సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఉచిత మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్‌లైన్ (1800-599-0019) "కిరణ్"ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్
Posted On:
07 SEP 2020 3:19PM by PIB Hyderabad
రోజులో 24 గంటలూ పనిచేసే ఉచిత మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్‌లైన్ (1800-599-0019) "కిరణ్"ను కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్‌చంద్ గెహ్లోత్ ప్రారంభించారు. వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. మానసిక అనారోగ్యాలతో బాధపడేవారికి సాయం చేసేందుకు, ముఖ్యంగా కరోనా సమయంలో ఈ తరహా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పోస్టర్, బ్రోచర్, పుస్తకాన్ని కూడా మంత్రి ఆవిష్కరించారు. హెల్ప్‌లైన్‌పై సవివర ప్రదర్శనను వీక్షించారు.
మానసిక అనారోగ్యాన్ని తొలి దశలోనే గుర్తించడం, ప్రాథమిక చికిత్స, మానసిక మద్దతు, ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి లక్ష్యాలతో మానసిక ఆరోగ్య సేవలను కిరణ్ హెల్ప్‌లైన్ అందిస్తుందని మంత్రి శ్రీ గెహ్లోత్ వెల్లడించారు. ఒత్తిడి, ఆతృత, నిరాశ, భయాందోళనలు, కుంగుబాటు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లు, మత్తు పదార్థాలు, ఆత్మహత్య ఆలోచనలు, సంక్షోభ ప్రేరేపిత మానసిక సమస్యలు, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో బాధ పడేవారికి ఈ హెల్ప్‌లైన్ సేవలు అందిస్తుంది. వ్యక్తులు, కుటుంబాలు, ఎన్‌జీవోలు, తల్లిదండ్రుల సంఘాలు, వృత్తిపర సంఘాలు, ఆస్పత్రులు సహా దేశంలో సాయం కోరిన ప్రతి ఒక్కరికీ 13 భాషల్లో హెల్ప్‌లైన్ ద్వారా తొలి దశ సలహా, కౌన్సెలింగ్ అందుతుంది. మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తులు, కుటుంబ సభ్యులకు ఈ హెల్ప్‌లైన్ ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఎస్‌ఎన్‌ఎల్ సాంకేతిక సాయంతో, ఏ ఒక్కరోజూ సెలవు లేకుండా, రోజులో 24 గంటలూ ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది. ఇందులో 8 జాతీయ సంస్థలు సహా 25 సంస్థలు, 660 మంది మనస్తత్వవేత్తలు, 668 మానసిక వైద్యులు భాగస్వాములుగా ఉన్నారు. హిందీ, అస్సామీ, తమిళం, మరాఠీ, ఒరియా, తెలుగు, మలయాళం, గుజరాతీ, పంజాబీ, కన్నడ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో హెల్ప్‌లైన్ ద్వారా సాయం అందుతుంది.
దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ నెట్‌వర్క్ ద్వారా అయినా 1800-599-0019 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. కాల్ చేయగానే మొదట స్వాగత సందేశం వినిపిస్తుంది. భాషను ఎంచుకునే అంకెను నొక్కమని సూచిస్తుంది. భాష ఎంపిక తర్వాత, రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత, ఫోన్ చేసిన వ్యక్తి కోరుకున్న రాష్ట్రంలోని హెల్ప్‌లైన్ కేంద్రానికి కాల్ కలుస్తుంది. అక్కడి నుంచి మానసిక వైద్య నిపుణుడు లైన్‌లోకి వచ్చి సమస్య పరిష్కారానికి సలహాలు ఇస్తారు. లేదా మరింత వైద్య సాయానికి సిఫారసు చేస్తారు.
చెన్నైలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్', సెహోర్‌లోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్' సంస్థలు హెల్ప్‌లైన్‌ను సమన్వయపరుస్తున్నాయి. 'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్స్', 'ఇండియన్ సైక్రియాట్రిస్ట్స్ అసోసియేషన్', 'ఇండియన్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్స్ అసోసియేషన్' వృత్తిపర మద్దతు అందిస్తున్నాయి.
జాతీయ సంస్థలు... సెహోర్‌లోని ఎన్‌ఐఎంహెచ్‌ఆర్; దిల్లీలోని పీడీయూ-ఎన్‌ఐపీపీడీ; చెన్నైలోని ఎన్‌ఐఈపీఎండీ; సికింద్రాబాద్‌లోని ఎన్‌ఐయూఈపీఐడీ; డెహ్రాడూన్‌లోని ఎన్‌ఐఈపీవీడీ; ముంబైలోని ఏజేవై-ఎన్‌ఐఎస్‌హెచ్‌డీ; కటక్‌లోని ఎస్‌వీ-ఎన్‌ఐఆర్‌టీఏఆర్; కోల్‌కతాలోని ఎన్‌ఐఎల్‌డీ; నోయిడా, నవీ ముంబై, కోల్‌కతాలోని ప్రాంతీయ కేంద్రాలు ఈ హెల్ప్‌లైన్‌లో సహాయ కేంద్రాలుగా పాల్గొంటున్నాయి.
అహ్మదాబాద్, సుందర్‌నగర్, గువాహటి, దేవన్‌గిరి, నెల్లూరు, రాజ్‌నందగావ్, శ్రీనగర్, కోజికోడ్, అండమాన్&నికోబార్ దీవులు, భోపాల్, త్రిపుర, నాగ్‌పుర్, గోరఖ్‌పూర్, లఖ్‌నవూలోని మిశ్రమ ప్రాంతీయ కేంద్రాలు కూడా హెల్‌లైన్‌లో భాగస్వాములుగా పనిచేస్తున్నాయి.
***
(Release ID: 1652016)
Visitor Counter : 3863