రైల్వే మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 నిరోధానికి చేపట్టిన అదనపు చర్యలపై భారతీయ రైల్వేల ప్రకటన

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి నిరోధం దిశగా కింద పేర్కొన్న విధంగా తాము చేపట్టిన అదనపు చర్యలను భారతీయ రైల్వేశాఖ ప్రకటించింది:

प्रविष्टि तिथि: 19 MAR 2020 3:42PM by PIB Hyderabad
  1. అనవసర ప్రయాణ నిరోధంతోపాటు దుర్బ‌ల‌వ‌ర్గంలోని వృద్ధ‌పౌరుల అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌ను నిరుత్సాహ‌ప‌రిచేందుకు అన్నిర‌కాల రాయితీ టికెట్ల బుకింగ్‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అయితే- రోగులు, విద్యార్థులుస‌హా రిజర్వుడు, అన్ రిజ‌ర్వుడు వ‌ర్గాల్లోని  దివ్యాంగుల‌కు రాయితీ బుకింగ్ కొన‌సాగుతుంది. మార్చి 20వ తేదీ అర్ధ‌రాత్రి 12:00 గంట‌ల నుంచి అమ‌లులోకి రానున్న ఈ ఉత్త‌ర్వులు త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేదాకా కొన‌సాగుతాయి.
  2. ముందుజాగ్రత్త చర్యగానూ, అవసరంలేని ప్రయాణ నిరోధంతోపాటు రైలుమార్గాల్లో రద్దీని తగ్గించడంకోసం స్వల్ప ప్రయాణిక రద్దీగల 155 జతల రైళ్లు 31.03.20 తేదీదాకా రద్దు చేయబడ్డాయి. ప్రజల ప్రయాణ అవసరానికి తగిన సంఖ్యలో ప్రత్యామ్నాయ రైళ్ల లభ్యత దృష్ట్యానేగాక ఏ ఒక్క ప్రయాణికుడూ ఎక్కడా చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడని రీతిలో ఈ రైళ్లను రద్దు చేయడమైనది. ఈ రైళ్లలో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి సొమ్ము వాపసు చేయబడుతుంది.
  3. విద్యాసంస్థల ఆకస్మిక మూసివేతవల్ల ఉత్తర భారతంలో చిక్కుకుపోయిన తూర్పు-దక్షిణ-ఈశాన్య భారత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడం కోసం భారతీయ రైల్వేశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.
  4. అవసరంలేని ప్రయాణాలు మానుకోవాలని ప్రయాణికులకు ఇప్పటికే సూచించబడింది. ప్రయాణం తప్పని పక్షంలో బయల్దేరేముందు జ్వరంవంటిది లేకుండా చూసుకోవాలని సలహా ఇవ్వబడింది. ప్రయాణంలో ఉండగా ఏ సమయంలోనైనా జ్వరం సోకినట్లు అనిపిస్తే చికిత్స కోసం రైల్వే సిబ్బందిని సంప్రదించి సహాయం పొందవచ్చు.
  5. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అనవసరపు రద్దీ నివారణ దిశగా తమ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను రూ.50కి పెంచాల్సిందిగా డివిజనల్‌ రైల్వే మేనేజర్లను ఆదేశించడమైనది.
  6. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో బహిరంగ ప్రకటన వ్యవస్థద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కింద పేర్కొన్న విధంగా పాటించాల్సిన జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేయకూడని అంశాలు నిరంతరం వివరించబడుతున్నాయి:
  • తరచూ కడుక్కోవడంద్వారా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి;
  • వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించాలి; తుమ్ము లేదా దగ్గు వచ్చినపుడు నోటిని కప్పుకోవాలి;
  • జ్వరంతో బాధపడుతున్నవారు తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలి (ప్రయాణం మానుకోండి- వెంటనే వైద్యునివద్దకు వెళ్లండి);
  • రైల్వే పరిసరాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు; అలాగే...
  • సామాజిక దూరం పాటించడంలో భాగంగా శివారు రైళ్లుసహా అన్ని రైళ్లలోనూ ప్రయాణికులు గుంపుగా చేరకుండా చూసుకోవాలి.

****


(रिलीज़ आईडी: 1607233) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Tamil