రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత సైన్యం దాడిలో ఐదుగురు పాక్ మద్దతు గల ఉగ్రవాదుల వధ

Posted On: 06 APR 2020 6:10PM by PIB Hyderabad

భారీగా మంచు పడుతున్నా లెక్క చేయకుండా భారత సైన్యం వాస్తవాధీన రేఖ వద్ద సాహసోపేతంగా దాడి చేసి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఐదుగురు పాక్ మద్దతు గల ఉగ్రవాదుల ప్రయత్నాలు విఫలం చేసింది.

కొందరు చొరబాటుదారులు ఆ ప్రాంతంలో కదలాడుతున్నారన్న సమాచారం అందడంతోనే నిపుణుడైన పారా ఎస్ఎఫ్ యూనిట్ కు చెందిన ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ కమాండ్ లో  సైనికులను హెలీకాప్టర్లలో తరలించారు. సరిహద్దులో ఉభయ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ప్రత్యక్ష పోరాటం జరిగిన అనంతరం ఆ ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.

ఈ పోరాటంలో భారత సైన్యం కూడా ఐదుగురు సైనికులను కోల్పోయింది. ముగ్గురు దాడి జరిగిన ప్రాంతంలోనే మరణించగా ఇద్దరు సమీపంలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించిన అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 

సుబేదార్ సంజీవ్ కుమార్ సారథ్యంలో ఆ ప్రాంతానికి తరలించిన భారత ప్రత్యేక సైనిక దళాల్లో హవల్దార్ దవేంద్ర సింగ్, పారాట్రూపర్ బాలక్రిష్ణన్, పారాట్రూపర్ అమిత్ కుమార్, పారాట్రూపర్ ఛత్రపాల్ సింగ్ ఉన్నారు.

ఈ దాడిలో మరణించిన సాహసోపేతులైన సైనికులకు భారత సైన్యం గౌరవ వందనం చేసింది. శత్రు సేనల నుంచి భారత సరిహద్దులను కాపాడుతూనే ఉంటామని మరోసారి ప్రతిజ్ఞ చేసింది.
కల్నల్ ఆమన్ ఆనంద్
పిఆర్ఓ (ఆర్మీ)

 


(Release ID: 1611858) Visitor Counter : 132


Read this release in: English , Marathi , Hindi , Tamil