మంత్రిమండలి

పిల్లలపై లైంగిక నేరాల కు కఠిన శిక్ష

పిల్లలపై లైంగికదాడుల కు పాల్పడితే మరణశిక్ష నిబంధనలు వర్తించేలా ‘లైంగిక నేరాల నుంచి పిల్లల కు రక్షణ చట్టం-2012’ సవరణ; కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 10 JUL 2019 6:08PM by PIB Hyderabad

  ‘‘లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించాలన్న చారిత్రక నిర్ణయంలో భాగంగా ‘లైంగిక నేరాలనుంచి పిల్లలకు రక్షణ చట్టం(POCSO)-2012’లో సవరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సవరణలవల్ల పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే నేరగాళ్లకు మరణశిక్షసహా కఠిన శిక్ష విధింపునకు వీలు కలుగుతుంది. అంతేకాకుండా పిల్లలతో అశ్లీల చిత్రాలు తీయడాన్ని నిరోధించడంలో భాగంగా జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది.

ప్రభావం:

•    ఈ సవరణతో కఠిన శిక్షలు విధించే బలమైన నిబంధనలు చట్టంలో చేర్చబడతాయి. పిల్లలపై లైంగికదాడులకు పాల్పడేవారిలో ఈ చట్టం భయాన్ని పెంచి, అటువంటి ధోరణికి అడ్డుకట్ట వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

•    అంతేకాకుండా లైంగికదాడులకు గురయ్యే ప్రమాదమున్న బాలలకు వేదన నుంచి ఊరట కల్పించడంతోపాటు వారికి భద్రత, గౌరవాలను పరిరక్షించడం కూడా దీని లక్ష్యం

•    ఈ సవరణతో బాలలపై నేరాలు, సంబంధిత శిక్షలకు సంబంధించి సంపూర్ణ స్పష్టత వస్తుంది.

నేపథ్యం:

     బాలలకు లైంగికదాడులు, వేధింపులు, అశ్లీల చిత్రాల రూపకల్పనవంటి నేరాల నుంచి రక్షణ కల్పించడం లక్ష్యంగా ‘పోక్సో’ (POCSO) చట్టం-2012 అమలులోకి వచ్చింది. దీంతోపాటు బాలల శ్రేయస్సు, సంక్షేమానికీ ఇది వీలు కల్పిస్తుంది. ఆ మేరకు 18 ఏళ్లలోపువారిని బాలలుగా ఈ చట్టం నిర్వచిస్తుంది. ఈ వయోపరిమితికి లోబడి ప్రతి దశలోనూ బాలల ప్రయోజనాలు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తదనుగుణంగా లైంగితతతో సంబంధం లేకుండా పిల్లలందరి శారీరక, మానసిక, మేధో, సామాజికపరమైన అభివృద్ధికి భరోసా కల్పిస్తుంది.

*** 
 


(Release ID: 1578428)