పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రయాణికుల రాక కోసం పోర్టల్ అభివృద్ధి చేసిన ఢిల్లీ విమానాశ్రయం
భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు కాంటాక్ట్ లెస్ సొల్యూషన్ తో అంతర్జాతీయ ప్రయాణ విధానాలు సరళం
Posted On:
07 AUG 2020 3:34PM by PIB Hyderabad
భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం జిఎంఆర్ గ్రూప్ సారథ్యంలోని కన్సార్షియం ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (డిఐఎఎల్) ఒక ప్రత్యేక పోర్టల్ ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికులు కేవలం ఒక సెల్ఫ్ డిక్లరేషన్ నింపి ఆన్ లైన్ లోనే తప్పనిసరి క్వారంటైన్ ప్రక్రియ నుంచి మినహాయింపు పొందవచ్చు. పౌర విమానయాన శాఖ; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ; విదేశాంగ మంత్రిత్వ శాఖ; ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి ఈ ఆన్ లైన్ ఫారంలు అభివృద్ధి చేశారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 8వ తేదీ నుంచి దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఈ సదుపాయం అందుబాటులోకి తేవడం వల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులెవరూ ఫారంలను భౌతికంగా నింపాల్సిన అవసరం ఉండదు. కాంటాక్ట్ లెస్ గా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రయాణాలన్నింటికీ హబ్ గా కొనసాగుతుంది. భారతదేశం పలు దేశాలతో ఎయిర్ బబుల్ ఏర్పాటు చేసుకున్నందు వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు పెరిగే ఆస్కారం ఉంది. అలాంటి వారందరికీ ఈ కొత్త ఆన్ లైన్ సెల్ఫ్ డిక్లరేషన్, క్వారంటైన్ మినహాయింపు పోర్టల్ సహాయంతో ప్రభుత్వ అధికారులు అంతర్జాతీయ ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించి తాజా సమాచారం ఆధారంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఐదు ప్రత్యేక వర్గీకరణల్లోకి వచ్చే ప్రయాణికులు ఈ మినహాయింపును కోరేందుకు ఢిల్లీ విమానాశ్రయం వెబ్ సైట్ “www.newdelhiairport.in” లో ఉన్న ఇ-ఫారం నింపాల్సి ఉంటుంది. పాస్ పోర్టు కాపీతో పాటు అవసరమైన పత్రాలన్నింటినీ జత చేసి విమానం ఎక్కడానికి 72 గంటల ముందే ఈ దరఖాస్తు పంపాలి. అయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం నింపే ప్రయాణికులకు ఇలాంటి కాలపరిమితి ఏదీ లేదు.
ఈ ఆన్ లైన్ పోర్టల్ లో తొలిసారిగా ఇచ్చిన సమాచారాన్ని ఆ దరఖాస్తు నంబర్ ఉపయోగించుకుని తదుపరి దరఖాస్తుల్లో కూడా ఆటో ఫిల్ చేసే సదుపాయం ఉన్నందు వల్ల ప్రతీసారీ ఆ సమాచారం అంతా విభిన్న శాఖల అధికారులకు అందించే ఇబ్బంది ఉండదు. ఏ విమానాశ్రయానికి విమానం మొదట చేరుతుందనే అంశాన్ని బట్టి ఆయా రాష్ట్రప్రభుత్వాల ద్వారా ఈ దరఖాస్తులన్నీ ఆటోమేటిక్ గా సంబంధిత అధికారులకు చేరతాయి. సెల్ఫ్ డిక్లరేషన్ దరఖాస్తులు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేస్తున్న ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషణ్ కు (ఎపిహెచ్ఓ) చేరతాయి.
దరఖాస్తులు పరిశీలించిన అనంతరం వాటిని ఆమోదించింది, లేనిది తెలియచేస్తూ అందుకు కారణాలు కూడా ఉదహరిస్తూ ప్రయాణికులకు ఇ మెయిల్ పంపుతారు. సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయింపు లభించిన వారు అందుకు సంబంధించిన అనుమతులను ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే ఎయిర్ పోర్ట్ ట్రాన్స్ ఫర్ ఏరియాలో అధికారులకు చూపించి ఎలాంటి అవరోధాలు లేకుండా బయటకు వెళ్లవచ్చు. ఈ విధానం విమాన ప్రయాణికులకే కాకుండా అధికారులు కూడా అవసరమైన లాంఛనాలు సత్వరం పూర్తి చేసేందుకు సహాయకారిగా ఉంటుంది. విమానాశ్రయాల వద్ద రద్దీ తగ్గించే అవకాశం కలుగుతుంది.
గర్భిణీలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్యాలతో బాధ పడుతున్న వారు (అందుకు సంబంధించిన వివరాలు అందించాల్సి ఉంటుంది), 10 సంవత్సరాల లోపు పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులు, ఇటీవల ఆర్ టి-పిసిఆర్ పరీక్షలో కోవిడ్-19 నెగెటివ్ గా నిర్ధారణ అయిన వారు, ఈ 5 వర్గీకరణల్లోకి వచ్చే వారికి మాత్రమే ఈ మినహాయింపు పొందే అర్హత ఉంటుంది. రిజర్వేషన్ సమయంలో విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకరు ఈ విషయం తెలియచేసి వారు ఏ గమ్యానికి వెళ్తున్నారో ఆ రాష్ట్రప్రభుత్వ అధికారులకు సంస్థాగత క్వారంటైన్ నుంచి వారికి మినహాయింపు కల్పించే అధికారం ఇవ్వవచ్చు.
