ప్రధాన మంత్రి కార్యాలయం
యుఎన్‌జిఎ నేపథ్యం లో కేరికామ్ నేతల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
Posted On:
26 SEP 2019 3:30AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భం గా కేరేబియన్ దేశాల సముదాయం (కేరికామ్)కు చెందిన 14 మంది నేతల తో 2019వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు న్యూ యార్క్ లో విడి గా సమావేశమయ్యారు. దీని తో కేరేబియన్ దేశాల తో భారతదేశాని కి గల ఆత్మీయమైనటువంటి మరియు చరిత్రాత్మకమైనటువంటి సంబంధాలు ఒక నూతన గతి ని అందుకొన్నాయి. సెంట్ లూసియా ప్రధాని మరియు కేరికామ్ ప్రస్తుత చైర్ మన్ మాన్య శ్రీ ఎలన్ చెస్ట్ నెట్ ఈ సమావేశాని కి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం లో ఎంటిగువా ఎండ్ బార్ బుడా, బార్ బాడోస్, డొమినికా, జమైకా, సెంట్ కిట్స్ ఎండ్ నెవిస్, సెంట్ లూసియా, సెంట్ వింసెంట్ ఎండ్ గ్రెనెడాయిన్స్, త్రినిదాద్ ఎండ్ టొబేగో ల యొక్క మాన్య ప్రభుత్వాధినేతల తో పాటు, సూరీనామ్ వైస్ ప్రెసిడెంటు, ఇంకా గుయానా, హైతీ, గ్రెనాడా, బెలీజ్, బహామాస్ ల విదేశీ మంత్రులు కూడా పాలు పంచుకున్నారు.
ఒక ప్రాంతీయ స్థాయి లో కేరికామ్ నేతల తో ప్రధాన మంత్రి శ్రీ మోదీ జరిపిన మొట్ట మొదటి సమావేశం ఇది. ఈ సమావేశం లో ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ స్థాయిల లో చేపట్టవలసిన చర్యలు మాత్రమే కాకుండా కేరీబియన్ భాగస్వామ్య దేశాల కు మరియు భారతదేశాని కి మధ్య సంబంధాల ను మరింత గాఢతరం గా మలచుకోవడం గురించి ప్రముఖం గా చర్చించడమైంది. కేరికామ్ తో భారతదేశం తన రాజకీయ, ఆర్థిక, మరియు సాంస్కృతిక బంధాల ను దృఢపరచుకోవాలన్న నిబద్ధత తో ఉన్నదని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. కేరీబియన్ దేశాల తో స్థిరమైనటువంటి మైత్రి ని పెంపొందించుకోవడం లో పది లక్షల మంది కి పైగా ప్రవాసీ భారతీయులు హుషారైన పాత్ర ను పోషిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
రాజకీయ మరియు సంస్థాగత సంభాషణ ల ప్రక్రియల ను పటిష్ట పరచుకోవాలని, ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలని, వ్యాపారాన్ని, పెట్టుబడుల ను వృద్ధి పరచుకోవాలని, ప్రజల మధ్య సంబంధాల ను మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాలు సమావేశం లో వ్యక్తం అయ్యాయి. సామర్థ్య నిర్మాణం లోను, అభివృద్ధి పనుల కు సహాయం అందించడంలోను, విపత్తు ల నిర్వహణ లో సహకారం అందించడంలోను కేరికామ్ దేశాల తో కలసి నడుస్తామని ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్పష్టంచేశారు. ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్, ఇంకా కొయలీశన్ ఫర్ డిజాస్టర్ రిసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోను చేరవలసిందిగా కేరికామ్ సభ్యత్వ దేశాల ను ఆయన ఆహ్వానించారు. కేరిబియన్ ప్రాంతం లో మరీ ముఖ్యంగా బహామాస్ దీవి లో డోరియన్ తుఫాను కారణం గా భారీ నష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విపత్తు నేపథ్యం లో బహామాస్ కోసం ఒక మిలియన్ యుఎస్ డాలర్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని భారతదేశం అందించింది.
కేరికామ్ సభ్యత్వ దేశాల లో సాముదాయిక అభివృద్ధి పథకాల కోసం 14 మిలియన్ యుఎస్ డాలర్ల గ్రాంటు ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రకటించారు. అలాగే, జల వాయు పరివర్తన సంబంధిత పథకాల కు, నవీకరణ యోగ శక్తి పథకాల కు మరియు సౌర శక్తి ఆధారిత పథకాల కు మరొక 150 మిలియన్ యుఎస్ డాలర్ల మేర లైన్ ఆఫ్ క్రెడిట్ ను కూడా ఆయన ప్రకటించారు. గుయానా లోని జార్జిటౌన్ లో సమాచార, సాంకేతిక విజ్ఞానం రంగాని కి సంబంధించి ఒక శ్రేష్టత ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. బెలీజ్ లో ప్రాంతీయ వృత్తి విద్య సంబంధ శిక్షణ కేంద్రం యొక్క స్థాయి ని పెంచుతామని కూడా ఆయన వెల్లడించారు. కేరికామ్ దేశాల అవసరాల ను దృష్టి లో పెట్టుకొని సామర్థ్య నిర్మాణానికి ఉద్దేశించిన పాఠ్య క్రమాలు, శిక్షణ, ఇంకా భారతీయ నిపుణుల ను పంపించడం వంటి చొరవలు తీసుకొనేందుకు భారతదేశం సమ్మతి ని తెలిపింది. సమీప భవిష్యత్తు లో భారతదేశాన్ని సందర్శించవలసింది గా కేరికామ్ దేశాల కు చెందిన ఒక పార్లమెంటరీ ప్రతినిధి వర్గాన్ని శ్రీ మోదీ ఆహ్వానించారు.
ఇరు పక్షాల మధ్య సహకారాన్ని పటిష్ట పరచుకొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రతిపాదించిన కార్యక్రమాల ను కేరికామ్ దేశాల నేత లు స్వాగతించారు. వారు వారి వారి ప్రభుత్వాల పక్షాన పూర్తి మద్దతు ను అందించగలమంటూ హామీ ని ఇచ్చారు.
ఈ సందర్భం గా ఇరు పక్షాల మధ్య సహకారాని కి ఆస్కారం ఉన్న రంగాల ను గుర్తించి, ముందుకుపోవడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైంది.
**
(Release ID: 1586436)
Visitor Counter : 169