సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
నివేదికల్ని సమర్పించిన ఫిల్మ్ మీడియా యూనిట్ల క్రమబద్దీకరణ, స్వయంప్రతిపత్తి సంస్థల సమీక్షకోసం వేసిన నిపుణుల కమిటీలు
Posted On:
02 JUN 2020 8:10PM by PIB Hyderabad
కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ఫిల్మ్ మీడియా యూనిట్లు సమర్థవంతంగా పని చేయాలంటే ఏం చేయాలి? వేటినైనా మూసివేయవచ్చా? విలీనం చేయవచ్చా? తదితర అంశాలను తెలుసుకోవడానికి వేసిన నిపుణుల కమిటీ తన నివేదికను సమర్పించింది. అలాగే కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలను సమీక్షించడానికి వేసిన నిపుణుల కమిటీ కూడా తన నివేదికను సమర్పించింది. ఈ నిపుణుల కమిటీలు తమ నివేదికల్ని కేంద్ర సమాచార మరియు ప్రసారాల మంత్రిత్వశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్‌కు సమర్పించాయి. ఈ రెండు కమీటీల ఛైర్మన్ శ్రీ బిమల్ జుల్కా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీల్లోని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ నిపుణుల కమిటీలు ఎనిమిది సార్లు సమావేశమై నివేదికల్ని రూపొందించాయి. నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఫిల్మ్స్ డివిజన్, చిల్డ్రన్స్ ఫిల్మ్స్ సొసైటీ, సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, నేషనల్ ఫిల్మ్ ఆర్కయివ్స్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థల అభివృద్ధికోసం ప్రత్యేకంగా రోడ్డు మ్యాపులు తయారు చేశారు. ఒకే గొడుగు కింద పని చేసే నాలుగు విస్తృతమైన వర్టికల్స్ కిందకు వీటిని తీసుకురావాలని కమిటీలు నిశ్చయించాయి. ప్రొడక్షన్, ఫెస్టివల్, వారసత్వం, జ్ఞానం అనేవి ఈ నాలుగు విభాగాలు. ఈ నాలుగింటికి ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులు నేతృత్వంవహిస్తారు. స్వతంత్రంగా చిత్రాలను తీసేవారిని ప్రోత్సహించడానికిగాను ఫిల్మ్ ప్రమోషన్ ఫండ్ ను నెలకొల్పాలని తద్వారా వారు వాణిజ్య చిత్రాలను తీసేలా సహకరించాలని ఈ నివేదిలో సూచించారు.
కమిటీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఈ నివేదికల్లో వున్న సిఫార్సులు నిరుపయోగం కావని వాటిని తాను అధ్యయనం చేసి అనంతరం మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడతానని మంత్రి అన్నారు. కమిటీ చేసిన సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని అన్నారు.
నేపథ్యం
కేంద్ర సమాచార మరియ ప్రసారాల మంత్రిత్వశాఖ కింద వున్న ఫిల్మ్ మీడియా యూనిట్లు, సతంత్ర ప్రతిపత్తి సంస్థలు తమ లక్ష్యాలను అందుకుంటున్నాయా? వాటిని ఏర్పాటు చేసినప్పటి ఉద్దేశ్యాలు నెరవేరుతున్నాయా? ఏవైనా లోపాలున్నాయా? ప్రజలకు ఉపయోగకరంగా వున్నాయా? వాటి అవసరం ఇంకా వుందా? వేటినైనా మూసివేయవచ్చా? అభివృద్ధి చేయడానికి ఆస్కారం వుందా? అవి స్వంతంగా ఆదాయం సంపాదించి వాటి కాళ్ల మీద అవి నిలబడగలవా? ఇలా అనేక అంశాల ఆధారంగా అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని రెండు కమిటీలను నియమించారు. ఒకటి స్వయంప్రతిపత్తి సంస్థలకోసం మరొకటి ఫిల్మ్ మీడియా యూనిట్లకోసం వేశారు. వీటి రెండింటికీ ఛైర్మన్‌గా శ్రీ బిమల్ జుల్కా వ్యవహరించారు.
(Release ID: 1628871)
Visitor Counter : 183