సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి వ్యవసాయ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించవలసిన అవసరం ఉంది : శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 23 JUL 2020 9:24PM by PIB Hyderabad

ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి వీలుగా, రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.‌పి.సి) ఉత్పత్తి చేసే ఉత్పత్తుల ను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించవలసిన అవసరం ఉందని, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు అభిప్రాయపడ్డారు.   "వ్యవసాయ ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగంలో క్లస్టర్ల అభివృద్ధి"  అనే అంశంపై నాగ్‌పూర్ నుంచి నిర్వహించిన వెబినార్ ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వికాస్ మహాత్మే, నాగపూర్ లోని ఎం.ఎస్.ఎం.ఈ. అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పర్లేవార్ పాల్గొన్నారు.  

ఉత్పత్తిని పెంచేటప్పుడు, అదే సమయంలో, ఉత్పత్తి వ్యయంతో పాటు రవాణా, కార్మిక వ్యయాలను ఎలా తగ్గించాలో దృష్టి సారించాలని వెబి‌నార్‌కు హాజరైన అమరావతి జిల్లాలోని ఎఫ్.‌పి.సి.  ప్రతినిధులకు శ్రీ గడ్కరీ విజ్ఞప్తి చేశారు.  నాణ్యతతో రాజీ పడకుండా దేశీయ మార్కెట్లో ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని కూడా ఆయన చెప్పారు.  ఆ తరువాత, మిగిలిన ఉత్పత్తులను దేశం వెలుపల ఎగుమతి చేయాలని ఆయన సూచించారు.  

రైతులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ప్రాసెసింగ్‌లో పరిశ్రమలు ఖర్చు తగ్గించడం వంటివి పరిశ్రమకు ప్రయోజనకరంగా ఉంటాయని కూడా శ్రీ గడ్కరీ సూచించారు.  పప్పుధాన్యాల మిల్లు క్లస్టర్ కలిగి ఉన్న రైతు-ఉత్పత్తిదారుల సంస్థ - సౌర విద్యుత్తు పైకప్పు బల్లలను ఉపయోగించడం, రైలు ద్వారా సరుకు రవాణా చేయడం, డ్రై పోర్టును ఉపయోగించడం వంటి చర్యల ద్వారా ఉత్పత్తి మరియు రవాణా ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుందని, ఆయన వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందులకు బదులు, వ్యవసాయ వ్యర్థాల నుండి తయారయ్యే సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని కూడా ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు.

విదర్భలోని ప్రతి జిల్లాలో సహజ వనరులు అందుబాటులో ఉన్నాయి.  వీటిని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల (కె.వి.ఐ.సి) శాఖ ఉపయోగించుకుంటుంది. ఈ శాఖ అటువంటి రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు జిల్లా వారీగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.  రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు చంద్రపూర్ లో లభించే తేనే, సిల్కు ల నుండి ఉత్పత్తులు తయారు చేయవచ్చు, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలకు చెందిన వెదురు తోటలలో అగరబత్తిల కోసం క్లస్టర్‌ వంటివి ఏర్పాటు చేయవచ్చునని కూడా ఆయన సూచించారు.  వ్యవసాయ శాఖకు చెందిన  ‘ఎక్విప్‌మెంట్ బ్యాంకు’ పథకం గురించి కూడా శ్రీ గడ్కరీ తెలియజేశారు.   ఈ పథకం కింద, రైతులు మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు చెందిన బృందం పరికరాలను కొనుగోలు చేయవచ్చు, ఆ తర్వాత వాటిని అద్దె ప్రాతిపదికన వారిలో వారే ఉపయోగించుకోవచ్చు. 

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని 20,000 మంది రైతులు, 55 రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు.   ఈ సంస్థలు టాటా ఇంటర్నేషనల్ మరియు వాల్ మార్టు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  విదర్భ ప్రాంతంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థల కోసం ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను (సి.ఎఫ్.సి.లు) ఏర్పాటు చేస్తున్నట్లు, నాగపూర్ ‌లోని ఎం.ఎస్.‌ఎం.ఈ. అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పర్లేవార్ తెలియజేశారు.

ఆరెంజ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరియు ఇతర ప్రశ్నలకు సంబంధించి రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నితిన్ గడ్కరీ వెబినార్ చివరిలో సమాధానమిచ్చారు.  వ్యవసాయ శాఖ, ఎం.ఎస్.‌ఎం.ఈ. ల ద్వారా ఇటువంటి ఎఫ్.‌పి.సి. లకు అందుబాటులో ఉన్న పథకాల గురించి వివరించడానికి,  నాగ్‌పూర్ ‌లో లాక్‌డౌన్ కాలం ముగిసిన తరువాత మార్గదర్శక సమావేశం నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.  విదర్భకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు, టాటా ఇంటర్నేషనల్ సంస్థ అధికారులు కూడా  ఈ వెబినార్ లో పాల్గొన్నారు.

*****



(Release ID: 1640817) Visitor Counter : 171