కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

టి సి ఎస్ అయాన్ భాగస్వామ్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్ సి ఎస్) పోర్టల్ పై ఉచిత ఉద్యోగ నైపుణ్య శిక్షణ ప్రారంభం

లాక్ డౌన్ సమయంలో దాదాపు 76 ఆన్ లైన్ ఉద్యోగ మేళాల నిర్వహించిన ఎన్ సి ఎస్

Posted On: 29 MAY 2020 4:49PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్టు కింద తమ వద్ద నమోదైన ఉద్యోగార్ధులకు ఇప్పుడు టి సి ఎస్ అయాన్ భాగస్వామ్యంలో  ఉచితంగా ఆన్ లైన్ లో  "ఉద్యోగ నైపుణ్య శిక్షణ"  నిర్వహిస్తోంది.   సాఫ్ట్ స్కిల్స్ పై నిర్వహించే ఈ కోర్సులో  శిక్షణ పొందే అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే విధంగా కార్పొరేట్ మర్యాదలు,  సంభాషణ చాతుర్యం,  ఏదైనా విషయాన్ని గురించి ఆకట్టుకునే విధంగా చెప్పడం/ ప్రభావశీల సమర్పణ చేయడంతో  పాటు పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా ఇతర సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడం జరుగుతుంది.  ఈ  శిక్షణ మాడ్యూల్ ఎన్ సి ఎస్ పోర్టల్ పై హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభిస్తుంది.  

జాతీయ ఉద్యోగ సేవల పరివర్తన లక్ష్యంతో మంత్రిత్వ శాఖ  నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఎన్ సి ఎస్ ఏర్పాటు చేసిన ఆన్ లైన్ పోర్టల్ (www.ncs.gov.in)  ద్వారా ఉద్యోగాల వెతుకులాట,  ఉద్యోగాలను అభ్యర్థులను జతపరచడం, వృత్తి ఉద్యోగాలపై సలహాలు,  వృత్తి సంబంధ మార్గనిర్దేశం,  నైపుణ్య అభివృద్ధి కోర్సులపై సమాచారం, అప్రెంటిస్ శిక్షణ,  శిక్షణలో మలిదశ  (ఇంటర్న్ షిప్) వంటి వివిధ రకాల ఉద్యోగ సంబంధ సేవలను అందజేస్తున్నారు.  ఎన్ సి ఎస్ పోర్టల్ లో దాదాపు ఒక కోటి మంది ఉద్యోగార్థులు మరియు 54 వేల  సంస్థలు (యజమానులు)  నమోదు చేసుకున్నారు.   పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 73 లక్షల ఉద్యోగాల ఖాళీలను సమీకరించడం జరిగింది.   దేశవ్యాప్తంగా  200 ఆదర్శ కెరీర్ కేంద్రాలతో సహా  1000 ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజిలను ఎన్  సి ఎస్ తో జతచేయడం జరిగింది.

కోవిడ్ -19 మహమ్మారి,  దాని తదనంతరం అమలు చేస్తున్న ఆర్ధిక వ్యవస్థ లాక్ డౌన్  ప్రభావం వల్ల శ్రామిక ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడానికి,  సవాళ్ళను అధిగమించడానికి  ఎన్ సి ఎస్ అనేక ఇతర యత్నాలను కూడా మొదలెట్టింది.  

ఉద్యోగార్ధులకు మరియు యజమానులకు మధ్య ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి వారధిగా ఆన్ లైన్ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు.  ఈ పోర్టల్ పై  ఉద్యోగాల ఖాళీల ప్రకటన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ పోర్టల్ పైనే పూర్తిచేయవచ్చు.   లాక్ డౌన్ సమయంలో  ఎన్ సి ఎస్ దాదాపు  76 ఆన్ లైన్ ఉద్యోగ మేళాలను నిర్వహించింది.  

ఇంటినుంచే పనిచేసే ఉద్యోగాలు  (వర్క్ ఫ్రమ్ హోమ్) మరియు ఆన్ లైన్ శిక్షణల కోసం  ఎన్  సి ఎస్ పోర్టల్  హోమ్ పేజీలో ఒక ప్రత్యేక లింక్ ఏర్పాటు చేయడం జరిగింది.  దీని ద్వారా ఉద్యోగార్థులు  అలాంటి ఉద్యోగాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే సౌలభ్యం ఏర్పడుతుంది.  

హైర్ మీ భాగస్వామ్యంలో ఉద్యోగార్థులు తమ వీడియో ప్రొఫైల్స్ ను సృష్టించుకుని సౌకర్యాన్ని కూడా ఎన్ సి ఎస్ కల్పిస్తోంది.  హైర్ మీ అనేది ఆన్ లైన్ లో అభ్యర్థుల అంచనాను మరియు  హైరింగ్ సేవలను అందించే ప్లాటుఫారమ్.   దీని ద్వారా ఉద్యోగార్థులు తమ సామర్ధ్యాన్ని,  అర్హతలను గురించి చిన్న వీడియో క్లిప్ లో రిక్రూటర్లకు వివరించవచ్చు.  ఎన్ సి ఎస్  అందించే సేవలన్నీ ఉచితం.  

====== 



(Release ID: 1627767) Visitor Counter : 311