శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వాతావరణం మీద పెను ప్రభావం చూపనున్న

అమేరీ ఐస్ షెల్ఫ్ విస్తరణ : ఎన్ సి పి ఒ ఆర్ వెల్లడి

2001 నుంచి 2016 వరకు సేకరించిన ఉపగ్రహ సమాచారం మీద అధ్యయనం

2017 లో 550 మీ, 2018 లో 1470 మీ, 2019 లో 2200 మీ. పెరిగిన అమేరీ

గత 19 ఏళ్ళలో దిగువకు ప్రవహించే గ్లేసియల్ డ్రెయినేజ్ వ్యవస్థ వలన ఎఐఎస్ స్థిరత్వం కోల్పోవటమే కారణమని తేల్చిన అధ్యయనం

Posted On: 03 JUN 2020 8:48PM by PIB Hyderabad

అమేరీ ఐస్ షెల్ఫ్ ( ఎ ఐ ఎస్) సరిహద్దులు 2016  నాటి స్థానం నుంచి 2021 నాటికి 24%, 2026 నాటికి మరో 24% పెరుగుతాయని ధృవప్రాంత, సముద్ర పరిశోధన జాతీయ కేంద్రం ( ఎన్ సి పి ఓ ఆర్) అంచనా వేసింది. AIS మీద  60,000  చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన AIS మీద 16 ఏళ్ళపాటు సేకరించిన ఉపగ్రహ ఆధారిత సమాచారం ఆధారంగా ఇలా లెక్కగట్టారు. ప్రస్తుతం సముద్రంలో వస్తున్న మార్పులను, వాతావరణ శక్తులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 


గ్లేసియర్ స్థిరత్వాన్ని కాపాడటంలో సముద్రం మీద తేలియాడే భారీ మంచు పలకలు బహుముఖ పాత్ర పోషిస్తాయి.  ఈ మంచు పలకలే గ్లేసియర్ ను భూభాగంతో అనుసంధానం చేస్తాయి. మంచు పలక సమతుల్యతకు దాని ద్రవ్యరాశి, సముద్ర పొరల తీరు, అడుగున నీరు ఏర్పడటం అనేవి ముఖ్యమైన కొలమానాలు,  గుప్త ఉష్ణోగ్రత, నిజమైన ఉష్ణోగ్రతా ప్రక్రియలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. 
అంటార్కిటికా తూర్పు తీరంలో 70 డిగ్రీల అక్షాంశం,  70 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉన్న ఎఐఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్లేసియర్ డ్రెయినేజ్ బేసిన్లలో ఒకటి. ఎఐఎస్ కదలికలు, ద్రవ్యరాశి సమతుల్యత ఆధారంగా ప్రపంచ వాతావరణ మార్పుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

