శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మానవ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అభివృద్ధి ప్రాజెక్టుకు అనుమతి
రోగులలో సార్స్ కోవ్-2 ను తటస్థీకరించేందుకు ప్రయోగాలు
ఎన్‌ఎంఐటీఎల్‌ఐ పథకం ద్వారా అనుమతి మంజూరు చేసిన సీఎస్‌ఐఆర్
ప్రాజెక్టు అమల్లో భాగస్వాములుగా ప్రఖ్యాత సంస్థలు
వాణిజ్య భాగస్వామిగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
Posted On:
08 MAY 2020 7:58PM by PIB Hyderabad
బహుముఖ విధానాలు, బహుళ నమూనాలను అవలంబిస్తూ, కొవిడ్-19పై పోరాటానికి సీఎస్‌ఐఆర్ నాయకత్వం వహిస్తోంది. సీఎస్‌ఐఆర్‌కు చెందిన ప్రయోగశాలలు కూడా సరికొత్త సాంకేతికతలను, ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయి. సమాజ అభివృద్ధి కోసం పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. సీఎస్‌ఐఆర్ కూడా, "న్యూ మిలీనియం ఇండియన్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఇన్నోవేటివ్" (ఎన్‌ఎంఐటీఎల్‌ఐ) పథకం కింద, ఇతర విద్య, పరిశ్రమల నుంచి కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది.
కొవిడ్-19 పై యుద్ధంలో అమలు చేస్తున్న బహుళ వ్యూహాల్లో భాగంగా, మానవ మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు సీఎస్‌ఐఆర్ అనుమతిచ్చింది. రోగులలో సార్స్ కోవ్-2 ను తటస్థీకరించేందుకు ఈ ప్రాజెక్టు ప్రయోగాలు చేస్తుంది. ఎన్‌ఎంఐటీఎల్‌ఐ పథకం కింద ఈప్రాజెక్టుకు సీఎస్‌ఐఆర్ అనుమతి లభించింది. మానవ మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను (hmAbs) తటస్థీకరించే ఉత్పత్తిని చికిత్సా వ్యూహంగా ఈ ప్రాజెక్టులో అమలు చేస్తారు. బహుళ సంస్థాగత, క్రమశిక్షణ బృందం ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. విద్యాసంస్థలు, ఎన్‌సీసీఎస్, ఇండోర్ ఐఐటీ, ప్రెడ్‌వోమిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ప్రతినిధులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు.
కొవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల నుంచి సార్స్ కోవ్-2ను ఎదుర్కొనే యాంటీబాడీస్‌ను సేకరించడంతోపాటు.. అధిక బంధాన్ని, తటస్థీకరించే యాంటీబాడీస్‌ను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. భవిష్యత్తులో వైరస్ మార్పులను ముందే ఊహించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరివర్తన చెందిన వైరస్‌ను తటస్థం చేయగల యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా భవిష్యత్ సార్స్ కోవ్ ఇన్ఫెక్షన్లను తక్షణం ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండేలా చేయడం ప్రాజెక్టు ఉద్దేశం. బీబీఐఎల్ ఈ ప్రాజెక్టుకు వాణిజ్య భాగస్వామిగా ఉంటుంది. ఉత్పత్తి చేసిన యాంటీబాడీస్ తదుపరి అభివృద్ధి, వాణిజ్యీకరణకు బాధ్యత వహిస్తుంది.
సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డా. శేఖర్ సి. మండే మాట్లాడుతూ, "సార్స్ కోవ్-2 పై పరిశోధన ప్రారంభ రోజుల్లో ఉంది. ప్రతిరోజు మా అవగాహన పెరుగుతోంది. వైరస్ ఎదుర్కోవటానికి అన్ని వ్యూహాలను మేం అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల, సీఎస్‌ఐఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. స్పష్టమైన విస్తరణ వ్యూహాన్ని కలిగిన కొత్త ఆలోచనలకు మేం మద్దతు ఇస్తున్నాం ” అని చెప్పారు.
(Release ID: 1622324)
Visitor Counter : 285