మంత్రిమండలి

ఎలక్ర్టానిక్ విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక స్కీమ్ కు కేబినెట్ ఆమోదం

Posted On: 21 MAR 2020 4:30PM by PIB Hyderabad

ఎలక్ర్టానిక్ విడిభాగాలు, సెమీకండక్టర్ల (స్పెక్స్) తయారీ ప్రోత్సాహక స్కీమ్ కింద ఎలక్ర్టానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరం అయిన సరఫరా వ్యవస్థలతో కూడిన ఎలక్ర్టానిక్ వస్తూత్పత్తి యూనిట్ల పెట్టుబడి వ్యయంలో 25 శాతం ఆర్థిక ప్రోత్సాహకం అందించే స్కీమ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 
దేశంలో ఎలక్ర్టానిక్స్ తయారీ వాతావరణం మరింతగా బలోపేతం చేయడం కోసం ఎలక్ర్టానిక్ విడిభాగాలు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలోని బలహీనతలను తొలగించడానికి ఈ స్కీమ్ సహాయపడుతుంది.
ఆర్థిక భారం
ఈ స్కీమ్ మొత్తం పెట్టుబడి రూ.3285 కోట్లు. అందులో ప్రోత్సాహకాల పెట్టుబడి రూ.3252 కోట్లు కాగా పాలనాపరమైన వ్యయాల వాటా రూ.32 కోట్లు.
ప్రయోజనాలు...
i. ఈ ప్రతిపాదన అమలులోకి వచ్చినట్టయితే దేశంలో ఎలక్ర్టానిక్ పరికరాల తయారీ వాతావరణం అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఈ దిగువ ప్రయోజనాలుంటాయి...
ii. ఎలక్ర్టానిక్ విడిభాగాల తయారీ వాతావరణం అభివృద్ధి కావడంతో పాటు ఎలక్ర్టానిక్స్ విలువ ఆధారిత వ్యవస్థ మరింత లోతుగా పాతుకుంటుంది.
iii. ఎలక్ర్టానిక్స్ రంగంలోకి కనీసం రూ.20 వేల కోట్ల కొత్త పెట్టుబడులు వస్తాయి.
iv. పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ స్కీమ్ అమలు నాటికి సుమారు లక్షన్నర ఉద్యోగావకాశాలు రావడంతో పాటు మూడు రెట్ల పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. అంటే మొత్తం ఆరు లక్షల కొత్త ఉపాధి అవకాశాలు కల్పించగల సామర్థ్యం దీనికి ఉంది.     
v.దేశీయ ఎలక్ర్టానిక్స్ తయారీ పరిశ్రమ విడిభాగాల దిగుమతిపై ఆధారపడడం తగ్గుతుంది. డిజిటల్ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది.
పూర్వాపరాలు...
కీలకమైన విడిభాగాలు, చిప్ సెట్ల తయారీ సామర్థ్యాలు విస్తరించడంతో పాటు ఎలక్ర్టానిక్స్ సిస్టమ్ డిజైన్, తయారీకి (ఇఎస్ డిఎం) భారతదేశం కేంద్రంగా అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహించడం, ఆయా విభాగాల్లో దేశం పోటీ సామర్థ్యాలు పెంచడానికి అనుకూలమైన వాతావరణం అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2019 ఫిబ్రవరి 25వ తేదీన జాతీయ ఎలక్ర్టానిక్స్ విధానం 2019 ప్రకటించారు.     
ఎలక్ర్టానిక్స్ తయారీ రంగం స్థిరమైన దీర్ఘకాలిక అభివృద్ధి సాధించాలన్నా, విదేశీ రుణ చెల్లింపులు (బిఓపి) నికరంగా సానుకూలంగా మారాలన్నా అందుకు అనుకూలమైన విస్తారమైన ఎలక్ర్టానిక్ విడిభాగాల తయారీ వాతావరణం అభివృద్ధి కావడం చాలా కీలకం.
ఈ లక్ష్యాలు సాధించాలంటే ఎలక్ర్టానిక్ విడిభాగాలు, సెమీ కండక్టర్లు, ఎటిఎంపి, స్పెషలైజ్డ్ సబ్ అసెంబ్లీలు, ఇవన్నీ తయారుచేయడానికి కావలసిన యంత్రపరికరాల ఉత్పత్తికి అవసరమైన ప్లాంట్లు, యంత్రపరికరాలు, ఇతర పరికరాలు, అవసరం అయిన యుటిలిటీలు, టెక్నాలజీ సమకూర్చుకోవడానికి పరిశోధన, అభివృద్ధి సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుఉ పారిశ్రామిక యూనిట్లకు పెట్టుబడి వ్యయాలపై 25 శాతం ప్రోత్సాహకాలు అందించాలని ప్రతిపాదించారు. మొబైల్ ఎలక్ర్టానిక్స్, కన్యూమర్ ఎలక్ర్టానిక్స్, ఇండస్ర్టియల్ ఎలక్ర్టానిక్స్, ఆటోమోటివ్ ఎలక్ర్టానిక్స్, మెడికల్ ఎలక్ర్టానిక్స్, స్ర్టాటజిక్ ఎలక్ర్టానిక్స్, పవర్ ఎలక్ర్టానిక్స్, టెలికాం పరికరాలు, కంప్యూటర్ హర్డ్ వేర్ వంటి అన్ని రకాల ఎలక్ర్టానిక్స్ విభాగాల అవసరాలను ఇది తీర్చుతుంది.
 



(Release ID: 1607591) Visitor Counter : 193