యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఇంటి పరిధిలోనే సాధన చేసేలా ఎలైట్, వర్ధమాన, ఖేలో ఇండియా విభాగం షూటర్లకు మందుగుండు సామగ్రిని అందిస్తాం: శ్రీ కిరణ్ రిజిజు
Posted On:
09 SEP 2020 9:51PM by PIB Hyderabad
సాయ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ డా.కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ (కేఎస్‌ఎస్‌ఆర్)ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు సందర్శించారు. షూటర్లతో మాట్లాడారు. ఎలైట్, వర్ధమాన, ఖేలో ఇండియా విభాగాల షూటర్లకు మందుగుండు సామగ్రి, లక్ష్యాలను కేఎస్‌ఎస్‌ఆర్‌తోపాటు ఇతర గుర్తింపు పొందిన అకాడమీల నుంచి అందిస్తామని, ఇళ్ల పరిధిలోనే వారు సాధన చేయవచ్చని హామీ ఇచ్చారు.

"2024, 2028 ఒలింపిక్స్ ప్రాబబుల్స్ దేశంలో ఎక్కడినుంచైనా సాధన కొనసాగించడం అత్యంత ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో వారు కేఎస్‌ఎస్‌ఆర్ లేదా ఇతర అకాడమీలకు వెళ్లలేకపోవచ్చు. చాలామంది తమ ఇంటి వద్ద, ఇళ్లకు సమీపంలో ఉన్న కేంద్రాల్లో సాధన చేస్తున్నారు. మందుగుండు లేక వారి సాధన ఆగిపోకూడదు. షూటర్లు వారికి కావలసిన సామగ్రిని కేఎస్‌ఎస్‌ఆర్‌తోపాటు, గుర్తింపు పొందిన అకాడమీల నుంచి పొందవచ్చు" అని కిరణ్ రిజిజు చెప్పారు.

ఈ నిర్ణయం వల్ల, అన్ని విభాగాల్లోని 253 మంది షూటర్లకు ప్రయోజనం కలుగుతుంది. కేఎస్‌ఎస్‌ఆర్‌కు రాకుండానే, వారికి అనుకూలంగా ఉన్న కేంద్రంలో షూటర్లు సాధన చేయవచ్చు. ఎలైట్ విభాగంలో ఉన్న అపూర్వి చందేల, అంజుమ్ మౌద్గిల్, సౌరభ్ చౌదరి సహా అనేక మంది షూటర్లు వారి సొంత ఊర్లలోనే సాధన చేసే అవకాశం పొందుతారు.
మంత్రి రిజిజుతో మాట్లాడిన ఎలైట్ షూటర్లలో అనీష్ భన్వాలా ఒకరు. "మంత్రి ఇక్కడకు వచ్చి మాతో మాట్లాడటం, మా అవసరాలను కనుక్కోవడం చాలా గొప్పగా ఉంది. మాకు దగ్గరలో ఉన్న కేంద్రంలో సాధన చేయడం వల్ల ఈ కరోనా సమయంలో తగిన భద్రత పొందడంతోపాటు, మరింత ఎక్కువ సమయాన్ని శిక్షణ కోసం కేటాయించవచ్చు. దిల్లీలో నివాసాలు లేని ఎలైట్ షూటర్లకు ఈ నిర్ణయం అతి పెద్ద ఊరట. ఒలింపిక్స్ కోసం సిద్ధమవడానికి ఇది మాకు భరోసానిస్తుంది" అని సంతోషం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1652860)
Visitor Counter : 142