పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం తొలివిడత నిధుల విడుదల

ఆర్థిక సహాయంగా రూ.15,187.50 కోట్లు.. త్వరలో మరో రూ.15,187.50 కోట్లు;
ఎన్నడూ లేనంత అధికంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.60,750 కోట్లు కేటాయింపు: శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి;
ఈశాన్య సంప్రదాయ సంస్థలుసహా పంచాయతీరాజ్‌లో అన్ని అంచెలకూ సహాయం;
తాగునీటి సరఫరా.. వాననీటి సేకరణ.. జల శుద్ధి.. పారిశుధ్యం..
బహిరంగ విసర్జన విముక్త స్థాయి కొనసాగింపు తదితరాలకు ప్రాధాన్యం;
ఈ నిధుల అందుబాటుతో కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితులవల్ల
స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ప్రయోజనకర ఉపాధి: శ్రీ తోమర్‌

Posted On: 19 JUN 2020 8:35PM by PIB Hyderabad

ప్రస్తుత (2020-21) ఆర్థిక సంవత్సరానికిగాను 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో స్థానిక సంస్థలకు సంబంధించిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిందని వ్యవసాయ-రైతు సంక్షేమ, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. స్థానిక సంస్థల కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.60,750 కోట్లు కేటాయించాలని ఆర్థిక సంఘం నిర్ణయించిందని ఆయన చెప్పారు. లోగడ ఆర్థిక సంఘం కేటాయింపులతో పోలిస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో ఇది మునుపెన్నడూ లేనంత అధికమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దేశంలో ఐదు, ఆరు షెడ్యూళ్ల‌లోగ‌ల ప్రాంతాల సంప్రదాయ సంస్థలుసహా 28 రాష్ట్రాల ప‌రిధిలో  పంచాయతీ రాజ్ కింద‌ అన్ని అంచెల సంస్థ‌ల‌కూ క‌మిష‌న్ రెండు భాగాలుగా (i) ప్రాథ‌మిక, (ii) ష‌ర‌తుల‌తో కూడిన ఆర్థిక స‌హాయానికి సిఫార‌సు చేసింది. ఈ నిధులలో 50 శాతం ప్రాథ‌మిక సాయంగానూ, మిగిలిన 50 శాతం ష‌ర‌తుల‌తో కూడిన సాయంగానూ ఉంటుంది.

   ప్రాథమిక ఆర్థిక సహాయం కింద అందే నిధులను జీతాలు, పాలన ఖర్చులు మినహా తమతమ ప్రాంతీయ అవసరాల మేరకు గ్రామీణ స్థానిక సంస్థలు ఏ పనులకోసమైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. షరతులతో కూడిన నిధులను మాత్రం మౌలిక సేవలు (ఎ) పారిశుధ్యం-బహిరంగ విసర్జన విముక్త (ODF) స్థాయి కొనసాగింపు (బి) తాగునీటి సరఫరా-వాననీటి సేకరణ-జలశుద్ధి కోసం వినియోగించాలి. తదనుగుణంగా షరతులతో కూడిన నిధులను గ్రామీణ స్థానిక సంస్థలు వీలైనంతవరకూ ఈ రెండు కీలక సేవల కోసం చెరిసగంగా విభజించి వాడుకోవచ్చు. అయితే, ఏదైనా గ్రామీణ స్థానిక సంస్థ పరిధిలో ఈ రెండు సేవలలో ఒకటి సంపూర్ణంగా అందుతున్న పక్షంలో సంబంధిత నిధులను రెండో సేవ కోసం వాడుకోవచ్చు. ఆ మేరకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన ఈ ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు- 5, 6 షెడ్యూళ్ల పరిధిలోని ప్రాంతాల్లోగల సంప్రదాయ సంస్థలుసహా గ్రామీణ, సమితి, జిల్లా స్థాయిలో అన్ని అంచెల స్థానిక సంస్థలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం (SFC) నివేదికలో ప్రభుత్వం ఆమోదించిన సిఫారసుల ప్రాతిపదికన, కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన కింది సిఫారసుల పరిధిలో నిధుల పంపిణీ ప్రక్రియ సాగాలి:

