రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విశాఖ తూర్పు నౌకాదళ స్థావరంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పర్యటన

Posted On: 21 JUL 2020 7:46PM by PIB Hyderabad

లెఫ్టినెంట్ జనరల్, అండమాన్‌&నికోబార్‌ కమాండ్‌కు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మనోజ్‌ పాండే, విశాఖలోని తూర్పు నౌకాదళ స్థావరం (ఈఎన్‌సీ)లో మూడు రోజులపాటు పర్యటించారు. ఆదివారం నుంచి బుధవారం వరకు పర్యటన సాగింది.

    వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌, ఈఎన్‌సీ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్ చీఫ్‌తో ఆయన సమావేశమై చర్చలు జరిపారు. తూర్పు తీరంలో నౌకాదళ బాధ్యతలు, ఇతర కార్యాచరణలపై అధికారులు లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండేకు వివరించారు.

    అండమాన్‌&నికోబార్‌ కమాండ్‌కు 15వ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా, లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ఈ ఏడాది జూన్‌ 1వ తేదీన బాధ్యతలు చేపట్టారు. 1982 డిసెంబర్‌లో, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో ఆయన నియమితులయ్యారు. యూకేలోని స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌, మోవ్‌ ఆర్మీ వార్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సు, దిల్లీ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో జాతీయ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కోర్సును పూర్తి చేశారు. తన 37 ఏళ్ల సేవలో భాగంగా, ఆపరేషన్ విజయ్, పరాక్రమ్‌లో చురుగ్గా పాల్గొన్నారు. జమ్ము&కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఇంజినీర్ రెజిమెంట్‌కు, స్ట్రైక్ కార్ప్స్‌లో భాగంగా ఇంజినీర్స్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కు, పశ్చిమ లద్దాఖ్‌లోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న పర్వత విభాగానికి, వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన కార్ప్స్‌కు, ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు వ్యతిరేక కార్యాచరణ ప్రాంతంలో కమాండింగ్‌ అధికారిగా సేవలు అందించారు. 

    ప్రస్తుతమున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు నావికాదళం, అండమాన్&నికోబార్‌ స్థావరం పరస్పర సహకరంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని వెల్లడించింది.

****

 



(Release ID: 1640292) Visitor Counter : 161