ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వీడియో కాన్ఫరెన్సు ద్వారా పౌర సమాజ సంస్థలు / ప్రభుత్వేతర స్వచ్ఛంధ సంస్థలతో డాక్టర్ హర్షవర్ధన్ చర్చలు

కోవిడ్ -19 మహమ్మారి అట కట్టించడానికి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఐకమత్యంతో సమష్టిగా కృషి చేయాలి: డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 30 APR 2020 5:20PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ,  నీతి  ఆయోగ్ సిఈఓ శ్రీ అమితాబ్ కాంత్ తో కలసి పౌర సమాజ సంస్థలు  మరియు ఎన్ జీ ఓ  దర్పణ్ లో నమోదు చేసుకున్న స్వచ్ఛంధ  సంస్థలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా  కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించి వారి సూచనలను ఆహ్వానించారు.  

సమాజంలోని వివిధ వర్గాల వారికి ఈ కష్టకాలంలో ఆహారం తదితర అవసరాలు తీర్చేందుకు నిస్వార్ధ సేవ చేస్తున్న 92,000 ఎన్ జీ ఓలను ప్రధానమంత్రి,  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున డాక్టర్ హర్షవర్ధన్  కృతజ్ఞతలు తెలిపారు.    కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో ఈ సంస్థల తోడ్పాటు కీలకమని ఆయన ప్రశంసించారు.   ఈ సంస్థలు చేస్తున్న సేవ ఎంతో ఘన మైనదని, ఇది ఇతరులకు  స్ఫూర్తిదాయకంగా నిలిచి వారిలో సేవాభావాన్ని పెంపొందించి సహాయం చేయడానికి ముందుకు వచ్చేలా చేస్తుందని మంత్రి అన్నారు.  

కోవిద్-19 మహమ్మారిని అదుపు చేసేందుకు ప్రభుత్వ యత్నాల క్రమాన్ని డాక్టర్ హర్షవర్ధన్ కాన్ఫరెన్సుకు హాజరైన వారికి తెలిపారు.   కోవిద్-19ను ఎదుర్కొనేందుకు జాతీయ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలసి ఆరోంభంలోనే వ్యూహాన్ని రూపొందించిన దేశాలలో ఇండియా ఒకటని ఆయన తెలిపారు.     భారత ప్రభుత్వం ముందుగానే కార్యాచరణ రూపొందించుకున్నదని,    క్రియాశీలకంగా వ్యవహరించి, పరిస్థితికి అనుగుణంగా తీవ్రత పెంచిందని అన్నారు.  

ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యలను వెల్లడిస్తూ కోవిద్-19 అదుపు చేయడానికి ప్రత్యేకంగా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు,మార్గదర్శకాలు జారీచేయడంతో పాటు  ఆరోగ్య మౌలిక  సదుపాయాలను పెంచడం, సంరక్షణ సాధనాలు సమకూర్చడం, దేశంలోకి వచ్చే ప్రయాణీకులను పరీక్షించడం,   సామాజిక నిఘా / పర్యవేక్షణ,  సత్వర స్పందన బృందాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.  అంతేకాక ఆరోగ్య సేతు యాప్ ప్రారంభించడం,  సమాజంలోని దుర్బల వర్గాల వారి కోసం  ఆర్ధిక ప్యాకేజీ -- ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన -- ప్రకటించడాన్నీ గురించి ఆయన ఉద్ఘాటించారు.   హోమ్ మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల వల్ల వలస కూలీల సమస్య కూడా పరిష్కారం కాగలదని అన్నారు.  

