సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్థానిక ఉత్పత్తికి పెద్ద ప్రోత్సాహం; 1200 క్వింటాళ్ళ ఆవ నూనె కోసం ఐటిబిపి నుంచి కెవిఐసికి తొలి కొనుగోలు ఉత్తర్వు
Posted On:
28 AUG 2020 3:42PM by PIB Hyderabad
ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) 1200 క్వింటాళ్ళ కచ్చి ఘని (శీతల పీడనంతో వెలికి తీసే) ఆవ నూనె కోసం ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటిబిపి) నుంచి తొలి కొనుగోలు ఉత్తర్వును స్వీకరించింది. దాని విలువ రూ. 1.73 కోట్లు. జూలై 31న కెవిఐసి, ఐటిబిపి అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది వారాల్లోనే ఈ కొనుగోలు నిర్దేశం వచ్చింది. ప్రధాన మంత్రి ‘‘స్వయం సమృద్ధ భారతం’’, ‘‘స్థానికం కోసం స్వరం (వోకల్ ఫర్ లోకల్)’’ పిలుపునకు అనుగుణంగా ఈ ఒప్పందం జరిగింది. కొనుగోలు ఉత్తర్వు వచ్చిన తేదీ నుంచి 30 రోజుల లోపల ఐటిబిపికి ఉత్పత్తిని సరఫరా చేస్తామని కెవిఐసి ఒక ప్రకటనలో తెలిపింది.
ఎంఎస్ఎంఇ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కెవిఐసి ప్రయత్నాలను ప్రశంసించారు. ఇది స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని, గ్రామీణ పరిశ్రమలపై ఆధారపడిన లక్షల మందికి సాధికారతను చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కొనుగోలు ఉత్తర్వు... అధిక నాణ్యతతో కచ్చి ఘని ఆవ నూనెను ఉత్పత్తి చేసే ఖాదీ సంస్థలలో అదనపు ఉద్యోగాలను సృష్టిస్తుందని కెవిఐసి తెలిపింది. నిర్దేశిత గడువు 30 రోజులలో సరఫరాను పూర్తి చేయడానికి 3 షిప్టులలో పని చేయవలసిందిగా ఖాదీ సంస్థలను కెవిఐసి ఆదేశించింది. ఈ కొనుగోలు నిర్దేశం ఖాదీ శ్రామికులకు లక్షలాది అదనపు పని గంటలను కల్పిస్తుందని, తద్వారా స్థానిక ఉత్పత్తికి ప్రోత్సాహమిస్తుందని కెవిఐసి పేర్కొంది.
‘‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’’కు మద్ధతు ఇచ్చేందుకు గాను స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పారా మిలిటరీ దళాలను ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సిఎపిఎఫ్ క్యాంటీన్లలో ‘‘స్వదేశీ’’ ఉత్పత్తులను మాత్రమే అమ్మడాన్ని శ్రీ అమిత్ షా తప్పనిసరి చేసినట్లు కెవిఐసి తెలిపింది.
అన్ని పారా మిలిటరీ దళాల తరపున సరుకులు సేకరించడం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించిన నోడల్ ఏజెన్సీ ఐటిబిపి.
ఈ కొనుగోలు ఉత్తర్వును కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా స్వాగతించారు. మన గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేసి స్థానిక చేతి వృత్తుల వారికి సాధికారత కల్పించే దిశగా పడిన పెద్ద ముందడుగుగా ఈ పరిణామాన్ని ఆయన అభివర్ణించారు. ‘‘స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించి మన గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మన ప్రజల ఆర్థిక ఇబ్బందులను తొలగించి వారి కోసం సుస్థిరమైన జీవనోపాదిని సృష్టించగలం. అదే సమయంలో సరిహద్దులలో ఉన్న మన జవాన్లు ఉత్తమ నాణ్యతతో కూడిన ఆవ నూనెను పొందుతారు. గడువు కంటే ముందే సరఫరా జరిగేలా మేము చూస్తాము’’ అని సక్సేనా చెప్పారు.
ఏడాది కాలానికి గాను ఒక అవగాహనా ఒప్పందం (ఎంఒయు)పై కెవిఐసి, ఐటిబిపి సంతకాలు చేశాయి. అది తర్వాత పొడిగింపబడుతుంది. సరఫరాకు సిద్ధమవుతున్న తర్వాతి ఉత్పత్తులలో ఖాదీ చాపలు (డారి), దుప్పట్లు, పరుపు షీట్లు, దిండు కవర్లు, పచ్చళ్లు, తేనె, అప్పడాలు, సౌందర్య సాధనాలు తదితరాలు ఉన్నాయి. నూనె, డారి మొత్తం విలువ సుమారు రూ. 18 కోట్లు ఉంటుంది.
******
(Release ID: 1649332)
Visitor Counter : 187