రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

రైతులకు అవసరమైన పంట పోషకాలను అందించేందుకు మూడు ఎరువుల దిగుమ‌తి షిప్‌మెంట్ల‌ను ఆర్డ‌రు చేసిన ఫాక్ట్

- ఇప్ప‌టికే భార‌త్‌కు చేరిన రెండు షిప్‌మెంట్‌లు, ఆగ‌స్టులో దేశానికి రానున్న మ‌రో షిప్‌మెంట్

- 2019-20 ఆర్థిక సంవత్సరంలో రికార్డు నికర లాభాలను ఆర్జించిన కంపెనీ

Posted On: 10 JUL 2020 3:04PM by PIB Hyderabad

రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ 'ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్' (ఫాక్ట్) ఈ ఏడాది (2020-21) మొదటి మూడు నెలల కాలంలో ఉత్పత్తి, మార్కెటింగ్ రంగంలో ప్రోత్సాహకరమైన పనితీరును కనబరిచింది. ఎరువుల వ్యాపారం ద్వారా టాప్ అండ్ బాటమ్ లైన్లను మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. ఎరువుల దిగుమతి కోసం ఇప్పటివరకు కంపెనీ మూడు కొనుగోలు ఆర్డర్లు జారీ చేసింది. ఇందులో ఇప్ప‌టికే రెండు షిప్‌మెంట్‌లు భార‌త్‌కు చేరుకున్నాయి. ఇందులో 27500 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 27500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువుల షిప్‌మెంట్‌లు ఉన్నాయి. ఎంఓపీకి సంబంధించిన మూడో షిప్‌మెంట్‌లు ఆగస్టులో భార‌త్‌కు వచ్చే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ప్ర‌స‌ర‌ణ ప‌ర్య‌వేక్షక సౌక‌ర్యాలను ఏర్పాటు చేయ‌డంతో పాటుగా ప్ర‌ధాన నిర్వ‌హ‌ణ కార్య‌క‌లాపాల‌ను పూర్తిచేసిన త‌రువాత 2020-21 ఆర్థిక ఏడాదిలో కాప్రోలాక్టమ్ కార్య‌క‌లాపాల‌ను కూడా తిరిగి ప్రారంభించాల‌ని కంపెనీ ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన ప్లాంట్‌ ట్ర‌య‌ల్ ర‌న్ కార్య‌క్ర‌మాల‌ను ఇప్ప‌టికే పూర్తి చేశారు. 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఫాక్ట్ దాని ప్రధాన ఉత్పత్తి ఫ్యాక్టమ్‌ఫోస్, అమ్మోనియం సల్ఫేట్‌ల‌ ఉత్పత్తి మరియు ఎరువుల అమ్మకం ద్వారా నిక‌ర లాభాల‌ను ఆర్జించ‌డంలో స‌రి కొత్త ఎత్తుల‌ను తాకింది.
 

 

ఈ సంవత్సరం ముఖ్యాంశాలు: -

ట‌ర్నోవ‌ర్ :

ప్ర‌స్తుత సంవ‌త్స‌రం రూ. 2770 కోట్లు      గ‌త సంవ‌త్స‌రం రూ.1955 కోట్లు

లాభంః

ప్ర‌స్తుత సంవ‌త్స‌రం రూ. 976 కోట్లు      గ‌త సంవ‌త్స‌రం రూ.163 కోట్లు


ఫ్యాక్టమ్‌ఫోస్ (ఎన్‌పీ 20: 20: 0: 13) 8.45 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉత్ప‌త్తి చేయ‌డ‌మైంది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జీవిత కాల గ‌రిష్ట రికార్డు. 2000-01 మధ్య కాలంలో రికార్డు చేసిన 8.38 లక్షల ఎమ్‌టీల మేటి రికార్డు కంటే కూడా ఇది మెరుగైనది.

అమ్మోనియం సల్ఫేట్ ఉత్పత్తి 2.21 లక్షల మెట్రిక్ టన్నులుగా నిలిచింది. గ‌త‌ 19 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధికం. మ‌రోవైపు 8.35 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫ్యాక్టమ్‌ఫోస్ అమ్మకాలు జ‌రిపింది. గ‌డిచిన 19 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధికం.

అమ్మోనియం సల్ఫేట్ అమ్మకం 2.36 లక్షల మెట్రిక్ టన్నులుగా నిలిచింది

ఇదే సంవత్సరానికి సిటీ కంపోస్ట్ అమ్మకం (13103 ఎంటీ) ఆల్‌టైమ్ హైగా (మునుపటి ఉత్తమ 9370 ఎంటీ) న‌మోదు అయింది.

ప్ర‌స్తావిత సంవత్సరంలో కంపెనీ త‌న ఎరువుల మార్కెటింగ్ కార్యకలాపాలను మొత్తం భార‌తావ‌నికి విస్తరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిషా, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల‌కు మార్కెటింగ్ నెట్‌వర్క్‌ విస్తరించింది.

తొలి అడుగుగా, కంపెనీ మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమ్మోనియం సల్ఫేట్‌ల‌ మార్కెటింగ్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది.



(Release ID: 1637788) Visitor Counter : 260