జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ అమలు కోసం, సిక్కిం ముఖ్యమంత్రితో చర్చించిన - కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి.
2022 నాటికి 100 శాతం అమలుచేయాలని యోచిస్తున్న - సిక్కిం
Posted On:
07 SEP 2020 5:22PM by PIB Hyderabad
సిక్కిం రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు చేయడం గురించి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమంగ్ తో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చించారు. ఈ సమావేశంలో - తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి; జాతీయ జల్ జీవన్ మిషన్, అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ తో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సిక్కిం నుండి, ఆ రాష్ట్ర పి.డబ్ల్యూ.డి. శాఖ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటి సరఫరాను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం, జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలులో ఉంది. మిషన్ యొక్క లక్ష్యం సార్వత్రిక కవరేజ్, అనగా గ్రామంలోని ప్రతి కుటుంబానికి వారి గృహాలలోనే పంపు నీటి కనెక్షన్ లభిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ ట్యాప్ కనెక్షన్ అందించే లక్ష్యాన్ని నెరవేర్చడానికి, 2022 నాటికి 100 శాతం కవరేజ్ సాధించాలని సిక్కిం రాష్ట్రం యోచిస్తోంది.
రాష్ట్రంలో మిషన్ పురోగతిపై కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో సవివరంగా చర్చించారు. ఈ పరివర్తన మిషన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన కేంద్ర మంత్రి, ఇప్పటికే ఉన్న నీటి సరఫరా పథకాలను మెరుగు పరచి, అభివృద్ధి చేయాలని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో, మొత్తం 411 గ్రామాలలో నీటి సరఫరా పథకాలు ఉన్నాయి, అయితే, ఆ గ్రామాలలోని మొత్తం 1.05 లక్షల గృహాలకు గాను, 70,525 (67 శాతం) గృహాలకు మాత్రమే ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి. సమాజంలోని పేద, అట్టడుగు వర్గాలకు చెందిన మిగిలిన గృహాలకు తొందరగా ట్యాప్ కనెక్షన్లు కల్పించే విధంగా, ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రిని కోరారు.
ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రానికి అవసరమైన పూర్తి సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, శ్రీ షేఖావత్ హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ పనుల కోసం, అందించిన ట్యాప్ కనెక్షన్ల పరంగా జరిగిన పని ఆధారంగా మరియు అందుబాటులో ఉన్న కేంద్ర నిధులు, రాష్ట్ర వాటా నిధుల వినియోగం ఆధారంగా భారత ప్రభుత్వం అదనపు నిధులను అందజేస్తుంది.
2020-21 మధ్య కాలంలో 16,879 గృహాల్లో ట్యాప్ కనెక్షన్లు అందించాలని సిక్కిం యోచిస్తోంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి 31.36 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. భౌతిక, ఆర్థిక పనితీరు ఆధారంగా అదనపు నిధులు పొందడానికి కూడా రాష్ట్రానికి అవకాశం ఉంది. సిక్కిం గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఆర్థిక కమిషన్ గ్రాంట్ల కింద 42 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో 50 శాతం నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యానికి ఉపయోగించబడుతుంది. ఈ నిధిని గ్రామీణ నీటి సరఫరా, నీటి శుద్ధి మరియు తిరిగి వినియోగం కోసం ఉపయోగించుకునేలా, ముఖ్యంగా నీటి సరఫరా పథకాల యొక్క దీర్ఘకాలిక అమలు మరియు నిర్వహణను నిర్ధారించడానికి తగిన, ప్రణాళిక చేయాలని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రిని కోరారు.
గ్రామ కార్యాచరణ ప్రణాళికల తయారీతో పాటు గ్రామ నీటి మరియు పారిశుద్ధ్య కమిటీ / పానీ సమితి యొక్క గ్రామ పంచాయతీ యొక్క ఉప కమిటీగా కనీసం 50 శాతం మంది మహిళా సభ్యులతో, గ్రామంలోని నీటి సరఫరా మౌలిక సదుపాయాల ప్రణాళిక, రూపకల్పన, అమలు, నిర్వహణ మరియు కొనసాగించే బాధ్యతల గురించి కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు. అన్ని గ్రామాలు విలేజ్ యాక్షన్ ప్లాన్ (వి.ఏ.పి) ని సిద్ధం చేయాలి, ఇందులో తాగునీటి వనరుల అభివృద్ధి / పెంపుదల, నీటి సరఫరా, నీటి యాజమాన్యం, నిర్వహణ, ఆపరేషన్ మరియు సంరక్షణ మొదలైనవి ఉంటాయి. జల్ జీవన్ మిషన్, నిజమైన ప్రజల ఉద్యమంగా మార్చడానికి ఐ.ఈ.సి. ప్రచారాన్ని చేపట్టాలని కోరారు.
జల్ జీవన్ మిషన్ కింద, స్థానిక సమాజం చురుకుగా పాల్గొనడం ద్వారా నీటి నాణ్యత పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరఫరాచేస్తున్న నీటి నాణ్యతను పరీక్షించడానికి ఫీల్డ్ టెస్ట్ కిట్ లను ఉపయోగించడానికి ప్రతి గ్రామంలో 5 మందికి ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి నీటి వనరులను భౌతిక, రసాయన పారామితుల కోసం ప్రతి సంవత్సరానికీ ఒకసారి మరియు బాక్టీరియా కాలుష్యం కోసం రెండు సార్లు పరీక్షించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర మరియు జిల్లా ప్రయోగశాలల అధికారిక గుర్తింపును పూర్తి చేయాలనీ, నీటి నాణ్యతను ప్రజలు నామమాత్రపు రుసుముతో పరీక్షించుకోగలిగేలా వాటిని అందుబాటులో ఉంచాలని కూడా రాష్ట్రానికి సూచించారు. జె.జె.ఎమ్. కింద చర్యలు చేపట్టడం ద్వారా, వినియోగం ఆధారిత గ్రామీణ నీటి సరఫరా విధానంలో సిక్కిం నాయకత్వాన్ని అందించగలదని జల్ శక్తి శాఖ మంత్రి పేర్కొన్నారు.
కష్టతరమైన భూభాగం, తక్కువ సంఖ్యలో జనాభా, తక్కువ అనుసంధానతలతో పాటు, ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి వంటి వివిధ సవాళ్ళ గురించి, సిక్కిం ముఖ్యమంత్రి ఉదహరిస్తూ, జల్ జీవన్ మిషన్ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ ట్యాప్ కనెక్షన్‌లను నిర్ణీత సమయంలో అందించే లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ను వేగంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1652167)
Visitor Counter : 153