వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆహారధాన్యాల పంపిణీకి సంబంధించి ది వైర్ లో ప్రచురితమైన వార్తా కథనానికి ఆహార మరియు ప్రజాపంపిణీ విభాగ ఖండన
Posted On:
04 JUN 2020 9:02PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద మే నెలలో 144 మిలియన్ రేషన్ కార్డు దారులకు ఆహారధాన్యాలు అందలేదంటూ ది వైర్ మీడియాలో ప్రచురితమైన వార్తను కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖకు చెందిన ఆహార మరియు ప్రజాపంపిణీ విభాగం ఖండించింది. ది వైర్ లో శ్రీ కబీర్ అగర్వాల్ రాసిన వార్త కథనం సత్యదూరంగా వుందని ఈ ఖండనలో పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో 144 మిలియన్ ప్రజలు, మే నెలలో 64. 4 మిలియన్ రేషన్ కార్డు దారులకు ఆహారధాన్యాలు అందలేదని ఆ వార్తా కథనంలో ఆరోపించారు.
120 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల పంపిణీ ప్రస్తుతం కొనసాగుతోందని ఆహార మరియు ప్రజాపంపిణీ విభాగం తెలిపింది. పూర్తిగా లాక్ డౌన్ సమయంల కూడా పుడ్ కార్పొరేషన్ చాలా సమర్థవంతంగా పని చేసిందని సరఫరా వ్యవస్థను కొనసాగించిందని ప్రజాపంపిణీ విభాగం వివరించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మూడు నెలలకోసం ఇంతవరకూ 103 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపామని ప్రకటనలో వివరించారు. ఏప్రిల్ నెలలో ఎఫ్ సి ఐ నుంచి సరాసరి ప్రతి రోజూ 1.72 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల సరఫరా కొనసాగిందని మే నెలలో ఇది 1.29 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. జున్ నెలలో ఇంతవరకూ ఇది 1.39 లక్షల మెట్రిక్ టన్నులుగా వుందని అధికారులు వివరించారు. అన్ని రాష్ట్రాల్లో సరిపోయినన్ని నిలువలున్నాయని అన్నారు.
దేశంలో 11 రాష్ట్రాలు రెండు మూడు నెలలకు సరిపోయేలా ఒకేసారి ఆహారధాన్యాలను పంపిణీ చేస్తున్నాయి. రేషన్ షాపులకు పదే పదే రాకుండా చూడడం కోసం ఈ పని చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సరఫరాకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నారు. భౌతిక దూరం జాగ్రత్తలు పాటిస్తున్నారు.జాతీయ ఆహార భద్రతా చట్టం కిందకు రాని రేషన్ కార్డు దారులకు, ఎన్ జీవోలకు కూడా ఏప్రిల్ మే నెలలో ఆహారధాన్యాలు అందేలా రాష్ట్రాలకు ఆహారధాన్యాలను సరఫరా చేశామని అధికారులు తెలిపారు. ఇందుకోసం 13 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను సరఫరా చేశారు.
దీనికి తోడు ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద 8 కోట్ల మంది వలసకార్మికులకు ఆహారధాన్యాలను పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వున్న వలస కార్మికులకు, క్వారంటైన్ కేంద్రాల్లో వున్నవారికి పంపిణీ కొనసాగుతోందని అన్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇంతవరకూ 80 కోట్ల లబ్ధిదారుల్లో 74 కోట్ల మంది లబ్ధి పొందారు.కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల పంపిణీ ఇంకా కొనసాగుతోందని మొత్తంమీద ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ది వైర్ వార్తా కథనం మొదట్లో ఏప్రిల్ నెలలో 200 మిలియన్ మందికి పంపిణీ జరగలేదని రాశారని అయితే అదే కథనంలో చవరికి వచ్చేసరికి ఏప్రిల్ నెలలో 64 మిలియన్ మందికి పంపిణీ జరగలేదని అన్నారు. ఒకే కథనంలో ఇంత తేడా రాయడంద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థపై తమకున్న అవగాహన లేమిని వారు బైట పెట్టుకున్నారని అధికారులు స్పష్టం చేశారు.
పిఎంజిఎఏవై కింద మే నెలలో 68 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని, అయితే ది వైర్ వార్తా కథనంలో 65.5 కోట్ల మందికి లబ్ధి చేకూరినట్టు పాత సమాచారం ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు. అంటే నిరంతరం జరుగుతున్న ప్రజాపంపిణీ విధానాన్ని ఈ వార్తా కథనం పట్టించుకోలేదని స్పష్టమవుతోందని అధికారులు స్పష్టం చేశారు.
*****
(Release ID: 1629581)
Visitor Counter : 247