ఆర్థిక సంఘం
ఆరోగ్య రంగంపై నియమించిన అత్యున్నత స్థాయి బృందంతో గురువారం సమావేశం కానున్న 15వ ఆర్థిక సంఘం
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్న ఆర్థిక సంఘం
Posted On:
20 MAY 2020 4:33PM by PIB Hyderabad
15వ ఆర్థిక సంఘం, ఆరోగ్య రంగంపై నియమించిన అత్యున్నత స్థాయి బృందం (హెచ్‌ఎల్‌జీ)తో వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా రేపు (గురువారం) సమావేశం నిర్వహించనుంది.
అత్యున్నత స్థాయి బృందాన్ని 2018, మే లో 15వ ఆర్థిక సంఘం నియమించింది. ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలో ఆరోగ్య రంగ నిపుణులతో ఇది ఏర్పాటైంది. దేశ ఆరోగ్య రంగంపై తమ తుది నివేదికను ఈ బృందం 2019, ఆగస్టులో సమర్పించింది. ఈ నివేదికలోని కొన్ని కీలక సిఫారసులను, 2020-21 సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన మొదటి నివేదికలో పొందుపరిచారు. దేశంలో కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా, హెచ్‌ఎల్‌జీని పునరుద్ధరిస్తూ 15వ ఆర్థిక సంఘం నిర్ణయించింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా, గతంలో చేసిన సిఫారసులను పునఃసమీక్షించాలని హెచ్‌ఎల్‌జీని 15వ ఆర్థిక సంఘం కోరింది. వైద్య మౌలిక సదుపాయాల ( ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్య పరికరాలు, పీపీఈలు మొ.) కొరత దృష్ట్యా.., 2021-22 నుంచి 2025-25 సంవత్సరాల వరకు వైద్య సిబ్బంది ( మెడికల్, పారామెడికల్), వనరుల లభ్యతను పునఃమదింపు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాలకు నిధులు సమకూర్చడంతోపాటు, ప్రైవేటు రంగం పాత్రను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
గత బృందంలోని సభ్యులు.. ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా; నారాయణ హెల్త్ సిటీ ఛైర్మన్ డా. దేవి షెట్టి; మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వైస్ ఛాన్సులర్ డా. దిలీప్ గోవింద్; డా. నరేష్ త్రెహాన్, మేదాంత సిటీ; ఆర్.జీ. కర్ మెడికల్ కాలేజీ కార్డియో థొరాసిస్ సర్జరీ హెచ్‌వోడీ డా.బాబాతోష్ బిస్వాస్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ప్రొ.శ్రీనాథ్‌రెడ్డి తోపాటు, దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ డైరెక్టర్ డా.సరీన్, మహాజన్ ఇమేజింగ్ వ్యవస్థాపకుడు డా. హర్ష్ మహాజన్‌ను కొత్తగా బృందంలో చేర్చారు.
బ్రూకింగ్స్ ఇండియాలో పరిశోధన విభాగం డైరెక్టర్ ప్రొ.షమిక రవి, రేపటి (గురువారం) సమావేశంలో, కరోనా వైరస్ ప్రవర్తన తీరును క్షుణ్నంగా వివరిస్తూ ప్రదర్శన ఇస్తారు. ఎంపీ, పార్లమెంటరీ ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా కూడా సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన కొన్ని పరిశోధన ప్రయత్నాలను 15వ ఆర్థిక సంఘం గుర్తించింది. రాష్ట్రాల కోసం కేంద్రం ప్రకటించిన రూ.15 వేల కోట్ల ప్యాకేజీ క్షేత్రస్థాయి నుంచి పెట్టుబడులను పెంచుతుంది. జిల్లా ఆస్పత్రులు, ప్రజా ఆరోగ్య పరిశోధన కేంద్రాల్లో అంటువ్యాధి బ్లాకులు ఏర్పాటు చేయడానికి తోడ్పడుతుంది. చేపట్టాల్సిన చర్యల్లో ఇవే మొదటి ముఖ్యమైన దశలు.
(Release ID: 1625541)
Visitor Counter : 260