వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మీ సిబ్బంది, కార్మికులను వదిలిపెట్టవద్దు: పారిశ్రామిక వర్తక సంఘాలకు శ్రీ పియూష్ గోయల్ సూచన సామజిక దూరం సందేశాన్ని వ్యాప్తి చేయమనండి
Posted On:
28 MAR 2020 5:52PM by PIB Hyderabad
సంక్షోభ-దుఃఖ సమయంలో తమ ఉద్యోగులు, కార్మికులను జాగ్రత్తగా చూసుకోవాలని రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ పరిశ్రమ మరియు వాణిజ్య సంఘాలతో అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న తయారీ రంగం, పరిశ్రమ మరియు వాణిజ్య సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వారిని మూకుమ్మడిగా వలస వెళ్ళడానికి అనుమతిస్తే, దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్-19 వ్యాపించడానికి వీరంతా మూల వనరులవుతారని, కరోనాకు వాహకాలుగా మారవచ్చని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
రసాయనాలు, ఎరువులు, షిప్పింగ్ (ఇంఛార్జి) సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా, విసిలో కూడా ఉన్నారు, కార్మిక ఉద్యోగులను పేరోల్‌లో మరియు అదే స్థలంలో ఉంచాలని నొక్కి చెప్పారు. వారి కదలిక దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దెబ్బతీస్తుందని, సాధారణ స్థితి రావడానికి పట్టే కాలంపై ప్రభావం చూపెడతుందని ఆయన అన్నారు.సేవా స్ఫూర్తిని, నిస్వార్థతను చూపించాలని, దేశాన్ని, సమాజాన్ని సురక్షితంగా ఉంచడంలో అందరు భాగస్వాములు కావాలని శ్రీ పియూష్ గోయల్ నొక్కి చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఉపశమనం, విశ్వాసం పెంపొందించే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన సందేశాన్ని మీ వ్యవస్థల భాగస్వామ్యుల సహకారంతో వ్యాప్తి చేయాలి అని శ్రీ గోయల్ పిలుపునిచ్చారు. సమాజంలో వారి చర్యలు మంచి ప్రభావం చూపాలని అన్నారు. వివిధ ధర్మాలకు చెందిన ప్రముఖులు కూడా దీనిలో పాలుపంచుకునేలా చేయాలని చెప్పారు. కరోనా నియంత్రణ చర్యలైన చేతుల పరిశుభ్రత, సామజిక దూరం ఇతర ఆరోగ్య జాగ్రత్తలపై చైతన్యవంతులను చేయాలన్నారు. సదస్సులో లేవనెత్తిన వివిధ సమస్యలపై స్పందించిన శ్రీ పియూష్ గోయల్, దేశంలో సరకు రవాణాకు ఇబ్బంది కలిగించవద్దని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పూర్తిస్థాయిలో అప్రమత్త చర్యలు, సరైన సామాజిక దూరం ఉన్నప్పటికీ, అత్యవసర సేవలు మరియు కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
అనేక పరిశ్రమలు తమ ఉద్యోగులు, కార్మికులను కష్టాల్లో ఆదుకోవడంలో, మరియు అత్యవసర వస్తువుల సామర్థ్యాన్ని, ముఖ్యంగా వెంటిలేటర్లను పెంచడంలో, కొన్ని సామజిక వంటశాలలు నడపడానికి తమ ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడంలో తీసుకుంటున్న చొరవను ఆయన ప్రశంసించారు.ఇతర శాఖలకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించిన పరిశ్రమల సూచనలు, సమస్యలను ఆయా శాఖలతో సమీక్షించి తగు పరిష్కార మార్గాలను యోచిస్తామని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. కోవిడ్ తర్వాత పరిస్థితిపై కొందరు లేవనెత్తిన అంశాలపై శ్రీ గోయల్ స్పందిస్తూ ఈ కనీ విని ఎరుగని సంక్షోభం నుండి మరింత శక్తివంతంగా బయటపడతామనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
లాక్ డౌన్, కోవిడ్-19 ప్రభావం ఎలా ఉందొ అంచనా వేయడానికి, పరిశ్రమలు, వాణిజ్య, వర్తక సంస్థల ప్రతిస్పందన తెలుసుకోడానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా పరిశ్రమ సలహాలు సూచనలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పరిశ్రమలు శాఖ సహాయ మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పురి, శ్రీ సోమ్ ప్రకాష్ వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ అనూప్ వాధవాన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్ డి ఛాంబర్ అఫ్ కామర్స్, లఘు ఉద్యోగ్ భారతి, ఈస్టర్న్ ఛాంబర్ అఫ్ కామర్స్, సిఏఐటి, దక్షిణ భారత ఛాంబర్ అఫ్ కామర్స్, ఐఎంసి, నాస్కామ్, ఎస్ఐఏఎం, ఐఎంటిఏ, ఐఈఎంఏ, ఎఫ్ఐఎస్ఎంఈ, ఐఈఈఎంఏ, ఐసిసి కి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
(Release ID: 1608929)
Visitor Counter : 117