రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

విశాఖలోని ఐఎన్‌ఎస్‌ కళింగ వద్ద 2 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటు ప్రారంభం

ప్రకృతి సంరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఐఎన్‌ఎస్‌ కళింగ

Posted On: 29 MAY 2020 4:07PM by PIB Hyderabad

సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అనుగుణంగా, విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ కళింగ బేస్‌ వద్ద 2 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటును వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ ప్రారంభించారు. తూర్పు నావికాదళానికి చెందిన మరికొందరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్‌ సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
       
    తూర్పు నావికాదళం (ఈఎన్‌సీ)లోనే ఈ విద్యుత్‌ ప్లాంటు అతి పెద్దది. దీని జీవితకాలం 25 ఏళ్లు. లాక్‌డౌన్‌ నిబంధనల సమయంలో, వివిధ  సంస్థలతో కలిసి ఏపీఈపీడీసీఎల్‌ ప్రణాళికాబద్ధంగా ప్లాంటు పనులు చేపట్టింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే పనులు కొనసాగాయి.

    ప్రకృతి పరిరక్షణ, పర్యావరణహిత చర్యల్లో తూర్పు నావికాదళం నిబద్ధతకు ఈ ప్లాంటు నిదర్శనమని వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ అన్నారు.

    ఐఎన్‌ఎస్‌ కళింగ ప్రస్తుతం Cmde రాజేశ్‌ దేబ్‌నాథ్‌ నేతృత్వంలో పని చేస్తోంది. 1980ల్లో ఇది ప్రారంభమైనప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణకార్యక్రమాలను చురుగ్గా చేపడుతోంది. అటవీకరణ, మొక్కల పెంపకం, తీర ప్రాంత శుద్ధి కార్యక్రమాలు, భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల సంరక్షణ వంటి కార్యక్రమాలను ఐఎన్‌ఎస్‌ కళింగ చేపట్టింది.

 


(Release ID: 1627688) Visitor Counter : 238