  • గ్రామ పంచాయతీలకు 70 నుంచి 85 శాతం
  • సమితి/మధ్యంతర స్థాయి పంచాయతీలకు 10 నుంచి 25 శాతం.
  • జిల్లా పరిషత్‌లు/పాలన మండళ్లకు 5 నుంచి 15 శాతం
  • గ్రామ, జిల్లా ప్రాతిపదికన రెండంచెల స్థానిక సంస్థలు మాత్రమేగల రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలకు 70 నుంచి 85 శాతం; జిల్లా పరిషత్‌లు/పాలన మండళ్లకు 15 నుంచి 30 శాతం వంతున నిధులను పంపిణీ చేయాలి.

   ఆయా రాష్ట్రాల్లోని (ఐదు, ఆరు షెడ్యూల్‌ ప్రాంతాలుసహా) సంబంధిత స్థానిక సంస్థలలో రాష్ట్రాంత‌ర అంచెల‌వారీ పంపిణీని జనాభా, ప్రాంతం ప్రాతిప‌దిక‌గా 90:10 నిష్పత్తిలో లేదా తాజా ఎస్ఎఫ్‌సీ సిఫారసులపై ప్రభుత్వ ఆమోదం మేరకు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని శ్రీ తోమ‌ర్ చెప్పారు. ఇక‌ పంచాయ‌తీరాజ్ మంత్రిత్వ‌శాఖ సిఫార‌సుల ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగాగ‌ల 28 రాష్ట్రాల్లోని 2.63 ల‌క్ష‌ల గ్రామీణ స్థానిక సంస్థ‌ల‌కు ఆర్థిక స‌హాయం కింద కేంద్ర ఆర్థిక‌శాఖ 2020 జూన్ 17న రూ.15,187.50 కోట్లు విడుద‌ల చేసింద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ మొత్తం 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను 15వ ఆర్థిక సంఘం సిఫార‌సుల‌కు అనుగుణంగా విడుద‌ల చేసిన ష‌ర‌తుల్లేని నిధుల్లో భాగ‌మ‌ని మంత్రి తెలిపారు. ఈ సొమ్మును గ్రామీణ స్థానిక సంస్థ‌లు త‌మ‌త‌మ ప్రాంతాల్లో అవ‌స‌ర‌మ‌ని భావించిన ప‌నుల కోసం వాడుకోవ‌చ్చున‌ని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ స్థానిక సంస్థలలో తాగునీటి సరఫరా, వాననీటి సేకరణ, జల శుద్ధి, పారిశుధ్యం, ఓడీఎఫ్‌ స్థాయి కొనసాగింపు తదితర అభివృద్ధి కార్యక్రమాల కోసం రెండో విడత కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో రూ.15,187 కోట్లు త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే సిఫారసులు పంపిందని వివరించారు.

   కోవిడ్‌-19 మహమ్మారి సవాళ్లతో గ్రామీణ స్థానిక సంస్థలు పోరాడుతున్న పరిస్థితుల నడుమ ఈ నిధుల విడుదల అత్యంత సముచిత కాలంలో చేపట్టిన చర్యగా ప్రాధాన్యం సంతరించుకున్నదని శ్రీ తోమర్‌ పేర్కొన్నారు. ఈ నిధుల అందుబాటు ద్వారా పౌరులకు ప్రాథమిక సేవల ప్రదానంలో గ్రామీణ స్థానిక సంస్థల సామర్థ్యం నిస్సందేహంగా పెరుగుతుందని చెప్పారు. కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలస కార్మికులకు ప్రయోజనకర ఉపాధి కల్పనలో గ్రామీణ స్థానిక సంస్థలకు సాధికారత లభిస్తుందన్నారు. అంతేగాక నిర్మాణాత్మక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుంటుందని తెలిపారు. గ్రామీణ కార్మికుల నైపుణ్యం ప్రాతిపదికన సంబంధిత పనులద్వారా ఉపాధి కల్పనతోపాటు సామాజిక మౌలిక వసతులను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అలాగే గ్రామ పంచాయతీలు ప్రస్తుత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనగల స్థైర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. తదనుగుణంగా పంచాయతీ భవనాల నిర్మాణానికి ఆమోదించిన రూ.20 లక్షల వ్యయంలో 50 శాతాన్ని ఆర్థిక సంఘం నిధులనుంచి, మిగిలిన 50 శాతాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి భరించేందుకు అనుమతించింది. ఒకవేళ 14వ ఆర్థిక సంఘం మిగులు నిధులు 50 శాతం నిర్మాణ వ్యయానికి సరిపగా అందుబాటులో ఉంటే, మిగిలిన 50 శాతం ఖర్చుకోసం 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన 2020-21 ఆర్థిక సంవత్సరపు షరతుల్లేని నిధుల నుంచి వాడుకోవచ్చు.

