తేజిత విద్యా వ్యవస్థ ను ఆవిష్కరిస్తుంది.

నూతన విద్యావిదానం 2020 ని ముందుకు తీసుకుపోయేందుకు ఉపాధ్యాయులకు మార్గాన్ని సుగమం చేసేందుకు ‘శిక్షక్ పర్వ్’ ను ఈ సంవత్సరం సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 25 వరకు నిర్వహిస్తున్నారు.  దీనిలో భాగం గా జాతీయ విద్యావిధానం లోని వివిధ అంశాలపై దేశవ్యాప్తంగా వెబినార్లను, వర్చువల్ సమావేశాలను, కాన్ క్లేవ్ లను ఏర్పాటు చేస్తున్నారు.


 

*****


(Release ID: 1652971) Visitor Counter : 241