గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వీధి వ్యాపారుల జీవనోపాధి సంపూర్ణ రక్షణలో పోలీసులు, మున్సిపాలిటీల పాత్రే కీలకం: హరదీప్ సింగ్ పూరి

వీధి వ్యాపారుల పథకాలను విజయవంతం చేయడంలో

నిర్మాణాత్మక పాత్ర పోషించాలని అధికారులకు కేంద్రమంత్రి పిలుపు

Posted On: 18 AUG 2020 6:38PM by PIB Hyderabad

వీధి వ్యాపారుల సహాయార్థం ప్రవేశపెట్టిన పి.ఎం. స్వాన్ నిధి  సూక్ష్మ రుణ సదుపాయ పథకం అమలుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ (ఇన్ చార్జి) మంత్రి హరదీప్ సింగ్ పూరి రోజు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, డి.జి.పి.లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, జల్లాల మెజిస్ట్రేట్లు, ఇతర భాగస్వామ్య అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్చువల్ సమావేశంగా జరిగిన సమీక్షలో, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, దేశవ్యాప్తంగా ఉన్నసీనియర్ అధికారులు పాల్గొన్నారు సందర్భంగా హరదీప్ సింగ్ పూరి మాట్లాడుతూ,..వీధి వ్యాపారుల సమస్యల గురించి కింది స్థాయి సిబ్బందికి తెలియజెప్పాలన్నారు. రోజుకు ఆరోజు అన్నట్టుగా జీవనం గడుపుకునే చిన్న స్థాయి వీధి వ్యాపారులపై ఉదారంగా వ్యవహరించాలని, వారిని లంచం అడగడం, లేదా వేధింపులకు గురిచేయడం కిరాతకమని అన్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వీధి వ్యాపారులు వడ్డీ వ్యాపారుల అసాధారమైన వడ్డీ రేట్ల కారణంగా ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నారని, ఆర్థికంగా ఆదుకుంటుందనుకున్నప్రభుత్వం నుంచి చిన్న వేధింపు ఎదురైనా అది వారిని పరిహాసం చేసినట్టే అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.

  పి.ఎం. స్వనిధి పథకం ప్రవేశపెట్టడంతోనే వీధి వ్యాపారులకు రుణాల విష వలయంనుంచి విముక్తి కలిగించే గట్టి ప్రయత్నం మొదలైందని కేంద్రమంత్రి అన్నారు. పి.ఎం. స్వనిధి లబ్ధిదారుల సామాజిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకునే  ఒక ప్రక్రియను తమ మంత్రిత్వ శాఖ చేపట్టిందనిఅర్హతల ప్రాతిపదికగా వివిధ సంక్షేమ పథకాలతో వారిని అనుసంధానం చేసేందుకు ప్రక్రియ మొదలైందని అన్నారు. మామూలు రోజుల్లోనే వీధి వ్యాపారులు తమ మనుగడకోసం పాట్లు పడేవారని, కోవిడ్-19 మహమ్మారి దాడితో వారి పరిస్థితి మరింత గడ్డుగా మారిందని, వారి జీవనోపాధికి కూడా తీవ్రమైన ముప్పు ఏర్పడిందని అన్నారు. తమకు వేధింపులనుంచి, ఇతర కష్టాలనుంచి రక్షణ లభిస్తుందన్న భావనను వీధి వ్యాపారులకు కల్పించవలసిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. వీధి వ్యాపారుల సహాయ పథకం విజయంవంతం అయ్యేలా సంబంధిత అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయవలసి ఉంటుందన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధిని సంపూర్ణంగా రక్షించడంలో పోలీసు బలగాలకు, మున్సిపాలిటీలకు కీలక పాత్ర ఉందని, వారికి సానుకూల వాతావరణం కల్పించవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఎలాంటి వేధింపులకు తావులేకుండా తమ సరకులను విక్రయించుకునేందుకు ఒక చోటును తప్ప వారు మరేమీ కోరుకోరని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ జనాభాలో వీధి వ్యాపారుల జనాభా 2శాతం ఉంటుందని, ఆర్థిక పరిస్థితి ఎదుగుదలకు వారు పరోక్షంగా దోహదపడతారని కేంద్రమంత్రి అన్నారు.

  వీధి వ్యాపారులనుంచి ఇప్పటివరకూ 5లక్షలా 70వేలకు పైగా దరఖాస్తులు అందాయని, వాటిలో లక్షా 35వేలకు పైగా దరఖాస్తులకు రుణాలు మంజూరయ్యాయని, 37 వేలమంది దరఖాస్తుదారులకు రుణాల పంపిణీ జరిగిందని మంత్రి చెప్పారు. పథకాన్ని కేవలం వీధి వ్యాపారులకు రుణాలిచ్చే కార్యక్రమంగా మాత్రమే పరిగణించకుండా, వారి సమగ్ర అభివృద్ధికి, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి చేపట్టే కార్యక్రమంగా భావించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,.. దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ పట్టణ జీవనోపాధుల కార్యక్రమం అమలు చేస్తోందని, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో చిన్నపాటి వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పథకం చేపట్టారని మంత్రి చెప్పారు పట్టణ వీధి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం ద్వారానే పథకం అమలవుతోందన్నారు. పట్టణ వీధి వ్యాపారాల నియంత్రణ, వ్యాపారుల జీవనోపాధికి, హక్కులకు రక్షణ, వారికి సామాజిక భద్రత లక్ష్యంగా 2014 సంవత్సరపు వీధి వ్యాపారుల చట్టం అమలులోకి వచ్చిందని చెప్పారు

  కోవిడ్19 మహమ్మారి వ్యాప్తితో విధించిన లాక్ డౌన్ కారణంగా, వీధి వ్యాపారుల జీవితాలు, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారికి సూక్ష్మ రుణం రూపంలో తగిన పెట్టుబడి సహాయం అందించేందుకు పి.ఎం.స్వనిధి పథకాన్ని 2020 సంవత్సరం జూన్ 1 ప్రభుత్వం ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. పథకం కింద, ఎలాంటి కొలాటరల్ పూచీ లేకుండానే వీధి వ్యాపారులకు ఏడాది గడువుతో 10వేల రూపాయలవరకూ రుణం అందిస్తారని చెప్పారు. ‘సూక్ష్మ ఔత్సాహిక వ్యాపారులుగా చెప్పదగిన వీధి వ్యాపారుల ముంగిటికి బ్యాంకులను తీసుకువచ్చేందుకు పథకాన్ని రూపొందించారని, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు అదనంగా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, స్వయం సహాయక బృందాలు, సూక్ష్మ రుణ సంస్థలు కూడా రుణాలందించేలా పథకం రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి చెప్పారు. వీధి వ్యాపారులు డిజిటల్ వేదికల ద్వారా చెల్లింపులు జరిపేందుకు అవకాశమిస్తూ, వారిని పట్టణ ఆర్థిక వ్యవస్థలో అంతర్గత భాగంగా తీర్చిదిద్దేందుకు పథకాన్ని రూపొందించారని అన్నారు

   వీధి వ్యాపారులకు విస్తృతంగా రుణాలిచ్చేలా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలను రుణ హామీ నిధి ట్రస్టు ద్వారా ప్రోత్సహించేందుకు పథకంలో చర్యలు తీసుకున్నట్టు మంత్రి పూరి చెప్పారు. వీధి వ్యాపారులు రుణం కోసం,.. పి.ఎం.స్వనిధి పోర్టల్ ద్వారాగానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ  దరఖాస్తులు సమర్పించవచ్చని మంత్రి తెలిపారు.

***

 



(Release ID: 1646826) Visitor Counter : 267