శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్ర-సాంకేతిక సలహాదారు పత్రికా ప్రకటన


కోవిడ్‌-19పై శాస్త్ర-సాంకేతిక, ఆవిష్కరణాత్మక స్పందన తాజా సమాచారం

Posted On: 30 MAR 2020 7:22PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై ప్రతిస్పందన కోసం శాస్త్ర-సాంకేతిక సాధికార కమిటీ ఒకటి 19 మార్చి 2020న ఏర్పాటైంది. దీనికి నీతి ఆయోగ్‌ సభ్యులుగా ఉన్న ప్రొఫెసర్‌ వినోద్‌ పాల్‌, కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర-సాంకేతిక సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్‌ కె.విజయ రాఘవన్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఐదు కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతోపాటు ‘డీఆర్‌డీవో, ఐసీఎంఆర్‌, ఎస్‌ఈఆర్‌బీ’ సంస్థల కార్యదర్శులు, ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌, భారత డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ సభ్యులుగా ఉన్నారు. శాస్త్రవిజ్ఞాన సంస్థలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, నియంత్రణ సంస్థలు తదితరాలతో సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ బాధ్యత. అంతేకాకుండా పరిశోధన-అభివృద్ధిపై వేగంగా నిర్ణయాలు తీసుకుని సార్స్‌-కరోనావైరస్‌-2, కోవిడ్‌-19 వ్యాధి సంబంధిత కార్యాచరణ అమలయ్యేలా చూడాలి.

   ఈ మేరకు కమిటీ ఇప్పటికే శాస్త్రీయ పరిష్కార చర్యల అమలులో వేగంగా పనిచేస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల సదుపాయాల పెంపు దిశగా ఆరు ప్రధాన శాస్త్ర-సాంకేతిక సంస్థల పరిధిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల ప్రయోగశాల సౌకర్యాలపై స్వీయ అంచనాలతో వాటిని సంసిద్ధం చేసే బాధ్యతను అప్పగించింది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖతోపాటు భారత వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్‌ నిర్దేశిత కఠిన-ప్రామాణిక పద్ధతుల్లో హైదరాబాద్‌లోని సీసీఎంబీసహా సదరు సంస్థలు ఈ పరీక్షలు నిర్వహిస్తాయి. అలాగే భారీ స్థాయిలో కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల నిర్వహణ, రక్తద్రవ విశ్లేషణల దిశగా ప్రైవేటు రంగంతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన శాస్త్రీయ సంస్థలు కింద పేర్కొన్న పలు ప్రాజెక్టులపై సంయుక్త కృషికి సిద్ధమయ్యాయి:

  1. వివిధ ఔష‌ధాల భిన్న వినియోగం త‌ల‌పెట్టిన నేప‌థ్యంలో వీటి నిర్ధార‌ణ‌కు ఏర్పాటైన కార్యాచ‌ర‌ణ బృందం ఇప్ప‌టికే  లోతైన సమాచార సేక‌ర‌ణ ప్రారంభించింది. దీన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు తగిన నియంత్రణ/చట్టపరమైన ప్రక్రియలు సిద్ధ‌మ‌వుతున్నాయి.

  2. వ్యాధి వ్యాప్తిని ప‌సిగ‌ట్టేందుకు గణితశాస్త్రీయ‌ నమూనాలు, కోవిడ్‌-19 కోసం వైద్య ప‌రిక‌రాలు, అనుబంధ అవ‌స‌రాల‌కు త‌గిన న‌మూనాల రూప‌క‌ల్ప‌న‌.

  3. దేశీయంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్లు, కృత్రిమశ్వాస కల్పన యంత్రాల తయారీ.

****



(Release ID: 1609436) Visitor Counter : 142