బొగ్గు మంత్రిత్వ శాఖ

"వృక్షారోపణ్‌ అభియాన్‌"ను గురువారం ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి

మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీగా చేపట్టనున్న బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బొగ్గు/లిగ్నైట్‌ పీఎస్‌యూలు

Posted On: 22 JUL 2020 4:47PM by PIB Hyderabad

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా, బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ జోషి కలిసి
వృక్షారోపణ్‌ అభియాన్‌ను ప్రారంభించనున్నారు. గురువారం దిల్లీలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్బంగా, ఆరు ఎకో పార్కులు/పర్యాటక ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. 10 రాష్ట్రాల్లో విస్తరించిన, 38 బొగ్గు/లిగ్నైట్‌ జిల్లాల్లోని 130 ప్రాంతాల్లోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది.

    బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని బొగ్గు/లిగ్నైట్‌ పీఎస్‌యూలు, వృక్షారోపణ్‌ అభియాన్‌లో గురువారం  పాల్గొంటాయి. గనులు, కాలనీలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతాయి. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సమీప నివాస ప్రాంతాల్లోని ప్రజలకు విత్తనాలను పంపిణీ చేస్తాయి.

    ఎకో పార్కులు/పర్యాటక ప్రాంతాల్లో.., ఉల్లాసం, సాహసం, జల క్రీడలు, పక్షుల పరిశీలన వంటి ఏర్పాట్లు ఉంటాయి. వీటిని పర్యాటక సర్క్యూట్‌లో విలీనం చేయవచ్చు. ఈ ప్రాంతాల ద్వారా స్థానిక ప్రజలకు స్వయం ఉపాధి ఆదాయం, ఉద్యోగ కల్పన కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

    గనులు, డంపులు, చుట్టుపక్కల, అనువైన ప్రాంతాల్లో మొక్కల పెంపకంతో పర్యావరణాన్ని పునరుద్ధరించడం ద్వారా "గోయింగ్‌ గ్రీన్‌" చేపట్టడం బొగ్గు రంగంలో కీలకం. బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన "గోయింగ్ గ్రీన్" కార్యక్రమంలో 
బొగ్గు/లిగ్నైట్ పీఎస్‌యూలతో పాటు ప్రైవేట్ గనులు కూడా చురుగ్గా పాల్గొంటాయి. ఈ ఏడాది, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీఐఎల్‌), సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) కలిసి 1798 హెక్టార్లలో పచ్చదనాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గనుల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, పర్యావరణ పునరుద్ధరణ/మొక్కల పెంపకం (1626 హెక్టార్లు), గడ్డి భూముల సృష్టి (70 హెక్టార్లు), హైటెక్ సాగు (90 హెక్టార్లు), వెదురు మొక్కల పెంపకాన్ని (3 హెక్టార్లు) ఈ మూడు సంస్థలు చేపట్టనున్నాయి.

 

****


(Release ID: 1640469) Visitor Counter : 232