 
తొలుత జనతా కర్ఫ్యూ ద్వారా ప్రజలను సంసిద్ధులను చేసి ఆ తరువాత స్థాయిని పెంచి లాక్ డౌన్ ప్రకటించినందుకు డాక్టర్ హర్షవర్ధన్  ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.  లాక్ డౌన్ వాళ్ళ సానుకూల పరిణామాలు సంభవించాయని మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజల కష్టాలు తీర్చడంలో ఎన్జీఓల ప్రయత్నాలను డాక్టర్ హర్షవర్ధన్ ప్రశంసించారు.  ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు మమేకమై సమన్వయంతో ఉత్సాహంగా పనిచేసినందుకు ఆయన ప్రశంసించారు.  క్షేత్ర స్థాయిలో  ఎన్జీవోల కృషి వల్ల కోవిడ్ -19 రోగులను ,  వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు,  వైద్య సిబ్బందిని  అపనిందల నుంచి,  సామాజిక వెలినుంచి కాపాడ గలిగారని అన్నారు.   ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చే వలస కూలీలను కూడా ఎన్జీఓలు కాపాడాలని మంత్రి పిలుపు ఇచ్చారు.  

ఆ తరువాత మాట్లాడిన ఎన్జీఓ  సంస్థల ప్రతినిధులు నీతి ఆయోగ్ అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.   మందుల కొరత, కొన్ని జిల్లాల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన సదుపాయాలు లేకపోవడం,  మహిళల సమస్యలు,  పౌష్టికాహార లోపం, ఆహార భద్రత,  లాక్ డౌన్ సమయంలో ఎన్జీవోల కార్యకర్తల కదలికలో ఇబ్బందుల వంటి సమస్యల గురించి వారు  ప్రస్తావించారు.   అంటువ్యాధుల గురించిన భయాన్ని ప్రజల్లో పోగొట్టాలని, లాక్ డౌన్ తరువాత ఆర్ధిక కార్యకలాపాలు మొదలయ్యాక  ఎం ఎస్ ఎం ఈ లకు ఆర్ధిక తోడ్పాటును అందించాలని వారు కేంద్ర ఆరోగ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు.  

అన్నిరకాల సహాయం అందిస్తామని డాక్టర్ హర్షవర్ధన్ వారికి హామీ ఇచ్చారు. జిల్లాల వర్గీకరణ వల్ల ఎన్జీఓ సంస్థలు ప్రాధాన్యతా క్రమంలో పని చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు.   కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటంలో ఎదురవుతున్న సమస్యలను,  తమ ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పడు తేవాలని మంత్రి వారిని కోరారు.   సామాజిక మాధ్యమం  ట్విట్టర్ హ్యాండిల్  @CovidIndiaSeva   ద్వారా గాని,  ఇతర మాధ్యమాల ద్వారా గాని  తమ అభిప్రాయాలను తెలియాజేయాలని అన్నారు.      

మంత్రిత్వ శాఖ జారీ చేసే సరళమైన మార్గదర్శకాలను పాటించాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్కులు ధరించడం,   విపత్తుకు లోనయ్యే అవకాశం ఉన్న వారిని సంరక్షించడం,  ఇంటి నుంచి పనిచేయడం, లాక్ డౌన్ నియమాలు,  సామాజిక దూరం వంటి నియమాలను ఆచరించాలని ఆయన ఉద్ఘాటించారు.     కోవిడ్ -19ను అదుపు చేయడంలో  సామాజిక దూరం,  లాక్ డౌన్  సమర్ధవంతమైన సామాజిక వ్యాక్సిన్ వంటివని మంత్రి అన్నారు.  
కోవిడ్ -19 గురించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు,  సూచనల వంటి  తాజా అధికార సమాచారం కోసం https://www.mohfw.gov.in/  వెబ్సైట్ చూడవచ్చు.  ఈ వెబ్సైట్ ను  రోజుకు రెండుసార్లు  తాజాపరుస్తారని ఆయన తెలిపారు.    
 

 ఈ సమావేశానికి హాజరై విలువైన సూచనలు ఇచ్చినందుకు డాక్టర్ హర్షవర్ధన్ కు,  పౌర సమాజ సంస్థలు  మరియు ఎన్ జీ ఓ సంస్థల ప్రతినిధులకు నీతి  ఆయోగ్ సిఈఓ శ్రీ అమితాబ్ కాంత్  కృతజ్ఞతలు తెలిపారు.    



(Release ID: 1619796) Visitor Counter : 137