రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
తప్పనిసరి ఔషధాల లభ్యత, సహేతుకమైన ధరల నిర్ణయంలో ఎన్.పి.పి.ఎ. కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రులు శ్రీ గౌడ, శ్రీ మాండవీయ సంస్థ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభినందించారు
ప్రాణాధార ఔషధాలను సరసమైన ధరలకు అందుబాటులోకి తేవడంలోనూ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పౌరులందరికీ అందుబాటులోకి తేవాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత దిశగానూ ఎన్.పి.పి.ఎ. అవిశ్రాంతంగా పని చేసిందని శ్రీ గౌడ కొనియాడారు
కోవిడ్-19 కాలంలో మందులకు ఎలాంటి కొరత రాకుండా ఎన్.పి.పి.ఎ. నివారించింది, ప్రజల విన్నపాలను సమర్ధవంతంగా పరిష్కరించింది: శ్రీ గౌడ
ప్రధాన మంత్రి కోరుకున్న ఆరోగ్య భారతం కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నందుకు, సామాన్యులకు కోట్ల రూపాయలు మిగల్చడంలో సాయపడినందుకు, డిజిటల్ ఇండియా మిషన్ కు ప్రేరణగా డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించినందుకు శ్రీ మాండవీయ ఎన్.పి.పి.ఎ.ను ప్రశంసించారు
Posted On:
29 AUG 2020 4:23PM by PIB Hyderabad
జాతీయ ఔషధ ధరల నిర్ణాయక ప్రాధికార సంస్థ (ఎన్.పి.పి.ఎ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రాణాధార ఔషధాలను సరసమైన ధరలకు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు, పౌరులందరికీ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత దిశగానూ అవిశ్రాంతంగా పని చేస్తున్న’’దని ఎన్.పి.పి.ఎ.ను ఆయన కొనియాడారు. కోవిడ్ 19 మహమ్మారి కాలంలో ఎన్.పి.పి.ఎ. పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్న మంత్రి ‘‘కోవిడ్ 19 సమయంలో ఔషధాలకు ఎలాంటి కొరత రాకుండా కూడా ఎన్.పి.పి.ఎ. నిరోధించింది. క్రియాశీలమైన నియంత్రణా కేంద్రం ద్వారా ప్రజల విన్నపాలను సమర్ధవంతంగా పరిష్కరించింది. కోవిడ్ సమయంలో ముఖ్యమైన మందులను సరఫరా చేయడం ద్వారా 120కు పైగా దేశాల అవసరాలను తీర్చింది’’ అని ప్రస్తుతించారు.
కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ ఒక ట్వీట్ ద్వారా ఎన్.పి.పి.ఎ. పోషించిన ముఖ్యమైన పాత్రను ఇలా పేర్కొన్నారు. ‘‘అత్యవసర, ప్రాణాధార ఔషధాల ధరలను నియంత్రించడానికి ఎన్.పి.పి.ఎ.ను స్థాపించిన ఆగస్టు 29 ఇండియాకు చాలా ముఖ్యమైన రోజు. ప్రధాన మంత్రి ఆకాంక్షించిన ఆరోగ్య భారతం లక్ష్యంగా ఎన్.పి.పి.ఎ. అవిశ్రాంతంగా పని చేస్తోంది. సామాన్యుల సొమ్ము కోట్ల రూపాయల్లో మిగల్చడానికి దోహదం చేస్తోంది.’’ ఎన్.పి.పి.ఎ. తన విధులను నిర్వర్తించడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని మంత్రి గుర్తించారు.
- ఫార్మా సాహి దామ్- ఔషధ ధరలను పరిశీలించడానికి యాప్.
- ఫార్మా జన్ సమాధాన్- ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి సహాయపడేలా ఏర్పాటైన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ.
- ఫార్మా డేటా బ్యాంక్- ఔషధ ఉత్పత్తిదారుల నుంచి ఆన్ లైన్ సమాచార సేకరణ
ద్వారా ఎన్.పి.పి.ఎ. డిజిటల్ ఇండియా మిషన్ కు ప్రేరణనిస్తోంది.