2001 నుంచి 2016 వరకు ఎ ఐ ఎస్ విస్తీర్ణం పరిస్థితిని చూపుతున్న అధ్యయన ప్రాంతం
వాతావరణ శక్తుల నుంచి మంచు పలకలకు రక్షణ కల్పించటమన్నది ఆ మంచుపలకల కింద ఉండే సముద్రపు కుహరం ఇచ్చే ఉష్ణోగ్రత సోపానం మీద ఆధారపడి ఉంటుంది. సముద్రపు కుహరం మీద మంచుపలకలు పెట్టే వత్తిడి ఈ ఉష్ణోగ్రత సోపానాన్ని నిర్ణయిస్తుంది.
సముద్రపు మంచు మీద ఎప్పుడూ వత్తిడి ఉంటుంది. మంచుపలకలే స్వయానా  సముద్రం పొంగకుండా పరోక్ష పాత్ర పోషిస్తాయి. దీనికి తోడు గడ్డకట్టే వాతావరణపు ఉష్ణోగ్రత కూడా సాయపడుతుంది. మంచు పలకల స్వరూపాన్ని మార్చగల సామర్థ్యం కూడా దానికుంటుంది. 
2001 నుంచి  2016 వరకు సేకరించిన ఉపగ్రహ సమాచారం ఆధారంగా ఎన్ సి పి ఒ ఆర్ ఈ అధ్యయనం చేపట్టింది. దక్షిణార్థ గోళపు వేసవి నెలలైన జనవరి-మార్చి కాలంలో ఈ సమాచార సేకరణ జరిగింది. దీంతో ఎ ఐ ఎస్ విస్తరణ, తూర్పు అంటార్కిటికాలో సముద్రపు వాతావరణ శక్తి ప్రభావం అర్థం చేసుకోవటానికి వీలుకలిగింది. ఎఐఎస్ లో వచ్చిన తాత్కాలిక మార్పును మెకంజీ అఖాతంలో 200 కిలోమీటర్ల మేర పెరగటాన్ని గుర్తించటం  ద్వారా ఎన్ సి పి ఒ ఆర్ శాస్త్రవేత్తలు గమనించారు. అది 68.5 డిగ్రీల అక్షాంశం, 69.65 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. అదే సమయంలో శాండెజ్ ఫోర్డ్ అఖాతం 69.65 డిగ్రీల అక్షాంశం, 74.3 డిగ్రీల రేఖాంశం దగ్గర ఉంది. ఇది ఎ ఐఎస్ లో ఒక భాగం.
దీని ద్వారా తేలిందేంటంటే గత 19 ఏళ్ళలో దిగువకు ప్రవహించే గ్లేసియల్ డ్రెయినేజ్ వ్యవస్థ వలన ఎఐఎస్ స్థిరత్వం కోల్పోయింది. దాంతో కరగటం కంటే గడ్డకట్టుకుపోయే శాతం ఎక్కువై మంచు పలక సరిహద్దులు విస్తరించాయి.
మంచు పలకల విస్తరణ వేగం కూడా గత మూడేళ్లలో, అంటే..2017-2019 మధ్య పెరిగినట్టు ఎన్ సి పిఒఆర్ అంచనా వేసింది.  ఎఐఎస్ 2017 లో 550  మీ, 2018 లో 1470 మీ, 2019 లో 2200 మీ. పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఆరేళ్లలో (2021 to 2026) మంచు పలక స్థానాలు దాదాపుగా సరిహద్దు పరిస్థితులకు దగ్గరగా రావచ్చు.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత చల్లబడటం కూడా ఎన్ సి పిఒఆర్  గుర్తించి వెల్లడించింది. దీని ఫలితంగా మంచుపలక గత 15 ఏళ్లలో 88% ముందుకొచ్చింది. ఈ మార్పులు వాతావరణంలో  పెద్ద ఎత్తున అనిశ్చితికి దారితీయవచ్చు.  
ఈ పరిశోధనలో నిమగ్నమైన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అవినాష్ కుమార్ 2001 నుంచి 2016 మధ్య ఎన్ సి పి ఒ ఆర్ జరిపిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ, " గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మంచుపలక వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీన్ని నిర్థారించటానికి ఉపగ్రహ సమాచారం, గణాంక విధానాలు ఉపయోగపడ్డాయి. గతాన్ని పునర్నిర్మిస్తూ భవిష్యత్తులో చూడబోయే సముద్ర ఉష్ణోగ్రతలను అంచనావేస్తూ అంటార్కిటిక్ అమేరీ ఐస్ షెల్ఫ్  ద్రవ్యరాశి పెరిగిన విస్తీర్ణాన్ని లెక్కగట్టాం. వాతావరణ మార్పుల స్థాయి, వాటి ప్రభావాలను అంచనా వేయటానికి ఈ అధ్యయనం ఎంతో కీలకంగా ఉపయోగపడుతుంది. భూగోళమంతా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి ఇదే అధ్యయనాన్ని మరెక్కడైనా వాడుకునే వీలు కూడా ఉంది. సుస్థిర పర్యావరణ నిర్వహణకు దీన్ని పర్యవేక్షిస్తూ ఉండవచ్చు" అన్నారు. 


డాక్టర్ అవినాష్ కుమార్ నేతృత్వంలోని పరిశోధక బృందంలో  ఎన్ సి పి పి ఒ ఆర్ కు చెందిన జుహీ యాదవ్, రాహుల్ మోహన్, భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి చెందిన గోవా, ఆకృతి శ్రీవాస్తవ ఉన్నారు. ఈ పరిశోధనాపత్రం జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్ మెంట్ లో ప్రచురితమైంది.
 

*****



(Release ID: 1629291) Visitor Counter : 222