   ఇవేకాకుండా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భవనాలు/ఆస్తుల మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా ఆర్థిక సంఘం నిధులను వాడుకోవచ్చు. ఆ మేరకు ప్రాథమిక/ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, విత్తనాలు-ఎరువులు విక్రయించే సహకార దుకాణాలు వగైరా భవనాల కోసం వెచ్చించవచ్చు. దీంతోపాటు ఆర్థిక సంఘం ఇచ్చిన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల నిధులను కలిపి అనుమతించబడిన ఇతర పనులు కూడా చేపట్టవచ్చు. ఉదాహరణకు గ్రామీణ స్థాయిలో (గరిష్ఠ వ్యయం రూ.15 లక్షలు మించకుండా) స్వయం సహాయ సంఘాల ద్వారా ఈ పనులు చేయించవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సంయుక్త లేఖ రాశారు.

   కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థలు ప్రశంసనీయ రీతిలో చేపట్టిన నిరోధక, రక్షణ చర్యలను ప్రస్తావించడం ఈ సందర్భంగా ఎంతో సముచితం. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 38,000 ఏకాంత చికిత్స కేంద్రాల ఏర్పాటు, ఐఈసీ సామగ్రి-అవగాహన కార్యక్రమాల రూపకల్పన, రోగకారక నిర్మూలన ద్రవాలు చల్లడం ద్వారా పారిశుధ్య నిర్వహణ, కోవిడ్‌ యాజమాన్యం కోసం గ్రామీణ స్వచ్ఛంద కార్యకర్తల నియామకం, సామాజిక దూరం నిబంధన అమలు, వైద్యశిబిరాల నిర్వహణ, గ్రామాల్లోకి జనం రాక-ఏకాంత నిర్బంధవైద్య కేంద్రాలకు వారి తరలింపు, ఇంటింటి అవగాహన కల్పన కార్యక్రమం, హస్త పరిశుభ్రతపై ప్రచారం, మాస్కుల తయారీలో స్వయం సహాయ సంఘాలకు భాగస్వామ్యం, వలస కార్మికులకు ఉపశమన చర్యలు, ఉపాధి హామీ పథకానికి ఊపునిచ్చి స్థానికంగా ఉపాధి చూపడం వంటి అనేకానేక చర్యలను సమర్థంగా చేపట్టాయి. ముఖ్యంగా వలస కార్మికులు భారీ సంఖ్యలో స్వగ్రామాలకు తిరిగి చేరుకున్న నేపథ్యంలో పంచాయతీలు మరింత గురుతర పాత్ర పోషించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల నడుమ కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల్లోనూ 15వ ఆర్థిక సంఘం నిధుల సమర్థ వినియోగానికి తోడ్పడనుంది. ఈ మేరకు వెబ్‌/ఐటీ ఆధారిత వేదికల ద్వారా ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ, ఖాతాల నమోదు/పనుల తనిఖీ, గ్రామీణ స్థానిక సంస్థల స్థాయిలో నిధుల ప్రవాహం తదితర అంశాల్లో చేయూతనివ్వనుంది.

*****



(Release ID: 1632828) Visitor Counter : 310