కేంద్ర ఔషధ శాఖ కార్యదర్శి డాక్టర్ పి.డి. వాఘేలా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్.పి.పి.ఎ. ఇటీవలి ప్రయత్నాల్లో భాగంగా పర్యవేక్షణ, ప్రజా అవగాహన లను బలోపేతం చేయడానికి 13 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ధరల పర్యవేక్షణ- పరిశోధన విభాగం (పి.ఎం.ఆర్.యు) లను ఏర్పాటు చేసిందని తెలిపారు. భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు నిర్ధిష్ట అంశాలపై కీలక సమాచారం ఇవ్వడం ద్వారా ఎన్.పి.పి.ఎ. పోషిస్తున్న పాత్రను ఆయన నొక్కి చెప్పారు. ఆ సమాచారం విధాన రూపకల్పన, అమలు కోసం తీసుకునే నిర్ణయాలకు దోహదపడుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంలో ఎన్.పి.పి.ఎ. ఛైర్మన్ శ్రీమతి శుభ్రా సింగ్ మాట్లాడుతూ డిపిసిఒల పరిధిలో వినియోగదారుల ప్రయోజనాలు, ఔషధ ఉత్పత్తి పరిశ్రమ మధ్య సమతుల్యతను సాధించడానికి ఎన్.పి.పి.ఎ. కృషి చేస్తోందన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ఎన్.పి.పి.ఎ. తన 23 సంవత్సరాల ప్రస్థానంలో... అందుబాటు ధరలకు ఆరోగ్య సంరక్షణ కోసం చేసిన ప్రయత్నాల ద్వారా ఆరోగ్య భారతం అనే ఉన్నతమైన లక్ష్యం దిశగా పని చేసింది. ఎన్.ఎల్.ఇ.ఎం. ఔషధాలు, మోకాలి పరికరాలు, స్టెంట్ల ధరల నిర్ణయం, ఇటీవలే క్యాన్సర్ పై పోరాటానికి వినియోగించే మందులపై వాణిజ్య లాభం హేతుబద్ధీకరణ (టిఎంఆర్) వంటి చర్యలు అందులో భాగం. ఇవి దేశవ్యాప్తంగా వినియోగదారులకు ప్రతి ఏటా గణనీయంగా సొమ్ములను ఆదా చేస్తున్నాయి. ప్రత్యేకించి కోవిడ్ 19 మహమ్మారి కాలంలో పౌరులు, ఉత్పత్తిదారులు, విక్రేతల సమస్యల పరిష్కారం కోసం ఎన్.పి.పి.ఎ. తన నియంత్రణా కేంద్రం ద్వారా 24 x 7 పని చేసింది.
లాక్ డౌన్ సమయంలో ముడి పదార్ధాలు, ప్యాకేజింగ్ సామాగ్రి, మానవ శక్తి లభ్యత లోపించడం వంటి సరఫరా- గొలుసు సమస్యలను కూడా ఎన్.పి.పి.ఎ. పరిష్కరించింది.
ఔషధాల ధరల నిర్ణయానికి, సరసమైన ధరలకు మందులు అందేలా లభ్యత ఉండేలా చూడటానికి... ఎన్.పి.పి.ఎ. ఒక స్వతంత్ర నియంత్రణా వ్యవస్థగా 1997 ఆగస్టు 29న స్థాపించబడింది. ఈ నియంత్రణా వ్యవస్థ రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ లోని ఫార్మాస్యూటికల్స్ విభాగానికి అనుబంధంగా, 1997 ఆగస్టు 29న భారత ప్రభుత్వ గజెట్ ద్వారా ప్రచురించిన తీర్మానానికి అనుగుణంగా ఏర్పాటైంది. ఎప్పటికప్పుడు జారీ చేసే ఔషధ (ధరల నియంత్రణ) ఉత్తర్వుల కింద ఉన్న షెడ్యూలు ఔషధాల ధరలను నిర్ణయించడం, సమీక్షించడం ఎన్.పి.పి.ఎ. విధుల్లో భాగం. అలాగే షెడ్యూలులో లేని ఔషధాలతో సహా అన్ని ఔషధాలూ, వైద్య పరికరాల ధరలను పర్యవేక్షించడం, నియంత్రిత ధరలు అమలయ్యేలా చూడటం, లభ్యత- అందుబాటుకు భరోసా ఇవ్వడం కూడా ఎన్.పి.పి.ఎ. విధులు.
***
(Release ID: 1649858)
Visitor Counter : 219