కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వ్యూహాత్మక మరియు సరిహద్దు ప్రాంతాలలో ఉన్న 498 గ్రామాలకు ప్రభుత్వం మొబైల్ అనుసంధాన సౌకర్యం కల్పించనుంది - శ్రీ రవి శంకర్ ప్రసాద్.

సైన్యం; బి.ఆర్.‌ఓ; బి.ఎస్.‌ఎఫ్; సి.ఆర్.‌పి.ఎఫ్; ఐ.టి.బి.పి; ఎస్.‌ఎస్.‌బి. మొదలైన వాటి కోసం 1,347 ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత డి.ఎస్.‌పి.టి. లను కూడా అందిస్తున్నారు.

68 ఆశాజనక జిల్లాల్లో టెలిఫోను సౌకర్యాలేని గ్రామాలలో కూడా డి.ఓ.టి. అనుసంధానతను సమకూర్చనుంది.

Posted On: 10 AUG 2020 4:36PM by PIB Hyderabad

వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న సుదూర ప్రాంతాలు, కష్టతరమైన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలలో పనిచేస్తున్న వారితో పాటు, అక్కడ నివసించే సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలానే ఉద్దేశ్యంతో ఆయా ప్రాంతాల్లో టెలిఫోన్ అనుసంధానతను సమకూర్చడానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యతపై చర్యలు తీసుకుంటోందని, కేంద్ర ఎలక్ట్రానిక్సు, ఐ.టి, కమ్యూనికేషన్సు, చట్టం, న్యాయ శాఖల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ తెలియజేసారు.  

చెన్నై, అండమాన్ నికోబార్ మధ్య 1,224 కోట్ల రూపాయల వ్యయంతో 2,300 కిలోమీటర్ల పొడవు గల జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభోత్సవం చేసిన అనంతరం, శ్రీ రవి శంకర్ ప్రసాద్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. 

మారుమూల మరియు క్లిష్ట ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడానికి టెలికమ్యూనికేషన్సు విభాగం అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టుల గురించి శ్రీ ప్రసాద్ వివరించారు.  దేశంలోని వ్యూహాత్మక, మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లో టెలిఫోన్ అనుసంధానం లేని 354 గ్రామాలకు టెండర్ ఖరారు చేసినట్లు శ్రీ ప్రసాద్ తెలియజేశారు.  అదేవిధంగా, జమ్మూ కశ్మీర్ మరియు లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు,  బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని 144 గ్రామాలలోనూ,  గుజరాత్ లోని ఇతర ప్రాధాన్యతా ప్రాంతాలలోనూ  ఇది అమలులో ఉందని ఆయన చెప్పారు. సరిహద్దు ప్రాంతాలను మొబైల్ సేవలతో అనుసంధానం చేయడం కోసం ఈ గ్రామాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ గ్రామాలలో పని పూర్తయిన తరువాత, జమ్మూ, కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు మొబైల్ అనుసంధానత కల్పించినట్లౌతుంది.  సైన్యం; బి.ఆర్.ఓ; బి.ఎస్.ఎఫ్; సి.ఆర్.పి.ఎఫ్; ఐ.టి.బి.పి; ఎస్.ఎస్.బి; మొదలైన వాటి కోసం 1,347 ప్రాంతాలలో ఉపగ్రహ ఆధారిత డి.ఎస్.పి.టి. లు (డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్) కూడా అందించబడుతున్నాయి.  వీటిలో 183 ప్రాంతాల్లో ఇప్పటికే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని 24 ఆశాజనక జిల్లాలకు చెందిన గ్రామాల్లో మొబైల్ అనుసంధాన సేవలు అందించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం కూడా కృషి చేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. అదేవిధంగా, ఛతీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మిగిలిన 44 ఆశాజనక జిల్లాలలో ఈ సౌకర్యంలేని 7,287 గ్రామాలకు కూడా ఈ సేవలు విస్తరింపజేయడానికి ప్రభుత్వ ఆమోదంకోసం  దరఖాస్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.  

 

*****



(Release ID: 1644883) Visitor Counter : 187