భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

దేశంలోకి నైరుతి రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం

ఈనెల 29వ తేదీ నుంచి ఉత్తర భారతదేశంలో తగ్గనున్న వేడిగాలుల తీవ్రత
ఈనెల 28 నుంచి గరిష్ట ఉష్ణోగ్రతల్లోనూ తగ్గుదల
ఈనెల 30వ తేదీ వరకు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం

Posted On: 27 MAY 2020 6:57PM by PIB Hyderabad

దేశంలోకి నైరుతి రుతుపవనాల ఆగమనం, ఈనెల 30వ తేదీ వరకు వాతావరణ మార్పులను.. భారత వాతావరణ విభాగానికి చెందిన జాతీయ వాతావరణ సూచనల కేంద్రం అంచనా వేసింది. ఆ ప్రకారం: 
    దట్టంగా అలముకున్న మేఘాలు, మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు బలంగా వీస్తున్న నైరుతి గాలుల కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బుధవారం.. అండమాన్‌ సముద్రం, అండమాన్‌&నికోబార్‌ దీవుల్లో ఎక్కువ భాగాలకు; పశ్చిమ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. "నార్థర్న్‌ లిమిట్‌ ఆఫ్‌ మాన్‌సూన్‌" Lat.5°N/Long.82°E, Lat.7°N/Long.86°E, Lat.10°N/Long.90°E, పోర్ట్‌బ్లెయిర్‌, Lat.15°N/Long.97°E గుండా వెళుతోంది.  
 
    మాల్దీవులు-కొమొరిన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు, అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి  వచ్చే 48 గంటల్లో వాతావరణం అనుకూలంగా ఉంది. అండమాన్‌ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, బే ఆఫ్‌ బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించడానికీ అనుకూల వాతావరణం నెలకొంది.
 
    పశ్చిమ గాలుల ప్రభావంతో, ఉత్తర భారతదేశంలో ఈనెల 28వ తేదీ నుంచి 30 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. 29వ తేదీ నుంచి వేడిగాలుల తీవ్రత గణనీయంగా తగ్గనున్న కారణంగా గురువారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. మధ్య భారతదేశ ప్రాంతాల్లోనూ చల్లగాలుల ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోనూ ఈనెల 29 నుంచి వేడిగాలులు తగ్గుముఖం పడతాయి.
 
    బే ఆఫ్‌ బెంగాల్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ట్రోపోస్పియర్‌ దిగువ స్థాయిలోనే బలమైన దక్షిణ గాలులు వీస్తున్న కారణంగా.. మేఘాలయ, త్రిపుర, మిజోరాంలో వచ్చే 2 రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశముంది. 

మరిన్ని వివరాల కోసం www.imd.gov.in ను దర్శించండి.


(Release ID: 1627342)