శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సార్స్ కోవ్-2 ప్రధాన ప్రొటీజ్‌ను అడ్డుకునే ఔషధాలను కనిపెట్టేందుకు ప్రయత్నాలు
వారణాసి ఐఐటీలో పరిశోధనలు జరిపేందుకు ఆమోదం
సార్క్ కోవ్-2 ప్రధాన ప్రొటీజ్ అంతర్గత నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని ప్రయోగాలు
Posted On:
02 JUN 2020 3:32PM by PIB Hyderabad
సార్స్ కోవ్-2ను నిరోధించే ఔషధ అణువును వేగంగా కనిపెట్టేందుకు.. అందుబాటులో ఉన్న, ఆమోదం పొందిన ఔషధాల నుంచి ముఖ్య సమ్మేళనాలను గుర్తించడానికి వారణాసి ఐఐటీ (బనారస్ హిందూ విశ్వవిద్యాలయం-బీహెచ్‌యు) లో పరిశోధనలు జరిపేందుకు "సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు" ఆమోదం తెలిపింది
ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా వైరస్‌కు టీకాలను కనిపెట్టేందుకు అన్ని దేశాల్లో శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ నుంచి రోగి బయటపడేందుకు, వైరస్ లక్షణాల నుంచి ఊరటనిచ్చే చికిత్సలే ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పటికే ఉన్న ఔషధాల పునర్వినియోగం.. వైరస్‌కు సమర్ధవంతమైన చికిత్సను కనుగొనే దిశలో ఖర్చు చేసే డబ్బు, సమయాన్ని ఆదా చేస్తుంది.
సార్స్ కోవ్-2 ప్రధాన ప్రొటీజ్‌ను నిరోధించే కొత్త ఔషధాన్ని కనిపెట్టేందుకు పరిశోధన బృందానికి చెందిన ప్రొఫెసర్ వికాశ్ కుమార్ దూబే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం డ్రగ్ బ్యాంక్ డేటాబేస్ ఔషధ సమ్మేళనాలను ఆయన విశ్లేషిస్తున్నారు.
సార్స్ కోవ్-2 ప్రధాన ప్రోటీజ్ నిరోధకాన్ని గుర్తించేందుకు ప్రొ.వికాశ్ కుమార్ దూబే బృందం విస్తృత ప్రయోగాలు, అధ్యయనాలు చేస్తోంది.
అందుబాటులో ఉన్న సార్క్ కోవ్-2 ప్రధాన ప్రొటీజ్ అంతర్గత నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని, నిర్మాణ-ఆధారిత నిరోధకాన్ని కనిపెట్టేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్ బ్యాంక్ డేటాబేస్‌లోని ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న ఔషధాల సమ్మేళనాల నుంచి దీనిని రూపొందిస్తున్నారు.
ఆ తర్వాత, పునఃసంయోగం చేసిన సార్స్ కోవ్-2 ప్రధాన ప్రొటీజ్ ప్రొటీన్‌ను అడ్డుకునేందుకు రూపొందించిన నిరోధకాలను ప్రయోగాత్మకంగా ధృవీకరిస్తారు. అనేక నిరోధక ప్రమాణాల ఆధారంగా, సార్స్ కోవ్-2 ప్రధాన ప్రొటీజ్ పనితీరును అడ్డుకునేందుకు కనిపెట్టిన కొత్త నిరోధకాల ప్రభావాన్ని లెక్కిస్తారు. సార్స్ కోవ్-2 వ్యాప్తికి, వృద్ధికి ఈ ప్రొటీజ్ ముఖ్యం కావడం వల్ల... ఈ ఎంజైమును అడ్డుకునేందుకు కనిపెట్టిన నిరోధక ప్రొటీన్.. వైరస్ వ్యాప్తి నిరోధక ప్రభావాన్ని కలిగివుంటుంది. డ్రగ్ బ్యాంక్ డేటాబేస్ సమ్మేళనాలన్నీ దాదాపుగా ఫార్మాకోకైనటిక్స్, విషప్రభావ పరంగా వర్గీకరించినవే. దీనివల్ల కొత్తగా గుర్తించిన అణువును వేగంగా మార్కెట్లోకి తీసుకువచ్చే వీలుంది.

(మరిన్ని వివరాల కోసం డా.వికాశ్ కుమార్ దూబేను vkdubey.bce@iitbhu.ac.in ద్వారా సంప్రదించవచ్చు)
(Release ID: 1628673)
Visitor Counter : 185