మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ స్ఫూర్తిని కొనసాగిస్తున్న గువాహటి ట్రిపుల్‌ ఐటీ

"రాజస్థాన్‌ టూరిజం అండ్‌ ట్రావెల్స్‌" అంశంపై పోస్టర్ల తయారీ పోటీ నిర్వహణ
ఆన్‌లైన్‌ ద్వారా ఇళ్ల నుంచే పోటీలో పాల్గొన్న విద్యార్థులు

Posted On: 12 MAY 2020 6:09PM by PIB Hyderabad


    భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం స్ఫూర్తిని దేశవ్యాప్తంగా జరుపుకునేందుకు, ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ (ఈబీఎస్‌బీ) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి నోడల్‌ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. మరికొన్ని శాఖలు, రాష్ట్రాలతో కలిసి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ ఈబీఎస్‌బీని కొనసాగించేందుకు గువాహటి ట్రిపుల్‌ ఐటీ పోస్టర్‌ తయారీ పోటీని ఇటీవల నిర్వహించింది. విద్యార్థులు ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌ ద్వారా పోటీలో పాల్గొనాలని సూచించింది. "రాజస్థాన్‌ టూరిజం అండ్‌ ట్రావెల్స్‌"ను పోటీ అంశంగా నిర్ణయించి, పోస్టర్లు రూపొందించాలని చెప్పింది. 

 

    లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థ కార్యకలాపాలు చాలావరకు ఆగిపోయి విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయారు. ఈబీఎస్‌బీ నిర్వహణపైనా ఆ ప్రభావం పడింది. అయినా, ఈబీఎస్‌బీకి సంబంధించిన ఏప్రిల్‌ నెల కార్యక్రమాన్ని మే 1వ తేదీన ట్రిపుల్‌ ఐటీ నిర్వహించింది. విద్యార్థుల్లో రాజస్థాన్‌పై అవగాహన పెంచడానికి ఈబీఎస్‌బీ కింద ఈ పోటీని ఏర్పాటు చేసింది.

 

    గువాహటి ట్రిపుల్‌ ఐటీకి చెందిన 'కల్రావ్‌-లిటెరరీ క్లబ్‌' విద్యార్థులు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న, క్లబ్‌లో చురుకైన సభ్యులైన మేఘన సింగ్‌, ప్రియాంక కుమారి ఆన్‌లైన్‌ పోటీ నిర్వహణకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ పోటీని చేతితో తయారీ, డిజిటల్‌ అనే రెండు విభాగాల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 14 మంది (డిజిటల్‌ విభాగంలో తొమ్మిది మంది, చేతితో తయారీ విభాగంలో ఐదుగురు) తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో పోటీలో పాల్గొన్నారు.

    డిజిటల్‌ విభాగంలో పోటీలో పాల్గొన్నవారు అతిక్‌‌ కె.ఎన్‌., జి.ప్రణయ్‌, ప్రియాంక కుమారి, అమితేష్‌ కుమార్‌, గుర్నూర్‌ సింగ్‌, ప్రియంరాజ్‌, రిచా, సాయికుమార్‌ మేధ, ఉత్కర్ష్‌ కుమార్‌. చేతితో పోస్టర్‌ తయారీ విభాగంలో పాల్గొన్నవారు జె.పూజిత, రోహిత్‌ జైన్‌, సాయంతాని దత్తా, జైషు యాదవ్‌, అనన్య. ఆకృతి‌, ఇతివృత్తం, సృజనాత్మకత, వాస్తవికత ఆధారంగా విజేతలను నిర్ణయించారు. అసాధారణ పోస్టర్లు ట్రిపుల్‌ ఐటీకి చేరాయి. రాజస్థాన్‌ అందాలను వర్ణిస్తూ విద్యార్థులు చాలా కష్టపడి అద్భుతమైన పోస్టర్లను ఆవిష్కరించారు.


    డిజిటల్‌ పోస్టర్‌ విభాగంలో అతిక్‌ కమలేశ్వర్‌ దాస్‌ మొదటి బహుమతి,  జి.ప్రణయ్ రెండో బహుమతి, ప్రియాంక కుమారి మూడో బహుమతి పొందారు. చేతితో తయారీ విభాగంలో జె.పూజిత, రోహిత్‌ జైన్‌ మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు.

***



(Release ID: 1623401) Visitor Counter : 293