బొగ్గు మంత్రిత్వ శాఖ

2030నాటికి బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యం 10 కోట్ల టన్నులు

గ్యాసిఫికేషన్ కు వాడే బొగ్గు రెవెన్యూ వాటాపై

20శాతం రాయితీ: ప్రహ్లాద్ జోషి

బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫ్యాక్షన్ పై బొగ్గు మంత్రిత్వశాఖ వెబినార్

Posted On: 31 AUG 2020 7:26PM by PIB Hyderabad

భూగర్భంలోని బొగ్గును మండించి విద్యుత్ ను ఉత్పత్తి చేసే గ్యాసిఫికేషన్ ప్రక్రియకు సంబంధించి 2030 నాటికి 10కోట్ల టన్నుల బొగ్గు వినియోగ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని, ఇందుకోసం 4లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడతామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫ్యాక్షన్ ప్రక్రియలపై న్యూఢిల్లీలో నిర్వహించిన వెబినార్ సదస్సునుద్దేశించి ప్రహ్లాద్ జోషి ప్రసంగించారు. లక్ష్య సాధనకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వెబినార్ జరిగింది. భారత ప్రభుత్వం, కోల్ ఇండియా లిమిటెడ్, బొగ్గు రంగానికి చెందిన దాదాపు 700మంది ప్రతినిధులు వెబినార్ సదస్సులో పాలుపంచుకున్నారు.

  వెబినార్ సదస్సులో మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫాక్షన్ అనేది ఆశ, అత్యాశ కాదని, ప్రస్తత అవసరమని అన్నారు. స్వచ్ఛమైన ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు గ్యాసిఫికేషన్ కోసం వినియోగించే బొగ్గు రెవెన్యూ వాటాపై 20శాతం రాయితీని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. యూరియా, తదితర రసాయనాల తయారీ కోసం సింథటిక్ సహజవాయు ఇంధనం, శక్తి ఇంధనం వంటివి ఉత్పత్తికి ఇది దోహదపడుతుందన్నారు.

 బొగ్గు రంగంలో పర్యావరణ హితమైన హరిత మార్గాలను అనుసరించాలనే సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి చెప్పారు. బొగ్గు గ్యాసిఫికేషన్, లిక్విఫాక్షన్ ప్రక్రియలను ఇప్పటికే ప్రభుత్వ అజెండాలో చేర్చామన్నారు. బొగ్గు గనుల ఉపరితలంపై గ్యాసిఫికేషన్ ప్రక్రియ రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు

  ఇందుకు సంబంధించి నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అధ్యక్షతన ఒక సారథ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. బొగ్గు మంత్రిత్వ శాఖకుచెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. గ్యాసిఫికేషన్ కు సంబంధించి మూడు ప్లాంట్లు నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వ రంగంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సి..ఎల్.) సంస్థ సంకల్పించింది. దంకుని ప్లాంట్ కు అదనంగా ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. నిర్మాణం, యాజమాన్యం, నిర్వహణ (బి...) ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్త టెండరింగ్ ప్రక్రియ ద్వారా ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సింధటిక్ సహజవాయువు మార్కెటింగ్ కోసం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)తో అవగాహనా ఒప్పందాన్ని కూడా సి..ఎల్. కుదుర్చుకుంది.

  బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియకోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పద్ధతికి అనుగుణంగా ఇతర సాంకేతిక పరిజ్ఞాన పద్ధతుల వినియోగంపై అన్వేషణ చేపట్టాలని వెబినార్ కు హాజరైన ప్రతినిధులను కేంద్రమంత్రి జోషి కోరారు. దేశ నిల్వలను గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సుస్థిర లక్ష్య సాధనకు ఇది దోహదపడుతుందన్నారు.

  నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి,కె. సారస్వత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ కూడా వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. కోల్ ఇండియా లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ బినయ్ దయాళ్, కేంద్ర గనుల తవ్వకం, పరిశోధనా సంస్థ (సి..ఎం.ఎఫ్.ఆర్.) డైరెక్టర్ డాక్టర్ పి.కె. సింగ్, భారతీయ ప్రాజెక్టులు, అభివృద్ధి సంస్థ (పి.డి..ఎల్.) జనరల్ మేనేజర్ అశుతోష్ ప్రసాద్, జె.ఎస్.పి.ఎల్. చైర్మన్ నవీన్ జిందాల్, ముంద్రా సినర్జీ సంస్థ సి... రాజేశ్ ఝా, జె.ఎస్.పి.ఎల్. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి.ఆర్. శర్మ, ట్రస్ట్ నార్త్ వెంచర్స్ సంస్థ భాగస్వామి డాక్టర్దేవ్ గకాస్కర్, ఎయిర్ ప్రాడక్ట్స్  గ్రూపు వైస్ ప్రెసిడెంట్ బాబ్ కార్టర్ వెబినార్ లో తమ అభిప్రాయాలను తెలియజేశారు.

****



(Release ID: 1650232) Visitor Counter : 195