కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల జాబితా: నమోదు చేసుకునే వారిసంఖ్య పెరుగుదల

2020 మేనెలలో నిఖరంగా 3.18 లక్షల చందాదారుల నమోదు

ఏప్రిల్ నెలలో లక్షమంది మాత్రమే నమోదు

ఈపీఎఫ్ఓలో,.. మేలో రిజిస్టర్ చేసుకున్న కొత్త సంస్థల సంఖ్య 8,367

ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే రిజిస్టరైన సంస్థలు 72శాతం పెరుగుదల

Posted On: 22 JUL 2020 4:53PM by PIB Hyderabad

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో నమోదు చేసుకున్న ఉద్యోగుల తాజా జాబితాపై సమాచారాన్ని ఈపీఎఫ్ఓ 2020 జూలై 20 విడుదల చేసింది.  2020 మే నెలలో కొత్తగా నమోదు చేసుకున్న సంస్థల సంఖ్య పెరిగిందని జాబితాను బట్టి తెలుస్తోంది. 2020 మే నెలలో చందాదారుల నిఖర సంఖ్య ఏకంగా 3.18 లక్షలు పెరిగింది. నెలవారీ సమాచారం చూస్తే పెరుగుదల 218శాతం మేర భారీ స్థాయిలో నమోదైంది. కోవిడ్ సంక్షోభంతో లాక్ డౌన్ ఎదురైనప్పటికీ, ఈపీఎఫ్ఓకు చెందిన సామాజిక భద్రతా పథకాల్లో నిఖరంగా చేరిన కొత్త చందాదార్ల సంఖ్య లక్షకు చేరింది. కొత్తగా మే నెలలో చేరిన చందాదారుల సంఖ్యను, వారినుంచి అందిన మొత్తాన్ని తాజాగా విడుదలైన సమాచారంలో వెల్లడించారు.

  కొత్తగా చేరే చందాదార్ల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరగడం, సభ్యత్వం వదలి వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉండటం, తిరిగి చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం..తదితర కారణాలవల్ల చందాదార్ల వృద్ధి రేటు బాగుంది. ఏప్రిల్ లో 1.67 లక్షలమేర ఉన్న కొత్త చందాదార్ల సంఖ్య ఏకంగా 66శాతం పెరిగి, మే నెలలో 2.79లక్షలకు చేరింది. దీనికి తోడు ఈపీఎఫ్ఓనుంచి బయటకు వెళ్లే చందాదార్లు దాదాపు 20శాతం తగ్గారు. ఈపీఎఫ్ఓను వదలి వెళ్లేవారి సంఖ్య గత ఏప్రిల్ నెలలో 2.97లక్షలు ఉండగా, మే నెలలో 2.36లక్షలు మాత్రమే ఉంది.

  ఈపీఎఫ్ఓనుంచి సభ్యులు బయటకు వెళ్లి మళ్ళీ తిరిగి చేరడం,..అంటే ఈపీఎఫ్ఓ పరిధిలోనే చందాదార్లు  తమతమ ఉద్యోగాలు మార్చుకున్నారని అర్థం. ఏప్రిల్ నెలతో పోల్చితే మే నెలలో ఇలా మారిన వారి సంఖ్య దాదాపుగా 19శాతం పెరిగింది. తమ ఖాతాలను పూర్తిగా మూసివేసుకోవడం కంటే,..నిధులను బదిలీ చేసుకోవడం ద్వారా సభ్యత్వాన్ని తిరిగి దక్కించుకోవడానికే చాలా మంది చందాదారులు  ప్రాధాన్యం ఇచ్చారు.

  వివిధ వర్గాలవారీగా పరిశ్రమలను, సంస్థలను విశ్లేషించినపుడు కోవిడ్ వైరస్ మహమ్మారి కారణంగా  2020 ఏప్రిల్ నెలలో నిర్మాణ రంగం, రవాణా, విద్యుత్, యాంత్రిక, జనరల్ ఇంజినీరింగ్ ఉత్పత్తులు, విద్యా, జవుళి ఉత్పత్తి తీవ్రంగా తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. వీటిలో మెజారిటీ రంగాల్లో ఏప్రిల్ నెలలో ఈపీఎఫ్ఓ నమోదు స్థితి చాలా ప్రతికూలంగా ఉంది. కోవిడ్-19 వ్యాప్తికి ముందు ప్రతినెలా దాదాపు 4లక్షల మంది చొప్పున చందాదారులు నైపుణ్య సేవల పరిశ్రమలో నమోదు కాగా, ఏప్రిల్ నెలలో మాత్రం కేవలం 80వేల మంది మాత్రమే నమోదయ్యారు. నైపుణ్య సేవల రంగంలో మానవ వనరుల ఏజెన్సీలు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

    అయితే, ఒక్క విద్యా రంగం మినహా మిగిలిన రంగాలన్నీ 2020 మే నెలలో సానుకూల వృద్ధిని కనబరిచాయి. పాఠశాలలు, కళాశాలలు ఇంకా లాక్ డౌన్ ప్రభావంలోనే ఉండటంతో విద్యారంగంలో మాత్రం ఎలాంటి వృద్ధీ కనిపించడంలేదు. నైపుణ్య సేవల రంగంనుంచి 2020 మే నెలలో నిఖరంగా 1.8లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్ఓలో చేరారు. అంటే సేవల రంగం నెలవారీగా ఏకంగా 125శాతం వృద్ధిని నమోదు చేసింది.

  ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న కొత్త సంస్థల వృద్ధి దాదాపు 72శాతంగా నమోదైంది. మే నెలలో నమోదు చేసుకున్న కొత్త సంస్థల సంఖ్య 8,367 కాగా,. 2020 ఏప్రిల్ లో నమోదు చేసుకున్న సంస్థల సంఖ్య 4,853 మాత్రమే. అలాగే,..ఉద్యోగుల జాబితా సమాచారం ప్రకారం ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులసంఖ్య ఏప్రిల్ తో పోల్చుకుంటే మే నెలలో దాదాపు 98శాతం పెరిగింది.

  దేశంలోని సంస్ధాగతమైన, అర్థ సంస్థాగతమైన రంగాల్లో పనిచేసే కార్మికుల, ఉద్యోగుల సామాజిక భద్రతా నిధుల నిర్వహణను ఈపీఎఫ్ఓ పర్యవేస్తుంది. ఈపీఎఫ్ఓలో ఆరు కోట్ల మందికిపైగా క్రియాశీలక సభ్యులు ఉన్నారు. తాజాగా ఈపీఎఫ్ఓ విడుదల చేసిన ఉద్యోగుల జాబితా తాత్కాలికమైనది. ఎందుకంటే, నమోదైన ఉద్యోగుల రికార్డులకు సంబంధించిన నవీకరణ ప్రక్రియ రాబోయే నెలలలో తాజా సమాచారంతో ఎప్పకప్పుడు కొనసాగుతూనే ఉంటుంది.

*****



(Release ID: 1640486) Visitor Counter : 176