గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర ఉపాధి హామీ మండలి 21వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ, పంచాయితీరాజ్ శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద వ్యవసాయ రంగానికి సాయపడేలా జల సంరక్షణ, నీటిపారుదల రంగాలలో ఆస్తులతోబాటు వ్యక్తిగత ఆస్తుల సృష్టికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ స్పష్టం చేశారు.

ముందెన్నడూ లేనంత అత్యధికంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 61,500 కోట్ల కేటాయింపు; కోవిడ్ - 19 కారణంగా తలెత్తిన కష్టకాలంలో ఉపాధి కల్పనకోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద అదనంగా మరో 40,000 కోట్లు

Posted On: 02 JUN 2020 8:34PM by PIB Hyderabad

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద ఏర్పాటైన కేంద్ర ఉపాధి హామీ మండలి 21వ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ, పంచాయితీరాజ్ శాఖామంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ అధ్యక్షతన 2020  జూన్ 2న జరిగింది. 


ఈ సమావేశంలో పాల్గొన్న వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఈ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే అతి పెద్ద పథకాల్లో ఒకటన్నారు. దీనికింద చేపట్టటానికి 261 పనులకు అనుమతులుండగా అందులో 164 రకాల పనులు వ్యవసాయం తదితర కార్యకలాపాలకు చెందినవేనన్నారు. వ్యక్తిగత ఆస్తుల కల్పనకు, వ్యవసాయ రంగానికి సహాయపడే జల సంరక్షణ/ నీటిపారుదల ఆస్తుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందన్నారు.


పారదర్శకత, జవాబుదారీతనం సాధించటానికి ప్రభుత్వం నూటికి నూరుశాతం వేతనాలను ఈ పథకం కింద పనిచేసే కూలీల బాంకు ఖాతాల్లోనే వేయటానికి అన్ని చర్యలూ తీసుకుంటోంది. అందులో భాగంగానే పనులమీద సోషల్ ఆడిట్ మీద ప్రత్యేక దృష్టిపెట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో రూ. 61,500 కోట్లు కేటాయించగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కోవిడ్-19 కష్టకాలంలో ఉపాధి అవసరమైన వారి కోసం అదనంగా మరో 40,000 కోట్లు కేటాయించారు. దీనికింద రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ ఈ పాటికే రూ. 28,000 కోట్లు విడుదలచేశారు. 
ఇలాంటి కష్టకాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ చేపట్టిన మంచి పనులను గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులకు ఎక్కువ లబ్ధి కలిగేలా ఈ పథకం కింద నీటిపారుదల, నీటి సంరక్షణ కార్యకలాపాల మీద ఎక్కువగా దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు. 


ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ పథకం మెరుగుదలకు విలువైన సూచనలిచ్చారు. చట్టం పరిధిలో వాటన్నిటినీ పరిశీలిస్తానని శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ హామీ ఇచ్చారు.
 

****(Release ID: 1628837) Visitor Counter : 318