వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందిః కేంద్ర వ్యవసాయ మంత్రి
- ఆత్మనిర్భర్ అభియాన్‌లో భాగంగా తేనెటీగల పెంపకానికి ప్రభుత్వం రూ. 500 కోట్ల మేర నిధులను కేటాయించిందిః శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
- ప్రపంచంలోని మేటి ఐదు తేనె ఉత్పత్తిదారు దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది
Posted On:
22 MAY 2020 6:12PM by PIB Hyderabad
దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే మహా లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం తేనెటీగల పెంపకాన్ని(బీకీపింగ్) ప్రోత్సహిస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఈ రోజు నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) నిర్వహించిన ఒక వెబ్‌నార్‌ను ఉద్దేశించి మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ అభియాన్ కింద ప్రభుత్వం తేనెటీగల పెంపకానికి రూ. 500 కోట్లు నిధులను కేటాయించిందని తెలిపారు. ప్రపంచంలోనే మేటి ఐదు తేనె ఉత్పత్తిదారు దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఆయన అన్నారు. 2005-06తో పోలిస్తే తేనె ఉత్పత్తి 242 శాతం, ఎగుమతులు 265 శాతం మేర పెరిగాయని తెలిపారు. తేనే ఎగుమతులు పెరుగుతున్నందున.. తేనెటీగల పెంపకం ద్వారా 2024 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించడంలో బీకీపింగ్ ఒక ముఖ్య కారకంగా నిలవగలదని మంత్రి శ్రీ తోమర్ అభిప్రాయపడ్డారు.
30 లక్షల మంది రైతులకు తేనెటీగల పెంపకంలో శిక్షణ..
నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్‌లో (ఎన్‌బీహెచ్‌ఎం) భాగంగా శిక్షణ ఇవ్వడానికి నేషనల్ బీ బోర్డు నాలుగు కీలక మాడ్యూళ్లను రూపొందించిందని తెలిపారు. దాదాపు 30 లక్షల మంది రైతులకు తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తోందని మంత్రి వివరించారు. దేశంలో తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కమిటీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో నాలుగు భాగాలుగా పేర్కొన్న ‘స్వీట్ రివల్యూషన్’లో భాగంగా ప్రభుత్వం ‘హనీ మిషన్’ను ప్రారంభించిందని ఆయన అన్నారు. పెట్టుబడి తక్కువగా ఉండి అధిక రాబడిని ఇస్తుంది కాబట్టి చిన్న మరియు సన్నకారు రైతులు కూడా తేనెటీగల పెంపకాన్ని చేపట్టవచ్చని మంత్రి శ్రీ తోమర్ ఉద్ఘాటించారు.
అభిప్రాయాలను తెలియజేసిన ఆయా రాష్ర్టాలు..
ఈ వెబ్‌నార్‌లో ఉత్తరాఖండ్ సహకార శాఖ మంత్రి డాక్టర్ ధన్సింగ్ రావత్ మాట్లాడుతూ సేంద్రీయ తేనె ఉత్పత్తిని ప్రధాన స్రవంతిగా మార్చాలని తమ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. హనీ మిషన్‌లో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ఈ సమావేశంలో ఎన్‌సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుందీప్ కుమార్ నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తేనెటీగల పెంపకంలో మహిళా సంఘాలను ప్రోత్సహించడం మరియు ఎపికల్చర్ కో-ఆపరేటివ్స్ అభివృద్ధిలో ఎన్‌సీడీసీ నిర్వహించిన పాత్రను ప్రధానంగా తెలియజేశారు.
షేర్-ఈ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఉపకులపతి, వ్యవసాయ శాస్త్ర మరియు ప్రొఫెసర్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ కాశ్మీర్ తేనె యొక్క విశిష్ట లక్షణాల గురించి తెలిపారు. ఇది న్యూజిలాండ్‌లో లభించే ప్రపంచంలోనే అత్యుత్తమమైన మనుకా తేనె మాదిరిగానే ఉంటుంది అని తెలిపారు. యూఎన్ఎఫ్ఏఓ ప్రతినిధి టోమియో షిచిరి మాట్లాడుతూ తేనె ఎగుమతులందు నాణ్యతా భరోసా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రధానంగా వివరించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.వి. రావు మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా
సేంద్రీయ తేనె, అడవి తేనెల ఉత్పత్తిని ప్రొత్సహించడానికి, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్‌కు ప్రభుత్వం తీసుకుంటున్న పలు విశేషమైన చర్యలను గురించి వివరించారు. భారత ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ బీఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ కొత్త మిషన్‌లోని నవ ఆవిష్కరణలను ఆయన ప్రధానంగా తెలియజేశారు.
తేనెటీగల పెంపకందారుల సమస్యలపై చర్చ..
తేనెటీగల పెంపకందారుల ముందున్న సమస్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఇందులో శాస్త్రీయ తేనెటీగల పెంపకం, నాణ్యత హామీ, కనీస మద్దతు ధర, తేనెటీగ కోలనీల రవాణా, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, పరీక్ష, తేనె యొక్క సేంద్రీయ ధ్రువీకరణ మరియు వివిధ తేనెటీగల ఉత్పత్తులకు సంబంధించిన వివిధ సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు. కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, బీహార్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ర్టాలలో మేటిగా విజయవంతమైన తేనెటీగల పెంపకందారులు మరియు పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశంలో తమ అనుభవాలను పంచుకున్నారు. స్వీట్ రివల్యూషన్‌ను తీసుకురావడానికి ముందుకు వెళ్ళే మార్గాలను సూచించారు.
చిన్న రైతులకు జీవనోపాధిగా శాస్త్రీయ తేనెటీగల పెంపకం..
"స్వీట్ రివల్యూషన్ మరియు ఆత్మ నిర్భర్ భారత్" అనే అంశంపై ఎన్‌సీడీసీ గురువారం ఒక వెబ్‌నార్‌ను నిర్వహించింది. నేషనల్ బీ బోర్డు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు షేర్-ఇ-కాశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వారి భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఆదాయానికి అనుబంధంగా భూమి లేని గ్రామీణ పేదలు, చిన్న మరియు సన్నకారు రైతుల జీవనోపాధికి గాను శాస్త్రీయ తేనెటీగల పెంపకానికి ప్రాచుర్యం పెంపొందించడం, అలాగే వ్యవసాయం మరియు ఉద్యానవన ఉత్పత్తిని పెంచేందుకు దీనికి ఒక సాధనంగా మార్చేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను గురించి ఇందులో ప్రాధానంగా చర్చించారు. ఇది తేనెటీగల పెంపకందారులు, తేనె ప్రాసెసర్లు, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ నిపుణులు, పరిశోధనా పండితులు, విద్యావేత్తలు, ప్రధానంగా తేనెను ఉత్పత్తి చేసే రాష్ట్రాల సహకారులు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ఎఫ్ఏఓ మరియు బ్యాంకాక్ నగరానికి చెందిన ఎన్ఈడీఏసీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(Release ID: 1626235)
Visitor Counter : 474