రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ.8.3 కోట్ల విలువైన ఫినాల్ ఉత్పత్తి చేసిన బెంగాల్ కెమికల్స్&ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్
సంస్థను స్థాపించిన 120 ఏళ్లలో ఇదే అత్యధిక ఉత్పత్తి
గత నాలుగేళ్లలో సంస్థ లాభదాయకత 4 నుంచి 30 శాతానికి పెరుగుదల
Posted On:
09 SEP 2020 5:32PM by PIB Hyderabad
బెంగాల్ కెమికల్స్&ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (బీసీపీఎల్) అత్యధిక ఫినాల్ ఉత్పత్తితో రికార్డు సృష్టించింది. ఆగస్టులో రూ.8.3 కోట్ల విలువైన ఫినాల్ ఉత్పత్తి చేసింది. 120 ఏళ్ల సంస్థ చరిత్రలో ఇదే అత్యధిక ఉత్పత్తి.

కేంద్ర రసాయనాలు&ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీసీపీఎల్ పని చేస్తుంది. సంస్థ సాధించిన ఘనతపై స్పందించిన కేంద్ర రసాయనాలు&ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ, సంస్థ సిబ్బందిని అభినందించారు.
ప్రస్తుత రికార్డును అధిగమించి, ఈనెలలోనే రూ.10 కోట్ల విలువైన ఉత్పత్తి సాధించేలా కృషి చేస్తున్నట్లు సంస్థ ఎండీ పి.ఎం.చంద్రయ్య చెప్పారు.
బెంగాల్ కెమికల్స్‌లో ముఖ్యమైన ఉత్పత్తయిన దీపం గుర్తు ఫినాల్‌ను పనిహతి కర్మాగారంలో ఉత్పత్తి చేస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఈ కర్మాగారం అద్భుత పనితీరును కనబరిచి మంచి లాభాలు ఆర్జించింది. కొవిడ్ కారణంగా ఏర్పడిన డిమాండ్‌ను అందుకోవడానికి, ఈ కర్మాగారంలో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 51,960 సీసాల ఫినాల్‌ను ఉత్పత్తి చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లో బీసీపీఎల్ రూ.9.6 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ నెల కూడా పూర్తయ్యేసరికి రూ. 14.6 కోట్లు ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వచ్చిన లాభం రూ.5.6 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో వచ్చిన లాభం రూ.14.4 కోట్లు.
గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో లాభదాయకత 17 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో అది 30 శాతానికి చేరింది. గత నాలుగేళ్లలో సంస్థ లాభదాయకత 4 నుంచి 30 శాతానికి పెరిగింది.
బెంగాల్ కెమికల్స్&ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మన దేశంలోనే తొలి ఔషధ సంస్థ. గృహ, ఔషధ, పారిశ్రామిక రంగాల అవసరాలకు తగినట్లు ఇది ఉత్పత్తులు చేస్తోంది.
***
(Release ID: 1652826)