"కోవిడ్-19 ఢిల్లీ విమానాశ్రయం నిర్వహణ విధానాన్నే మార్చి వేసింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యమే మా కార్యకలాపాలకు ప్రధానం. ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వదేశానికి తిరిగి వచ్చేందుకు వేచి చూస్తున్న ప్రయాణికుల కోసం కేంద్రప్రభుత్వంతో కలిసి ఢిల్లీ విమానాశ్రయం ఈ చొరవ తీసుకుంది. ముందస్తుగానే అందుకున్న మినహాయింపు అనుమతి వల్ల క్వారంటైన్ ప్రక్రియ సరళం కావడంతో పాటు క్వారంటైన్ ప్రాసెస్ కోసం వేచి ఉండడంలో జరుగుతున్న జాప్యాన్ని కూడా నివారించవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు రెండు సార్లు నింపాల్సిన ఇబ్బంది కూడా తప్పుతుంది" అని డిఐఏఎల్ సిఇఓఎ విదేహ్ కుమార్ జైపురియార్ అన్నారు.
"కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణికులను దేశానికి తిరిగి తీసుకువచ్చే కృషి ప్రారంభమయింది. పరిమితంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విమానాల్లో పలు కారణాల వల్ల ప్రయాణానికి వేచి ఉన్నారు. డిజిటైజేషన్ సహాయంతో సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం తీసుకున్న ఈ చొరవ ప్రశంసనీయం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం రూపొందించిన ఈ ఇ-ప్లాట్ ఫారం దేశంలోని అన్ని విమానాశ్రయాలకు కూడా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ సరళం కావడానికి రాష్ట్రప్రభుత్వాలు/ ఆరోగ్య శాఖ అధికారులకు ఉపయోగపడుతుంది. భారతీయ విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు మరింతగా పెంచడానికి కూడా ఇది మరింత అవకాశం కల్పిస్తుంది" అని పౌర విమానయాన శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఉషా పధి అన్నారు.
ప్రభుత్వ నిర్దేశకత్వం ప్రకారం అంతర్జాతీయ విమానాల్లో దేశానికి వచ్చిన ప్రయాణికులందరూ తప్పనిసరిగా 7 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ లో, ఆ తర్వాత 7 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. అలాగే ఎపిహెచ్ఓ ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావడం కూడా తప్పనిసరి. ఈ సమయంలో అత్యంత విశ్వసనీయంగా ఉండే మాస్ స్క్రీనింగ్ కెమెరాలతో టెంపరేచర్ స్క్రీనింగ్ చేస్తారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి...
జిఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ జిఎంఆర్ గ్రూప్, భారత ఎయిర్ పోర్టుల అధారిటీ, ఫ్రాపోర్ట్ ల భాగస్వామ్యంతో కూడిన కన్సార్షియం. ఢిల్లీ విమానాశ్రయం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు దాని డిజైనింగ్ రూపొందించి నిర్మించి 30 సంవత్సరాల పాటు నిర్వహించడం ఈ కన్సార్షియం బాధ్యత. ఆ తర్వాత మరో 30 సంవత్సరాలు ఆ ఒప్పందం పొడిగించే అవకాశం కూడా అందులో అంతర్గతంగా ఉంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి (పిపిపి) చక్కని ఉదాహరణ ఇది. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ (ఎసిఐ) ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రాం కింద 2019లో ఢిల్లీ విమానాశ్రయం పరిమాణంలోను, ప్రాంతీయంగాను (ఆసియా 40 ఎంపిపిఏ పైబడి) అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తించింది. ఢిల్లీ ఐజిఐ విమానాశ్రయాన్ని ఆధునీకరించడంతో పాటు మూడో టెర్మినల్ ను (టి3) 37 నెలల రికార్డు కాలపరిమితిలో ప్రారంభించింది.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ నిర్వహణలోని ప్రయాణికుల టెర్మినల్స్ అత్యాధునిక మౌలిక వసతులు, డిజైన్, నిర్వహణా సామర్థ్యాల్లో కూడా ఉత్తమమైనవిగా గుర్తించారు. టి3 ద్వారా పలు విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. భారతీయ ప్రయాణికుల ప్రయాణాన్ని పూర్తిగా పునర్నిర్వచించింది. 2018 సంవత్సరంలో 69.8 ఎంపిపిఏతో వస్తు రవాణా సామర్థ్యంలోను, ప్రయాణికుల రాకపోకల్లోను భారత విమానాశ్రయాల్లోనే ఢిల్లీ విమానాశ్రయం అగ్రస్థానంలో ఉంది. సుస్థిరమైన హరిత టెక్నాలజీలకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. స్థిరమైన హరిత టెక్నాలజీల వినియోగంలో పలు అవార్డులు కూడా అందుకుంది. మరిన్ని వివరాలకు http://www.newdelhiairport.in సందర్శించండి.
****
(Release ID: 1644362)
Visitor Counter : 238